కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే.. మామనే చంపిన అల్లుడు | Man Kills Father-in-Law After Being Scolded For Playing Mobile Games In AP Chittoor District, Check Details | Sakshi
Sakshi News home page

కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే.. మామనే చంపిన అల్లుడు

Aug 17 2026 7:59 AM | Updated on Aug 17 2026 1:37 PM

Son-in-Law Kills Father-in-Law After Being Scolded for Playing Mobile Games

పూతలపట్టు(యాదమరి): బంధుత్వానికి విలువ ఇచ్చి, తన కుమార్తెను చేతి లో పెట్టాడు ఆ మామ. ఏడు అడుగులు వేయించి, బంధాన్ని ముడివేస్తే... చివరకు అదే చేతులతో తన ప్రాణాలు తీస్తాడని ఆ వృద్ధుడు ఊహించలేకపోయాడు. సీమంతం వేడుకకు వచ్చిన అల్లుడు ఆ ఇంట్లోనే యముడిలా మారి మామను కిరాతకంగా హతమార్చాడు. 

కన్న కూతురినిచ్చి..! 
పూతలపట్టు మండలం, రంగంపేటకు చెందిన దినసరి కూలీ సుబ్రమణ్యం (60) తన పెద్ద కుమార్తె  బంధువైన అశోక్‌కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించాడు. బతుకుదెరువు కోసం దుబాయ్‌లో పనిచేస్తున్న అశోక్, రంగంపేటలోని బావమరిది భార్య సీమంతం వేడుక కోసం ఇటీవల ఊరికి వచ్చాడు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న సమయంలో ఆన్‌లైన్‌ రమ్మీ వ్యసనం వారి కొంపముంచింది. 

ఏడు అడుగులు వేయించిన చేతులే... 
ఆదివారం తెల్లవారుజామున 5 గంటలవుతున్నా నిద్రపోకుండా ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆడుతున్న అశోక్‌ను మామ సుబ్రమణ్యం మందలించాడు. కన్న తండ్రిలా హితవు పలికిన మామ మాటలకు ఆవేశంతో రగిలిపోయిన అశోక్‌ విచక్షణ కోల్పోయాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అల్లుడే ఉన్మాదిలా మారాడు. వృద్ధుడని కూడా చూడకుండా సుబ్రమణ్యంపై దాడి చేసి కింద పడేశాడు. ఏ చేతులతోనైతే పవిత్ర బంధాన్ని ముడివేశాడో, అదే చేతులతో మామ గుండెలపై ఎక్కి కూర్చుని పిడుగుద్దులతో బలంగా బాదాడు. ఆ దెబ్బలకు తాళలేక వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

తీవ్ర విషాదంలో కుటుంబం 
సీమంతం వేడుకతో మురిసిపోవాల్సిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. కన్న తండ్రిని కోల్పోయిన కుమార్తెలు, కళ్లముందే భర్త రాక్షసత్వాన్ని చూసిన భార్య రోదనలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి. ఘటన అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వెంకటగిరి సమీపంలో అరెస్ట్‌ చేశారు. పూతలపట్టు సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement