
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. మృతుల్లో చిన్నారి సైతం ఉన్నట్టు తెలిసింది. అయితే, ఇసుక టిప్పర్ లారీ.. రాంగ్ రూట్ వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.