యానాంలో వైఎస్సార్ స్మృతి మందిరం.. ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేవీపీ, రఘువీరారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పళ్లంరాజు
యానాం: ప్రజా సంక్షేమంపై అంకిత భావం ఉన్న నాయకుడిగా, పేదల పరిరక్షకుడిగా, రైతుల్ని కాపాడే నేతగా, సేవాభావంతో అందరి హృదయాలపై చెరగని ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని పలువురు నేతలు అన్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ స్మృతి మందిరాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సుమారు రూ.2 కోట్ల సొంత నిధులతో దీనిని నిర్మించారు. ఈ మందిరం ప్రారంభం సందర్భంగా మల్లాడి రచించిన ‘ఆత్మీయులు రాజన్న స్మృతిలో’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మల్లాడి మాట్లాడుతూ.. యానాం నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్ అందించిన సహాయ సహకారాలను గుర్తు చేశారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, నాయకులు కేవీపీ రామచంద్రరావు,చిన్నారెడ్డి, విజయసాయిరెడ్డి, పల్లంరాజు, రఘువీరారెడ్డి, కొణతాల రామకృష్ణ, గిడుగు రుద్రరాజు,ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.


