
పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట
మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ వ్యక్తి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
అక్కడ ఎస్సై దురుసు ప్రవర్తనతో ఆయనకు గుండెపోటు
అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు.. పరిíస్థితి విషమం
కోపోద్రిక్తులైన గ్రామస్తులు.. స్టేషన్ ముట్టడి
ఎస్సైను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు
చివరికి ఆయన క్షమాపణలతో పరిస్థితి అదుపులోకి
ఉదయగిరి/వరికుంటపాడు: మైనింగ్ మాఫియాకు మద్దతుగా పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్సై కె. రఘునాథ్ దురుసు ప్రవర్తనతో పోలీస్‌స్టేషన్ వద్ద రోజంతా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలివీ.. మండల కేంద్రం వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లిలోని పల్లతిప్పలో మైనింగ్‌కు వ్యతిరేకంగా, పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ ఏకమై వారం రోజులుగా పోరుబాట పట్టారు. ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీకి చెందిన బూత్ కన్వీనర్ షేక్ పీరయ్యను విచారణకు రమ్మంటూ మూడ్రోజులుగా పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు.
ఈ క్రమంలో.. సోమవారం ఉ.6 గంటలకు ముగ్గురు కానిస్టేబుల్స్ వచ్చి పీరయ్య తన షాపులో ఉండగా బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న కొంతమంది పీరయ్యను అనుసరిస్తూ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, పోలీసులు పీరయ్యను ఒక్కడినే లోపలికి తీసుకెళ్లి, మిగతా వారిపై దురుసుగా ప్రవర్తించి పంపించివేశారు. ఎస్సై రçఘునాథ్ తెల్లకాగితంపై పీరయ్యతో సంతకం చేయించే విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో పీరయ్య గుండెపోటుకు గురై కుప్పకూలారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతనిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి ఒంగోలు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించారు.
స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు
ఇది తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు మొత్తం స్టేషన్ వద్దకు చేరుకుని జాతీయ రహదారిపై రాస్తారోకోకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. స్టేషన్ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ ఎస్సై గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకోవడంతో వారు స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం జోరు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో భారీగా పోలీసు బలగాలను దించారు.
ఎస్సై క్షమాపణతో శాంతించిన గ్రామస్తులు
పీరయ్యను ఎందుకు స్టేషన్‌కు బలవంతంగా తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు నిలదీయగా, ఎస్సై రఘునాథ్ వచ్చి ఉద్యమంలో ఉన్న ఎనిమిది మందిపై కేసు నమోదుచేశామని, అందులో భాగంగా విచారణ కోసం తీసుకొచ్చినట్లు చెప్పారు. అయినా శాంతించని గ్రామస్తులు రాత్రి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. చర్చలకు అçహ్వానం పంపినా, ఎస్సైను సస్పెండ్‌చేసే వరకు స్టేషన్ నుంచి కదలబోమని భీష్మించి కూర్చున్నారు. రాత్రి ఏడు గంటలకు ఎస్సై రఘునాథ్ వచ్చి గ్రామస్తులకు క్షమాపణ చెప్పడంతో వారు వెనుదిరిగారు.