
వైఎస్సార్‌సీపీ కీలక నేతలు రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డిలపై తదుపరి చర్యలొద్దు
సాక్షి, అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌సీపీ కీలక నేతలు లింగాల రామలింగారెడ్డి, నంద్యాల హేమాద్రిరెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద తప్పుడు కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిం ది. వీరిపై నమోదైన కేసులో తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సోమవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీచేశారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేస్తున్న తమపై వైఎస్సార్‌సీపీ నేతలు లింగాల రామలింగారెడ్డి, మరికొందరు దాడిచేసి గాయపరిచారంటూ టీడీపీకి చెందిన ధనుంజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారు. ఇది కొట్టేయాలని కోరుతూ రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు.
ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదు..
పిటిషనర్ల తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పిటిషనర్లపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడవ జరిగితే, దానిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేయడం చెల్లదన్నారు. పైగా.. బాధితుడు ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి అయితేనే ఆ చట్టం కింద కేసు పెట్టడానికి వీలుంటుందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకే పిటిషనర్లపై పోలీసులు ఈ తప్పుడు కేసు నమోదుచేశారన్నారు.
అనంతరం.. పోలీసుల తరఫున పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరపాల్సి ఉందన్నారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని పిటిషనర్లపై తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు. ఈలోపు ఫిర్యాదుదారు ధనుంజయకు నోటీసులు అందజేయాలని పీపీకి సూచించారు.