వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆగ్రహం
గతంలోనూ ఆసుపత్రి యాజమాన్యంపై పలు ఆరోపణలు
తాడేపల్లిగూడెం అర్బన్: గ్యాస్ నొప్పితో శనివారం ప్రైవేట్ ఆసుప్రత్రిలో చేరిన ఓ ఉద్యోగిని సాయంత్రానికి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని ఉద్యోగిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సదరు ఆసుపత్రిపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కంచర్ల శ్రావణి (38) సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె శనివారం ఉదయం కార్యాలయానికి విధులకు హాజరైంది. ఆ సమయంలో గ్యాస్ నొప్పి రావడంతో పట్ణణంలోని ప్రభుత్వ అర్బన్ హెల్త్ సెంటర్‌కు వెళ్లి చూపించుకోగా అక్కడి వైద్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి సిఫార్సు చేశారు. దాంతో శ్రావణి ప్రైవేటు ఆసుత్రికి ఉదయం 11 గంటల సమయంలో వెళ్లగా ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స ప్రారంభించారు.
విషయం తెలుసుకున్న శ్రావణి బంధువులు ఆసుపత్రికి చేరుకొని ఆమెకు ఆరోగ్యం ఎలా ఉందని సమాచారం కోరగా.. ఇప్పుడు ఆమెను చూసే అవకాశం లేదు, వైద్యం అందిస్తున్నాం వేచి ఉండమని వైద్యులు సర్దిచెప్పారు. సాయంత్రం 5 గంటల సమయంలో శ్రావణి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో శ్రావణి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి తమను చూడనివ్వకుండా అడ్డుకున్నారని.. ఇప్పుడు చనిపోయిందని చెప్పడమేంటని కన్నీరుమున్నీరయ్యారు. రూ.45 వేలు విలువైన ఇంజక్షన్ చేశామని ఇప్పటి వరకు అందించిన వైద్యానికి సొమ్ములు చెల్లించకపోతే మృతదేహాన్ని అప్పగించమని వైద్యులు హెచ్చరించారు. దీంతో మృతురాలి బంధువులు తమకు తెలిసిన వారితో సిఫార్సు కోసం ప్రయత్నించగా ఆసుపత్రి యాజమాన్యం కనికరించలేదు.
ఆ ఆసుపత్రిలో వైద్యంపై ఆరోపణలు
గతంలో ఈ ఆసుపత్రిని ప్రారంభించిన ఏడాది కాలంలోనే సుమారు వరుసగా ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు. ఆసుపత్రిని ప్రారంభించిన నాటి నుంచి రెండేళ్లలో రోగులు ఎక్కువగా చనిపోవడంతో యాజమాన్యం ఆసుపత్రిని కొంతకాలం మూసివేశారు. అనంతరం ఇటీవల గతంలో ఆసుపత్రిని నిర్వహించిన వారి బంధువులే తిరిగి పేరు మార్చి ఆసుపత్రిని ప్రారంభించారు. పునఃప్రారంభించిన ఏడాది కాలంలో ఇప్పటికి సుమారు ఆరుగురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వ అ«ధికారులు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడలని స్థానికులు కోరుతున్నారు.


