
జగ్గయ్యపేట అర్బన్: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్టణంలో సోమవారం రాత్రి జరిగింది. కాగా మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కి ఆందోళన చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం రూ.12 లక్షలకు సెటిల్‌మెంట్ చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. పట్టణంలోని విలియంపేటకు చెందిన గర్భిణి అయిన జరుగుమల్లి జాయ్(28)కు నెలలు నిండటంతో ప్రసవం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం జాయిన్ అయ్యారు.
కాగా రాత్రి సమయంలో వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో జాయ్‌తో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా మృతిచెందింది. దీంతో ఆగ్రహానికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) రంగంలోకి దిగి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి రూ.12లక్షల సెటిల్‌మెంట్‌కు మృతురాలి కుటుంబ సభ్యులను ఒప్పంచారని తెలుస్తోంది. మృతురాలికి భర్త వంశీ, ఏడేళ్ల కూతురు ఉంది.
పర్యవేక్షణ లేకనే..
ప్రైవేటు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో మందులను ఉపయోగిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.