
నెల్లూరులోని కళాశాల హాస్టల్‌లో ఘటన
కళాశాల, హాస్టల్‌ను ఖాళీచేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సిబ్బంది
యాజమాన్యం, సిబ్బంది ఫోన్లు స్విచ్ ఆఫ్‌తో అనుమానాలు
కళాశాలలో ఫర్నీచర్ ధ్వంసం చేసిన మృతురాలి బంధువులు
కాలేజీ ఎదుట విద్యార్థిసంఘాల ఆందోళన
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇంటర్ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఆమె హాస్టల్ బాత్‌రూమ్‌లో ఉరేసుకున్నట్లు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకుమార్తె హేమశ్రీ (16) నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్‌ఎన్‌ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది.
చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను మరో సెక్షన్‌కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. హేమశ్రీ చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలని కళాశాల సిబ్బందిని కోరారు. శనివారం రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆదివారం ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియోకాల్ చేసి మాట్లాడింది. వారు తాము నెల్లూరు వచ్చి ప్రిన్సిపల్‌తో మాట్లాడతామని చెప్పారు.
తరువాత కొంతసేపటికి హేమశ్రీ అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పారు. వారు వచ్చేసరికే ఆమె మరణించింది. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే హేమశ్రీ మృతిచెందిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిసంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లారు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు.
హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడున్న ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు కళాశాలకు చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇ¯న్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కళాశాల వద్దకు చేరుకుని బాధిత తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.

చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య
హాస్టల్ బాత్‌రూమ్‌లను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ ఉరేసుకున్న హేమశ్రీని గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హాస్టల్ సిబ్బంది, యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, హాస్టల్‌ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. విద్యార్థిసంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు కోరారు.