కిడ్నాప్‌ చేశారని విద్యార్థుల డ్రామా | Students Kidnapping Drama In Kurnool | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ చేశారని విద్యార్థుల డ్రామా

Jan 28 2025 11:55 AM | Updated on Jan 28 2025 11:55 AM

Students Kidnapping Drama In Kurnool

పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే యత్నం 

ఎమ్మిగనూరులో పోలీసులకు పట్టుబడిన విద్యార్థులు  

కర్నూలు జిల్లా: పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు ఒక డ్రామా ఆడారు. తమను కిడ్నాప్‌ చేశారని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు క్షేమంగా పాఠశాలకు చేరారు. కోడుమూరు సీఐ తబ్రేజ్‌ తెలిపిన వివరాలు ఇవీ.. సి.బెళగల్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన నవీన్‌..  7వ తరగతి బీ సెక్షన్‌లో చదువుతున్నాడు. అలాగే కర్నూలులోని బుధవారపేటకు చెందిన సూర్యతేజ 6వ తరగతి ఏ సెక్షన్‌లో చదువుతున్నాడు. వీరిద్దరూ అక్కాచెల్లి అయిన లక్ష్మి, సరస్వతిల పిల్లలు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక జంపాపురానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. 

ఈ విషయం ఉపాధ్యాయులకు తెలిస్తే ఇబ్బంది పడతామని.. తమను ముఖానికి ముసుగులు వేసుకున్న కొంతమంది వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి కిడ్నాప్‌ చేశారనే విషయం మిత్రుడు నితిన్‌కు తెలిపి పాఠశాల బయటి నుంచి పొలాల్లో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నితిన్‌.. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు సూర్యపతాప్‌సింగ్, అయ్యన్న కు తెలిపారు. దీంతో వారు వెంటనే పోలీస్‌లకు సమాచారం అందజేశారు. సోషల్‌ మీడియాలో ఎస్‌ఐ సెల్‌ నంబర్‌తో గురుకుల పాఠశాల ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్‌ అంటూ కథనం హల్‌చల్‌ చేసింది. దీంతో కోడుమూరు సీఐ తబ్రేజ్‌ పాఠశాలకు చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.  ఎంపీడీఓ రాణెమ్మ, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ పురుషోత్తం, సి.బెళగల్‌ సర్పంచ్‌ పాండురంగన్న, ఎంఈఓ – 2 ఆదామ్‌బాషా.. పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

కంటపడిన విద్యార్థులు.. 
సి.బెళగల్‌ గురుకుల పాఠశాల విద్యార్థులు కిడ్నాప్‌ అంటూ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం అయ్యింది. మిన్నెల అనే వ్యక్తికి ఎమ్మిగనూరులో విద్యార్థులు కంటపడ్డారు. ఈ విషయాన్ని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌కు ఫోన్‌లో వీడియో కాల్‌ ద్వారా తెలియజేశారు. ఎమ్మిగనూరులో వ్యక్తిగత పనిపై వెళ్లిన సి.బెళగల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు గౌడ్‌కు విషయం తెలియడంతో ఆయన ఎమ్మిగనూరు పట్టణ పోలీస్‌లకు విద్యార్థులను అప్పగించారు. అనంతరం పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థులను పోలీస్‌లు విచారించారు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక తాము పారిపోయ్యామని తెలిపారు. దీనితో సీఐ, ఎస్‌ఐ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 

పాఠశాలలో ఇవీ లోపాలు.. 
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మనబడి నాడు– నేడులో భాగంగా సి.బెళగల్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 20 నూతన మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే 20 పాత మరుగుదొడ్లను మరమ్మతు చేశారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం మరో 32 కొత్త మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు.. పాఠశాల ప్రాంగణం దాటి బహిర్భూమికోసం సూదూరంగా వెళ్తున్నారు. మలవిసర్జనకు పాఠశాల బయటకు వచ్చి ఇలాంటి కథలకు చోటు చేసుకుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement