కృష్ణపట్నం పోర్టులో ‘ఎస్’ ట్యాక్స్‌తో ఇష్టారాజ్యంగా దోపిడీ
ఆయిల్ ట్యాంకర్ల నుంచి బలవంతపు వసూళ్లు
ఏపీ రిజిస్ట్రేషన్ ట్యాంకర్‌కు రూ.300, ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ.7 వేలు నుంచి రూ.15వేలు వసూలు
అలాగే, రోజూ 87లక్షల లీటర్ల ఆయిల్ రవాణా
ఇందులో లీటర్‌కి రూపాయి చొప్పున వసూలు
మొత్తం దందాలో ముఖ్యనేతకు నెలనెలా రూ.10 కోట్లకు పైగా వాటా
‘ఎస్’ ట్యాక్స్ దోపిడీతో విసుగెత్తి రోడ్డెక్కిన ట్యాంకర్ల యజమానులు
సాక్షి టాస్క్ ఫోర్స్: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పడిన ఆయిల్ పరిశ్రమలు, రవాణా వాహనాలపట్ల టీడీపీ మూకల ఆగడాలు శృతిమించుతున్నాయి. వీటి నిర్వాహకుల నుంచి ముక్కుపిండి మరీ లక్షల్లో ‘ఎస్’ట్యాక్స్ వసూలుచేస్తున్నాయి. ప్రభుత్వానికి చెల్లించే పన్నులతోపాటు ‘ఎస్’ ట్యాక్స్ చెల్లించకపోతే ఆయిల్ ట్యాంకర్ టైర్ కూడా కదలదంటూ సర్వేపల్లి ముఖ్యనేత అనుచరులు హెచ్చరిస్తూ చెలరేగిపోతున్నారు.
ఈ దౌర్జన్యాలు, దాదాగిరి భరించలేక.. విసిగిపోయిన తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్ల నిర్వాహకులు రోడ్డెక్కారు. అలాగే, అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగానంద్ మీడియా ముఖంగా ఇదే విషయాన్ని ఆరోపించడం పోర్టులో ‘ఎస్’ ట్యాక్స్ తీవ్రతకు అద్దంపడుతోంది. జిల్లాలో ఇప్పుడీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో బిహార్ తరహా రౌడీరాజ్యం నడుస్తోంది.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ముఖ్యనేత కనుసన్నల్లో ‘ఎస్’ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లకు తెగబడుతున్నారు. నేలటూరు ఏపీ జెన్‌కో వద్ద బూడిద రవాణా చేసే బల్కర్ల (ట్యాంకర్లు) నుంచి టీడీపీ మూకలు రౌడీమామూళ్లు వసూళ్లుచేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు అనుబంధంగా ఉన్న ఆయిల్ పరిశ్రమల వద్ద కూడా టీడీపీ మూకలు చెలరేగిపోతున్నాయి. ప్రత్యేకంగా టోల్‌గేట్ పెట్టి రోజుకు రూ.లక్షల్లో దండుకుంటున్నారు.
ప్రత్యేక టోల్‌గేట్ పెట్టి మరీ
ముత్తుకూరు మండలం పంటపాళెంలో ఉన్న ఎడిబుల్ ఆయిల్‌తోపాటు పెయింట్ ఆయిల్, బిస్కెట్ల ఆయిల్, మెడిసిన్ తయారీ ఆయిల్ పరిశ్రమలున్నాయి. వీటి నుంచి రోజుకు దాదాపు 250 ట్యాంకర్ల ఆయిల్ దేశ నలుమూలలకు రవాణా జరుగుతుంది. ఇందుకు దాదాపు వెయ్యి ట్యాంకర్లు ఉన్నాయి. వీటిల్లో ఏపీకి చెందినవి దాదాపు 300 ఉంటే.. మిగిలిన 700 ఆయిల్ ట్యాంకర్లు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, డెహ్రడూన్ రాష్ట్రాలకు చెందినవి.
టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి ఏపీకి చెందిన ట్యాంకర్లకు ‘ఎస్’ ట్యాక్స్‌ను రూ.300.. దక్షణాది రాష్ట్రాలకు చెందిన వాహనాలకు రూ.7 వేలు, ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం రూ.15 వేలు చొప్పున ‘ఎస్’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ముఖ్యనేత నుంచి పార్టీ పెద్దల వరకు ఇందులో వాటాలు వెళ్తున్నాయని ట్యాంకర్ల యజమానులు చెబుతున్నారు.
ఆయిల్‌పై లీటర్‌కి రూపాయి చొప్పున వసూలు
ఇదిలా ఉంటే.. ఆయిల్ కంపెనీలకు డీలర్లు డిపాజిట్ కట్టి ఆయిల్ కొనుగోలు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న ఇతర ఆయిల్ వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి లోకల్ జిల్లా వ్యాపారుల కనుసన్నల్లో వ్యాపారం సాగిస్తుంటారు. వీరు రోజూ రవాణా చేసే ఆయిల్‌పై లీటర్‌కి రూపాయి పచ్చమూకలు చొప్పున వసూలుచేస్తున్నాయి. దీంతో ప్రతి ట్యాంకర్ నుంచి పచ్చ మాఫియాకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు వస్తోంది.
ఇది కాకుండా మొత్తం దోపిడీ నుంచి ‘ఎస్’ ట్యాక్స్ రూపంలో ముఖ్యనేత సింహభాగం వాటా దండుకుంటున్నారు. ఇలా ప్రతిరోజు దాదాపు 250 ట్యాంకర్ల నుంచి 87 లక్షల లీటర్ల ఆయిల్ రవాణా అవుతుంది. లీటర్‌కి రూపాయి చొప్పున చూసుకున్నా రోజుకు రూ.85 లక్షల వరకు టీడీపీ మాఫియా వసూలుచేస్తోంది. ఇందులో సింహభాగం అంటే రూ.10 కోట్లకు పైగా ‘ఎస్’ ట్యాక్స్ కింద ముఖ్యనేతకు చేరుతోంది.
కాళ్లు, చేతులు తీసేస్తామని అంటున్నారు
ఇలా ‘ఎస్’ ట్యాక్స్ వసూళ్ల దందాతో విసుగెత్తిన ఆయిల్ ట్యాంకర్ల యజమానులు, వ్యాపారులు రోడ్డెక్కారు. శ్రీకాళహస్తికి చెందిన ఇద్దరు వ్యాపారులు యోగానంద్‌తోపాటు మరొకరు సర్వేపల్లి ముఖ్యనేత పేరుతో సాగుతున్న ఈ దందా వ్యవహారాన్ని మీడియా సమక్షంలో వెల్లడించారు.
వసూళ్ల దందాపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, కాళ్లు చేతులు తీసేస్తామంటూ భయపెడుతున్నారని వారు ఆరోపించారు. రెండ్రోజుల క్రితం దందాపై ప్రెస్‌మీట్ పెట్టారనే కారణంతో శ్రీకాళహస్తిలో ఉన్న తమ నివాసాలను ధ్వంసం చేయించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ‘ఎస్’ ట్యాక్స్ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.


