విజయవాడ ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆల్ పార్టీ నాయకులతో సమావేశంలో మాట్లాడుతున్న అనిల్ చంద్ర పునేఠా
రాజకీయ పార్టీల విజ్ఞప్తిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం: ఎస్ఈసీ పునేఠ
పోటీ చేసే అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ పత్రాలు జారీ చాలా ముఖ్యం
జాప్యం లేకుండా వాటిని జారీ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాం
కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసుల్లో నామినేషన్లపై ఇప్పుడు నిర్ణయం తీసుకోలేం
పారా మిలిటరీ పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణను పోలీస్ శాఖ దృష్టికి తెచ్చాం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్ధులు ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ రాజకీయ పార్టీల నుంచి అందిన సూచనను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం ఆయన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ సహా మొత్తం 19 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లిఖార్జునతో కలసి ఎస్ఈసీ పునేఠ విలేకరులతో మాట్లాడారు.
పోటీ చేసే ఆశావహులకు కులధ్రువీకరణ, నో డ్యూస్ పత్రాలు జారీలో జాప్యం జరుగుతోందని, ఎన్నికల్లో పారదర్శకత కోసం సీసీ టీవీ కవరేజీ పెద్ద ఎత్తున చేపట్టాలని, ఓటర్లను ప్రభావితం చేసే మద్యాన్ని నియంత్రించాలని, అభ్యర్థులకు పటిష్ట భద్రత కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థులందరికీ కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లు చాలా కీలకమని, ఆయా సర్టిఫికెట్లు తక్షణమే జారీ చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపారు.
ఆయా పార్టీల నుంచి వచ్చిన ఇతర సూచనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుందని చెప్పారు. సాధ్యమైనవి, సాధ్యమైనంత మేర అమలు చేస్తామన్నారు. కలెక్టరేట్ లేదా ఆర్డీవో కార్యాలయాల్లోనూ నామినేషన్లు స్వీకరించాలన్న వినతిపై ఆయన స్పందిస్తూ.. ఎన్నికలకు సంబంధించి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయని, వాటిని వెంటనే మార్పు చేయడం కుదరదన్నారు. ఎక్కడైనా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు లేదా కలెక్టర్లనుంచి ప్రతిపాదన వస్తే పాటిస్తామన్నారు.
పారా మిలటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్న విజ్ఞప్తులను పోలీస్‌శాఖకు పంపామని, పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్, ఎన్నికల సంసిద్ధత తెలియజేస్తూ సంబంధిత శాఖలు ధ్రువీకరణ పత్రాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపడతామని తెలిపారు. పండుగ రోజు ఎలాంటి ఎన్నికల కార్యక్రమాలు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనలు మేరకు ఓటర్ల జాబితాలపై నిర్ణయాలు ఉంటాయన్నారు.
సరిగ్గా నోటిఫికేషన్‌కు ముందు మీటింగ్‌లా?: సీపీఎం
తక్కువ వ్యవధి ఉండే స్థానిక సంస్థల ఎన్నికలను దసరా సమయంలో చేపట్టడం సరికాదని చెప్పాం. తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని కోరాం. సరిగ్గా నోటిఫికేషన్ జారీకి ముందు రాజకీయ పార్టీలతో మీటింగ్‌లు కాకుండా ముందే ఇలాంటి సమావేశం నిర్వహిస్తే బాగుండేదని చెప్పాం. నోటిఫికేషన్ జారీకి అంతా సిద్దం చేశాక పార్టీలతో మీటింగ్‌లు సరికాదు. నామినేషన్లు అన్లైన్లో కూడా సమర్పించేలా అవకాశమివ్వాలని కోరాం. కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి 24 గంటల్లో అందించాలి. – వై వెంకటేశ్వరరావు (సీపీఎం)
వ్యయ పరిమితులపై అభ్యంతరం: జనసేన
కూటమిలో భాగస్వామి పార్టీగా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు సహకరిస్తాం. అభ్యర్థి ఎన్నికల వ్యయ వ్యత్యాసాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు జనసేన తరఫున పిర్యాదు చేశాం. విశాఖలో మేయర్ వ్యయ పరిమితి రూ. 40 లక్షలుగా నిర్ణయించి కార్పొరేటర్ వ్యయం రూ. 20 లక్షలుగా నిర్దేశించడం సరికాదు. లౌడ్ స్పీకర్ల తీవ్రతను నియంత్రించాలని కోరాం. –శివశంకర్ (జనసేన)
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ఓ ట్రైలర్: సీపీఐ
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక జరిగిన పులివెందుల జడ్పీటీసీ, విద్యా కమిటీ ఎన్నికల మాదిరిగా స్థానిక ఎన్నికలు జరగకూడదని రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ను కోరాం. అధికార పార్టీ అక్రమాలకు అవి ఒక ట్రైలర్‌గా మేం భావిస్తున్నాం. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ప్రచారమే చేయకుండా చేశారు. విద్యా కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ సానుభూతి పరులు గెలవని చోట రద్దు చేశారు.
పోలీసులే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించకుండా షెడ్యూల్ వెలువడే వేళ హడావుడిగా ముగించడం సరికాదు. గ్రామాల్లో కూడా సెప్టెంబరు వరకు ఓటు అర్హత ఉన్నవారికి అవకాశమివ్వాలని కోరాం. – జగదీష్, శంకర్ (సీపీఐ)
అన్ని ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్ వద్దు: బీజేపీ
పండుగ నేపథ్యంలో మున్సిపల్, మండల జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్ కాకుండా వేర్వేరుగా ప్రకటించాలి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అభ్యర్థులకు కొత్త జిల్లాల్లో పోటీ చేసే అవకాశమివ్వాలి. పండుగ నేపథ్యంలో లౌడ్ స్పీకర్లకు అనుమతులు తదితర అంశాల్లో రాజకీయ పార్టీలకు వెసులుబాటు కల్పించాలి. అభ్యర్ధులకు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లు నిర్ణీత సమయంలో నేరుగా జారీ చేసేలా చర్యలు చేపట్టాలి. ఓటర్ స్లిప్‌లు ప్రభుత్వమే జారీ చేయాలి. – రమేష్ నాయుడు, శ్రీనివాసరాజు(బీజేపీ)
పారా మిలటరీ బలగాలతో నిర్వహించాలి: కాంగ్రెస్
మొక్కుబడిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీటింగ్ పెట్టింది. స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఆయా వర్గాలకు ఒక్క రిజర్వేషనూ రాలేదు. ప్రకాశం జిల్లాలో బీసీ, ఎస్సీలకు రిజర్వేషన్లు రాలేదు. పారదర్శక ఎన్నికల కోసం ఆన్లైన్లో నామినేషన్లు దాఖలుకు వీలు కల్పించాలి. స్థానిక పోలీసులతో ఎన్నికల నిర్వహణ వల్ల న్యాయం జరిగే అవకాశం ఉండదు. పారామిలటరీ బలగాలతో ఎన్నికలు జరపాలి. –మస్తాన్‌వలి (కాంగ్రెస్)


