
వైఎస్సార్‌సీపీకి పట్టు ఉన్న పల్లెల్లో పోలింగ్ బూత్‌ల మార్పిడి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ కుట్రలు, కుతంత్రాలు
నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లె కొత్తపల్లె, నల్లగొండువారిపల్లెలో మాయాజాలం
ఓటు వేసేందుకు ఎక్కువ మంది వెళ్ల కూడదని ఎత్తుగడ.. అల్లర్లు సృష్టించి పోలింగ్ శాతం పెరగకుండా అడ్డుకునే పన్నాగం
గతంలో ఏ గ్రామం వారికి ఆ గ్రామంలోనే ఓటు
ఇప్పుడు బూత్‌లను మార్చిన ఎన్నికల కమిషన్
ఈ కారణంగా దాదాపు 4 కిలోమీటర్లు వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి.. టీడీపీ కుట్ర రాజకీయానికి సహకరిస్తున్న అధికార గణం
టీడీపీ ప్రభావం నుంచి ఎన్నికల సంఘం బయటకు రావాలి : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై వరుస దాడులు
బందిపోట్ల తరహాలో సమ్మెట, రాడ్లతో బీభత్సం
ముందురోజు సురేష్ కుమార్‌రెడ్డి, అమరేష్ రెడ్డి, తదితరులపై దాడి..
మర్నాడే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రామలింగారెడ్డిపై ఏకంగా హత్యాయత్నం
దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.. పైగా బాధితులపైనే కేసులు
తాజాగా వాళ్ల ఫ్లెక్సీ వారే చింపేసి.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసు
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏం చేస్తారో చేయండి.. అక్కడ మనం బలం చాటుకోవాలి.. ఎప్పటికప్పుడు మీకు ఏ సహాయం కావాలో చెబితే వెంటనే అందే ఏర్పాటు చేస్తాం.. అధికారులంతా మీకు సహకరిస్తారు.. రాష్ట్రంలో అందరి దృష్టీ ఆ ఎన్నికపైనే ఉండాలి’ అని ‘ముఖ్య’ నేత కొందరు టీడీపీ నేతలకు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేయడం వల్లే కొద్ది రోజులుగా ఇక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. స్థానిక టీడీపీ నేత బీటెక్ రవి, మరికొందరు నేతలు రెచ్చిపోతున్నారని స్పష్టమవుతోంది.
ఈ క్రమంలో చోటు చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, తప్పుడు కేసులు, భయభ్రాంతులకు గురి చేయడాలు, ప్రలోభాలు.. ఇలా ఏవీ ఫలితమివ్వక పోవడంతో తాజాగా మరో కుట్రకు తెరలేపారు. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గించి, అధికార టీడీపీకి మేలు చేకూర్చాలన్న కుట్రలకు పదును పెడుతున్నారు. ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేస్తున్నారు.
పులివెందుల మండలంలోని ఎర్రబల్లె కొత్తపల్లె పంచాయతీలో 6, 7 నంబర్ల పోలింగ్ బూత్‌లు, నల్లగొండువారిపల్లెలో పోలింగ్ బూత్ 8, నల్లపురెడ్డిపల్లెలో 9, 10, 11 బూత్‌లు ఉన్నాయి. ఇది వరకు ఏ గ్రామానికి చెందిన ఓటర్లు ఆ గ్రామంలోని పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునే వారు. తాజాగా ఎర్రబల్లె కొత్తపల్లె ఓటర్లు నల్లపురెడ్డిపల్లె బూత్‌లలో, నల్లపురెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె కొత్తపల్లె బూత్‌ల పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు.
ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో పలువురు అవాక్కవుతున్నారు. ఇలాగైతే తాము మూకుమ్మడిగా పోలింగ్ బహిష్కరిస్తామని నల్లగొండువారిపల్లె గ్రామస్తులు అధికారులకు తేల్చి చెప్పారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా మార్చారని ఆరా తీస్తే.. టీడీపీ నేతల కుట్రను అధికారులు అమలు చేస్తున్నారని స్పష్టమైంది.
