గ‘లీజు’ గురివింద!  | Sakshi
Sakshi News home page

గ‘లీజు’ గురివింద! 

Published Mon, Mar 4 2024 4:59 AM

Setting up of TDP offices in lands under jurisdiction of court: andhra pradesh - Sakshi

అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి టీడీఆర్‌లు కొట్టేసిన రామోజీ.. అద్దె స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా పరిహారం వసూలు 

నిన్నటిదాకా రుషికొండ.. ఇవాళ తీరానికి తూట్లంటూ బురద రాతలు 

కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో టీడీపీ కార్యాలయాల ఏర్పాటు 

అనుమతులతోనే అరబిందో సంస్థ పనులు ప్రారంభం   

సాక్షి, విశాఖపట్నం :
పచ్చకామెర్ల బాధితులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది! 
అద్దె స్థలానికి ఎసరు పెట్టిన గురివిందకు.. అనుమతులున్న స్థలాలు అక్రమమే అనిపిస్తాయి!
బంధువుల భూమినే కాజేసిన భూ రాబందుకు..సొంత భూమిలో ఎవరు నిర్మాణాలు చేపడుతున్నా గిట్టదు!

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసినట్లుగా.. తనను అక్కున చేర్చుకొని ఆదరించిన విశాఖపై బురద చల్లుతున్న ఈనాడు రామోజీ నగరానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు ఉలిక్కిపడి విషం చిమ్ముతున్నారు. ఇన్నాళ్లూ రుషికొండపై నానా యాగీ చేసిన ఈనాడు ఇప్పుడు అక్కడ భవనాలు ప్రారంభం కావడంతో మరో బురద జల్లుడు కార్యక్రమానికి తెగబడింది.

అన్ని అనుమతులూ తీసుకుని ఓ దిగ్గజ సంస్థ సొంత భూమిలో నిర్మాణాలు చేపడుతుంటే అదేదో నేరమన్నట్లుగా దిగజారుడు కథనాలను ప్రచురించింది. విశాఖ తీరానికి తూట్లు పొడుస్తున్నారంటూ రామోజీ శోకాలు పెట్టారు. విశాఖలో లక్షల ఎకరాల భూ రికార్డులను మాయం చేసిన చరిత్ర టీడీపీదే. కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూముల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న ఘనత చంద్రబాబుదే. వాస్తవానికి భీమిలిలో కొంత భూమిని కొనుగోలు చేసిన దిగ్గజ సంస్థ అరబిందో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు లోబడి అన్ని అనుమతులూ తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈనాడుకు మాత్రం అది దేశద్రోహంలా కనిపిస్తోంది. 

సంతకాలు ఫోర్జరీ..
పచ్చళ్లు అమ్ముకుంటూ వచ్చిన రామోజీని విశాఖ నగరం అక్కున చేర్చుకుంది. అయితే ఆయన తన వ్యాపార విస్తరణకు సహకరించిన నగరాన్నే మింగేసే వైట్‌ కాలర్‌ క్రిమినల్‌గా మారిపోయారు! కుటుంబ సభ్యుల్ని మోసగించిన వ్యక్తిగా... బంధువుల్ని కోర్టుల చుట్టూ తిప్పి వారి భూముల్ని కొల్లగొట్టిన వ్యాపారిగా.. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలకు మూల­పురు­షుడుగా రామోజీ మిగిలిపోయారు. విశాఖలో కబ్జాలకు, గలీజు దందాలకు ఆద్యుడిగా నిలిచారు. 1974లో విశాఖలోని సీతమ్మధారలో 2.78 ఎకరాల భూమిని, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 10 భవనాలను నెలకు రూ.3 వేలు అద్దె చొప్పున 33 ఏళ్ల లీజుకు మంతెన ఆదిత్యవర్మ నుంచి లీజుకు తీసుకున్న రామోజీ గడువు ముగిసినా ఖాళీ చేయకుండా తిరిగి కోర్టులో కేసు వేశారు.

స్థలం యజమానికి తెలియకుండా కొంత భూమిని రోడ్డు విస్తరణకు అప్పగించి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి కొంత స్థలాన్ని పొందారు. రామోజీ దాన్ని తన కుమారుడి పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారు. లీజు స్థలాన్ని తన సొంతమని పేర్కొంటూ ప్రభుత్వానికి అప్పగించటం.. ప్రతిఫలంగా పొందిన స్థలాన్ని రామోజీ రిజిస్టర్‌ చేసుకుని మోసపూరితంగా వ్యవహరించడంతో యజమాని మంతెన ఆదిత్యవర్మ క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. దీన్నుంచి తప్పించుకునేందుకు రామోజీ ఏకంగా విశాఖ జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ను ఫోర్జరీ చేయడం గమనార్హం.  ఫోర్జరీకి సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నట్లు తేలడంతో న్యాయస్థానం రామోజీపై కేసు నమోదుకు ఆదేశించగా స్టే తెచ్చుకున్నారు. దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ ఫోర్జరీకి సంబంధించి రామోజీకి చీవాట్లు పెట్టడంతో బిల్డింగ్‌ కొట్టేద్దామన్న ప్రయత్నాలు విఫలమై గత్యంతరం లేక ఆ స్థలాన్ని యజమానికి అప్పగించారు. 

కబ్జా ‘కార్యాలయం’ కనిపించలేదా?
దసపల్లా భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందులో కొంత భాగాన్ని టీడీపీ కార్యాలయం నిర్మించేందుకు కేటాయించుకున్నారు. నగరం నడిబొడ్డున సర్వే నం 1196లో 2 వేల గజాల్ని కారుచౌకగా అప్పగించేశారు. ఇది చాలదన్నట్లుగా పక్కన ఉన్న కొండని సైతం తొలిచేసి 100 నుంచి 300 గజాల్ని ఆక్రమించేసి భవనాన్ని నిర్మించుకుంటే రామోజీ కళ్లు మూసుకున్నారు. మరోవైపు ఇల్లు నిర్మించుకునేందుకు ఓ వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని ఆక్రమించిన నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ తన కలల సౌధాన్ని కట్టుకున్నారు. ఆ కబ్జా కాండ బయటకు రాకుండా రామోజీ అడ్డుపడ్డారు. దీన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడి భూ యజమానితో బేరసారాలకు దిగారు. 

విద్యాలయం పేరుతో విధ్వంసం..
టీడీపీ నేత, మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్‌ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకొని రెండు ఎకరాల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్‌ వాల్‌ నిర్మించారు. సుమారు రూ.500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత  గీతం యూనివర్శిటీ కాంపౌండ్‌ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తుంటే విశ్వవిద్యాలయాన్ని నాశనం చేస్తున్నారంటూ నాడు రామోజీ బురద చల్లేందుకు ప్రయత్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement