
గౌరవంగా ఉండే వేమిరెడ్డి వీధిన పడ్డారా ?
వైఎస్సార్‌సీపీలో ఎనలేని ఆదరణ.. గౌరవం
నేడు వీధి స్థాయి నేతలుగా మారిపోయిన వైనం
ఎలా ఉండేవాళ్ళు ఎలా అయ్యారు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నపుడు వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు ఎంతో గౌరవంతో ఉండేవారు.. ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఉంటూ దేశంలోని పలుచోట్ల శ్రీవారి ఆలయాల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.. ఇంటా బయటా గౌరవం.. గుర్తింపుతో ఉండేవారు.
నాడు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఒక జంటిల్మెన్ అనే ట్యాగ్ లైన్‌తో ఉండేవారు.. వైఎస్ జగన్‌తో పాటు పార్టీ నేతలు.. సభ్యులు.. సహచర ఎంపీలు.. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రభాకర్ రెడ్డికి ఎనలేని గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఆయన టీడీపీలో చేరి నెల్లూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంట్లో భార్యాభర్తలకు రెండు పదవులు రావడం వరకూ సంతోషమే కానీ.. పదవులు రావడం.. వారికి ఇది వరకు సమాజంలో ఉన్న గౌరవం పోవడం ఒకేసారి జరిగిపోయింది.
పదవులు వచ్చినంత త్వరగా గౌరవమర్యాదలు పోవడం మొదలైంది. సంపన్నులైన వేమిరెడ్డి దంపతులు ప్రజా జీవితంలో ఉంటే తమకు మంచి లాభం అని భావించిన టీడీపీ జనసేన నేతలు వారు గెలవగానే ఇప్పుడు నిజరూపం చూపిస్తున్నారు. ప్రశాంతి పేరు చెప్పి టీడీపీ జనసేన నేతలు కోవూరులో రౌడీయిజం చేయడం మొదలెట్టారు. ఎక్కడికక్కడ దందాలు.. సెటిల్మెంట్లు.. గూండాగిరితో సమాజాన్ని హడలెత్తిస్తున్నారు. అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిమీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్లకు వాళ్ళు సమర్థించుకున్నా కానీ వేమిరెడ్డి ఫ్యామిలీకి బాగా డ్యామేజ్ చేసింది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అంత మాత్రానికే ఇంటి మీదకు వెళ్లి రౌడీయిజం చేయడమా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇసుక.. మద్యం.. గ్రావెల్ అంటూ ఆమె అనుచరులు దందా చేస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
దీంతోబాటు నెల్లూరులో క్వార్ట్జ్ ఖనిజం పేరిట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీలు చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. దేశ విదేశాలకు లక్షల టన్నుల ఖనిజం ఎగుమతి చేయడం.. ఇందులో చాలావరకు అక్రమంగా తవ్వింది ఉందని తేటతెల్లం అవడంతో ఆయన సైతం సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభాకర్ రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీలు అడ్డగోలుగా ఖనిజాలు తవ్వేస్తూ వనరులను కొల్లగొడుతున్నట్లు ప్రభుత్వం వద్ద కూడా రికార్డులు ఉన్నాయి. పైగా మైనింగ్ శాఖ కూడా లోలోన ఇదే రిపోర్ట్ పంపింది. మొత్తానికి డబ్బు.. పదవి వచ్చినంత వేగంగా వేమిరెడ్డి పరపతి దిగజారిపోయింది.
ఇక జనంలో విమర్శలు.. వైఎస్సార్‌సీపీ నాయకుల పోరాటాలు చూసి వేమిరెడ్డి ఏమనుకున్నారో ఏమో ఇక తానూ మైనింగ్ వ్యాపారం నిలిపివేస్తాను అని ప్రకటించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు ముందురోజే ఆయన మీడియాతో మాట్లాడుతూ తానింకా వ్యాపారం చేయలేనని అన్నారు. వ్యాపారాలు మూసేస్తున్నానని ప్రకటించారు. గౌరవం సైతం చిల్లుకుండలోని నీరులా రోజురోజుకూ తగ్గిపోతోంది.. గతంలో గౌరవంగా ఉండే వేమిరెడ్డి కుటుంబం ఇప్పుడు పరువు.. పరపతి కోల్పోయి అవమానకర పరిస్థితుల్లో పదవుల్లో కొనసాగుతున్నారని నెల్లూరు జనం చెప్పుకుంటున్నారు..
-సిమ్మాదిరప్పన్న.