పోలింగ్ శాతం తగ్గించడమే లక్ష్యం
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి. అందులో కణంపల్లె, కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె పంచాయతీల్లో 65 శాతం ఓటర్లు ఉన్నారు. ఆయా పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీకి గట్టి పట్టు ఉంది. ఈ పరిస్థితిలో అక్కడి ఓటర్లు ఓట్లు వేస్తే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు సునాయాసం. ఈ క్రమంలో ఓటర్ల బూత్‌లను తారుమారు చేశారు. దీంతో స్వల్ప వివాదాలు తలెత్తినా.. అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు స్వతహాగా నిరాసక్తత చూపుతారన్నది అధికార పార్టీ నేతల ఎత్తుగడ.

పైగా ఓటింగ్ వెళ్లే దారిలో ప్రలోభ పెట్టేందుకు, భయభ్రాంతులకు గురిచేసేందుకు అవకాశం ఉంటుందని కూడా ఎత్తు వేసినట్తు తెలుస్తోంది. దీంతోపాటు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేయడం మొదలెట్టారు. ఇంకోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పడిన ఓట్లు ఎక్కువగా చెల్లనివిగా చేసేందుకు బ్యాలెట్ పేపర్ ముద్రించడంలో కూడా ఎత్తుగడలు వేశారని తెలుస్తోంది. 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్క పేజీలో బ్యాలెట్ పేపర్ ముద్రిస్తే సరిపోతుంది. అలా కాకుండా డబుల్ సైడ్ గుర్తులు ఇస్తూ బ్యాలెట్ ముద్రించేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం.
తద్వారా ఒకటవ గడిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి గుర్తుపై ఓటు వేయడం ద్వారా ఆ ఓటు చెల్లకుండా పోవాలనే కుట్ర దాగి ఉంది. ‘ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. మెరుగైన సమాజం కోసం ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించండి. ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొనండి.. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి’ అన్న ప్రచారానికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా సరే గెలవడానికి ఓటర్లను గందరగోళానికి గురి చేసి, పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా చేయాలన్న ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు.
రోజుకో దాడితో భయభ్రాంతులకు గురిచేసే ఎత్తుగడ
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ చంద్రబాబు అండ్ గ్యాంగ్ బరితెగించి కుట్రలు, కుతంత్రాలకు తెర లేపింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే గెలుపు దరిదాపులకు వెళ్లడం అటుంచి.. డిపాజిట్ కూడా దక్కదనే విషయం తెలిసి రౌడీయిజంతో బందిపోట్ల తరహాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేందుకు దాడులకు తెగబడింది.
ఇందులో భాగంగా మంగళవారం పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్‌లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్‌రెడ్డిలపై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఏమాత్రం పట్టించుకోలేదు. బుధవారం నల్లగొండువారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై బందిపోటు దొంగల ముఠా తరహాలో టీడీపీ రౌడీ మూకలు మెరుపు దాడి చేశాయి.
ఒక్కసారిగా దాదాపు 100 మంది రాడ్లు, కర్రలు, ఇతర మారుణాయుధాలతో వారిని చుట్టుముట్టి మట్టు బెట్టేందుకు యత్నించారు. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి.
ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చ్యునర్, స్కార్పియో వాహనాలనూ సమ్మెటలతో ధ్వంసం చేశారు. రామలింగారెడ్డి ఉన్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయారు. గ్రామస్తులు ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో రౌడీ మూకలు పారిపోయాయి. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలోనే పోలీసు క్యాంప్ ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం.
ఫ్లెక్సీని వారే చింపేసుకుని వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు
సాక్షి, టాస్క్ ఫోర్స్: పులివెందులలో కూటమి నాయకులు, పోలీసుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఓబుల్ రెడ్డి పేరుతో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై పులివెందుల పోలీసులు అదే గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకుడు శంకర్ నారాయణకు ఫోన్ చేసి, అక్కడ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని సూచించారు.
దీనిపై శంకర్ నారాయణ స్పందిస్తూ.. ఆ ఫ్లెక్సీని తొలగించాల్సిన అవసరం తనకు లేదని బదులిచ్చారు. అనంతరం కొద్ది గంటల్లోనే శంకర్ నారాయణతో పాటు మరో ముగ్గురిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ధ్వంసం చేశారంటూ వారిపై కేసు నమోదు చేశారు. కూటమి నాయకుల ఆదేశాలతో పోలీసులు ముందస్తు వ్యూహంలో భాగంగా ఈ అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.