
ప్రసన్నకుమార్‌రెడ్డి ఇచ్చిన ఫొటోల్లో దాడికి పాల్పడిన వ్యక్తులున్నారుగా?
మరి వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు?
ప్రసన్న ఫిర్యాదుపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది?
పూర్తి వివరాలు సమర్పించండి.. దర్గామిట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: ‘‘కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి నిందితుల జాబితాలో ఎవరినీ ఎందుకు చేర్చలేదు? ప్రసన్న సమర్పించిన ఫొటోల్లో దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్పష్టంగా ఉన్నారు కదా? వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు..?’’ అని హైకోర్టు ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా దర్గామిట్ట పోలీసులను ప్రశ్నించింది.
ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు పురోగతి వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. గురువారం ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీ చేశారు. తన ఇంటిపై దాడి గురించి ఫిర్యాదు ఇచ్చినా సకాలంలో కేసు నమోదు చేయలేదని, తర్వాత కేసు నమోదు చేసినా, దాడి చేసినవారిని నిందితులుగా చేర్చలేదని, ఈ విషయంలో పోలీసులపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రసన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు.
ప్రశాంతిరెడ్డి ప్రోద్బలంతోనే దాడి...
పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రూపేష్ కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. దాడికి పాల్పడినవారి ఫొటోలను, ఆ ఘటన సీసీ ఫుటేజీని పిటిషనర్ పోలీసులకు సమర్పించారని తెలిపారు. అయినా పోలీసులు కేసు నమోదులో విపరీతమైన జాప్యం చేసి, దాడి బాధ్యులను నిందితులుగా చేర్చలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల స్థానంలో గుర్తుతెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రోద్బలంతో... పిటిషనర్ ఇంటిపై దాడి జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు.
పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) ఎ.జయంతి వాదిస్తూ, ఎవరిని నిందితులుగా చేర్చాలన్నది పోలీసుల విచక్షణకు సంబంధించినదని తెలిపారు. దర్యాప్తు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలన్నది పిటిషనర్ నిర్దేశించలేరన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు జరిపారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతి ఏమిటో చెప్పాలని పోలీసులను ఆదేశించారు. అలాగే నిందితులుగా ఎవరినీ ఎందుకు చేర్చలేదో కూడా చెప్పాలన్నారు.