సాక్షి, విజయనగరం; ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దశాబ్దాలుగా సేవలందించిన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ముగియగా.. ఈ వేకువ జాము నుంచి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి చివరి విమానం ఆదివారం రాత్రి బయలుదేరింది. రాత్రి 10.45 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఆ విమానాశ్రయం నుంచి చివరి సర్వీస్‌గా నిలిచింది. అయితే.. ఇటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తొలి విమానం కూడా ఇండిగోదే కావడం గమనార్హం.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానం టేకాఫ్ కావడంతో కొత్త ఎయిర్‌పోర్ట్ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం 6E6408 భోగాపురం విమానాశ్రయంలో ఉదయం 6.38గం. తొలి దేశీయ షెడ్యూల్డ్ విమానంగా ల్యాండ్ అయింది. విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులకు ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేయడంతో పాటు ఏటికొప్పాక బొమ్మలను ప్రయాణికులకు కానుకలుగా ఇచ్చారు.
సింగపూర్ నుంచి తొలి అంతర్జాతీయ సర్వీస్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్ కూడా ప్రారంభమైంది. సింగపూర్ నుంచి వచ్చిన స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం కొత్త విమానాశ్రయంలో తొలి అంతర్జాతీయ కమర్షియల్ ఫ్లైట్‌గా రికార్డుకెక్కింది. సింగపూర్ నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం అదే విమానం ప్రయాణికులతో తిరిగి సింగపూర్‌కు బయలుదేరింది.
ఉత్తరాంధ్రకు కొత్త కనెక్టివిటీ
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి విమాన ప్రయాణ సౌకర్యాలు మరింత విస్తరించనున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్ట్ పరిమితులకు బదులుగా ఆధునిక సదుపాయాలతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీకి కేంద్రంగా మారనుంది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుగుణంగా రూపొందించిన ఈ విమానాశ్రయం ద్వారా పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
చరిత్రలో నిలిచిన మార్పు
ఒకవైపు విశాఖ విమానాశ్రయ సేవలు ముగియగా.. మరోవైపు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఇది కీలక మలుపుగా నిలిచింది.


