
న్యాయం చేయాలని పోలీసులకు వినతులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 98 ఫిర్యాదులు
చట్ట పరిధిలో విచారిస్తామన్న ఏఎస్పీ సౌజన్య
నెల్లూరు(క్రైమ్): ‘నంద్యాలకు చెందిన కె.రమేష్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడుగుతుండగా మొహం చాటేసి మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని కొడవలూరుకు చెందిన ఓ యువతి కోరారు. ‘వింజమూరు ప్రాంతానికి చెందిన బాబు ప్రేమిస్తున్నాని, పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరం కలిసి సహజీవనం చేశాం. పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరిస్తున్నాడు’ అని ఉదయగిరికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 98 మంది విచ్చేసి తమ ఫిర్యాదులను ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ చెంచు రామారావు, డీటీసీ ఇన్‌స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
⇒ కువైట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని అనంతసాగరానికి చెందిన తులసీధర్ నమ్మించాడు. రూ.3 లక్షల నగదు తీసుకుని కువైట్‌కు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించలేదు. నగదు తిరిగివ్వలేదు. ఇటీవల నిలదీయగా చంపుతానని బెదిరిస్తున్నాడని అనంతసాగరానికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు.
⇒ నా భర్త మరణించాడు. అత్తింటివారు ఆయన ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాకు జీవనాధారం కష్టమైంది. అవస్థలు పడుతున్నానని కొండాపురానికి చెందిన ఓ మహిళ అర్జీ సమర్పించారు.
⇒ నా కుమార్తె ఈనెల రెండో తేదీ నుంచి కనిపించడం లేదు. మా మండలానికి చెందిన ఓ యువకుడిపై అనుమానం ఉంది. విచారించి కుమార్తె ఆచూకీని తెలియజేయాలని లింగసముద్రంకు చెందిన ఓ మహిళ కోరారు.
⇒నాకు ముగ్గురు కుమారులు. నా పేరుపైనున్న ఆస్తులు పంచాలని కొడుకులు, కోడళ్లు వేధిస్తున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేశారు.
⇒ నెల్లూరుకు చెందిన పృథ్వీరాజ్‌తో నాకు వివాహమైంది. అతను వ్యసనాలకు బానిసై అదనపుకట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని తమిళనాడుకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.
⇒ నా భర్త చైన్నెలో పనిచేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అతను మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. చైన్నెలో మరో వివాహం చేసుకున్నట్లు ఫొటోలు పంపాడు. విచారించి చర్యలు తీసుకోవాలని వెంకటాచలసత్రంకు చెందిన ఓ వివాహిత కోరారు.