అరుదైన మొక్కకు ‘రాజశేఖరుడి’ పేరు | Sakshi
Sakshi News home page

అరుదైన మొక్కకు ‘రాజశేఖరుడి’ పేరు

Published Wed, Oct 25 2023 3:32 AM

Researchers identified a plant from the genus Lepidogathis - Sakshi

విద్యా రంగానికి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఓ అరుదైన మొక్కకు ఆయన పేరు పెట్టి యోగి వేమన యూనివర్సిటీ(వైవీయూ) గౌరవించింది. దీనిని లండన్‌లోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్, కోల్‌కతాలోని బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాతో పాటు మరికొన్ని పరిశోధక సంస్థలు ధ్రువీకరించాయి. వివరాలు.. వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌రెడ్డి, పరిశోధకుడు, ఢిల్లీలోని ఎస్‌వీ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.కె.ప్రసాద్‌ల బృందం 2020లో వైఎస్సార్‌ జిల్లా బాలుపల్లి అటవీ రేంజ్‌లోని మొగిలిపెంట ప్రాంతంలో ఓ మొక్కను గుర్తించింది.

శాస్త్రీయ పరిశోధనల అనంతరం అరుదైన మొక్కగా గుర్తించి.. నిర్ధారణ కోసం లండన్‌లోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్, కోల్‌కతాలోని బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, సౌత్‌ చైనా బొటానికల్‌ గార్డెన్, గౌన్‌డోంగ్‌ ప్రావిన్స్‌ సంస్థలకు పంపించింది. ఆయా సంస్థలు మొక్క శాస్త్రీయతను నిర్ధారించి.. అరుదైన మొక్కగా గుర్తింపునిచ్చాయి. న్యూజిలాండ్‌కు చెందిన సైంటిఫిక్‌ జర్నల్‌ ఫైటోటాక్సాలో దీనిని కవర్‌ పేజీగా ప్రచురించారు.

ప్రపంచం మొత్తం మీద శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే మొక్కగా నిర్ధారణ అవ్వడంతో.. ఈ ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టుకునే వెసులుబాటు లభించింది. దీంతో పరిశోధకులు, అధికారులు చర్చించి.. వైవీయూ వ్యవస్థాపకుడు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించిన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. 

ఔషధ విలువలు అధికం
లెపిడోగాథిస్‌ జాతికి చెందిన ఈ మొక్కకు ప్రజాతిగా ‘రాజశేఖరే’(లాటిన్‌ భాష) పేరును కలిపి నామకరణం చేశారు. లెపిడోగాథిస్‌ జాతికి చెందిన మొక్కలు ప్రపంచవ్యాప్తంగా 144 ఉండగా.. ఇప్పుడు 145వ మొక్కగా ‘లెపిడోగాథిస్‌ రాజశేఖరే’ గుర్తింపు పొందింది. భారత్‌లో 34 మొక్కలు ఉండగా.. ఇది 35వది. ఏపీలో 8 మొక్కలు ఉండగా.. ఇది తొమ్మిదవది. ఈ జాతికి సంబంధించిన మొక్కలను స్థానిక భాషలో ముళ్లబంతి, సూర్యకాంతం తదితర పేర్లతో పిలుస్తారు.

ఔషధ విలువలు కూడా ఉండటంతో.. సంరక్షించాల్సిన జాతుల కింద వీటిని గుర్తించారు. జ్వరం, ఎగ్జిమా, సోరియాసిస్, ఎపిలెప్సీ, దురద, మౌత్‌ అల్సర్, కీటకాల కాటు, దెబ్బలు తదితర చికిత్సలకు వీటిని వినియోగిస్తారని వైవీయూ వృక్షశాస్త్ర విభాగ ప్రొఫెసర్‌ డా.ఎ.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ మొక్కలకు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మాత్రమే పూలు పూస్తాయని చెప్పారు. వైవీయూలోని బొటానికల్‌ గార్డెన్‌లో సంరక్షిస్తున్నట్లు చెప్పారు. –వైవీయూ (వైఎస్సార్‌ జిల్లా)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement