నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్‌.. | AP Police Misbehave With Woman | Sakshi
Sakshi News home page

నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్‌..

Aug 12 2025 6:11 AM | Updated on Aug 12 2025 10:33 PM

AP Police Misbehave With Woman

న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన గిరిజన మహిళకు ఎస్‌ఐ బెదిరింపులు 

కోరిక తీర్చాలంటూ వేధింపులు

రాత్రిళ్లు నగ్నంగా వీడియో కాల్స్‌

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కిన ఓ గిరిజన మహిళను ఆ స్టేషన్‌ ఎస్‌ఐ లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తే.. కేసులో న్యాయం చేస్తానని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించాడు. రాత్రి వేళల్లో పదే పదే వీడియో కాల్స్‌ చేసి వేధించేవాడు. దీంతో బాధిత మహిళ తన భర్తకు విషయం చెప్ప­గా.. ఆయన కూడా ఎస్‌ఐని బతిమాలినా ఆ ఎస్‌ఐ వెనక్కు తగ్గలేదు. ఆమె కదలికలపై నిఘా పెట్టి ఆమెను వెంబడించి వేధించేవాడు. మంత్రి సత్యకు­మా­ర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్య­సాయి జిల్లా ధర్మవరం నియో­జకవర్గం ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ వేధింపులతో ఆ యువతి తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోంది. 

వెంబడించి మరీ వేధింపులు 
గరుగుతండాకు చెందిన భార్యాభర్తల విడాకుల కేసులో భాగంగా ఆ భార్యకు రావాల్సిన భర­ణం గురించి మాట్లాడేందుకు ఇటీవల పట్నం పోలీస్‌స్టేషన్‌కు ఆమె బంధువులు వెళ్లారు. ఆ మహిళకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి వెళ్లిన పాపానికి ఎస్‌ఐ తనను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఎస్‌ఐ తనకు నగ్నంగా చేసిన వీడియో కాల్స్‌ను రికార్డ్‌ చేసినట్టుగా ఆమె చెప్పింది. ఇటీవల తాను వ్యక్తిగత పని మీద అనంతపురం వెళ్తే.. ఎస్‌ఐ రాజశేఖర్‌ తనను వెంబడించి తన వద్దకు వచ్చి వాహనంలోకి ఎక్కాలంటూ బలవంతపెట్టాడని కన్నీటి­పర్యంతమైంది. 

మహిళలకు రక్షణ కల్పించా­ల్సి­న అధికారే తమను ఇలా వేధిస్తుంటే.. ఇక తాము ఎవరికి చెప్పుకోవాలంటూ బాధిత మహిళతో పాటు, ఆమె బంధువులు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నా­రు. కాగా, ఎస్‌ఐ రాజశేఖర్‌ ప్రవర్తనపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement