ఆర్టీసీ బస్సుపైకి దూసుకొచ్చిన లారీ | Road accident in Tirupati district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సుపైకి దూసుకొచ్చిన లారీ

Jun 23 2026 5:34 AM | Updated on Jun 23 2026 5:34 AM

Road accident in Tirupati district

ఇద్దరు చిన్నారుల మృతి

మరో 17 మందికి తీవ్రగాయాలు తిరుపతి జిల్లాలో విషాదం    

సాక్షి,అమరావతి/పుల్లంపేట: తిరుపతి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..తిరుపతి–కడప నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సు పుల్లంపేట మండలంలోని ఉడుంవారిపల్లె వద్దకు రాగానే..దాన్ని యర్రగుంట్ల నుంచి తిరుపతి వైపు సిమెంట్‌ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఆర్టీసీ డ్రైవర్‌ ప్రమాదాన్ని తప్పించబోయే క్రమంలో రోడ్డుకు పక్కనే వున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టాడు. అయినప్పటికీ నిద్రమత్తులో వాహనాన్ని అదుపు చేయలేక లారీ డ్రైవర్‌ బస్సును, దాని డ్రైవర్‌ వెనుక వైపు ఉన్న సీట్లను పూర్తిగా ఢీకొట్టుకుంటూ పోయాడు.

దీంతో డ్రైవర్‌ వెనుక వైపు సీట్లలో కూర్చున్న 17 మందికి కాళ్ళు, చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో శ్రీకాళహస్తికి చెందిన పురుషోత్తం(2) అక్కడికక్కడే మృతి చెందగా, నెల్లూరుకు చెందిన యశ్విత (16) గాయపడి చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మరణించింది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. అలాగే, తీవ్రగాయాలపాలైన ప్రమాదానికి కారణమైన రైల్వేకొండాపురానికి చెందిన లారీ డ్రైవర్‌ కొమ్ము నాగేంద్రను రిమ్స్‌ ఐసీయూలో చేర్చారు. ప్రమాద సమయంలో లారీని క్లీనర్‌ నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

చిన్నారుల మరణం కలచివేసింది: వైఎస్‌ జగన్‌ 
ఉడుంవారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి పురుషోత్తం, యశ్విత మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రారి్థంచారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement