
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ గురుమూర్తి తదితరులు
వర్చువల్ విధానంలో పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
తిరుపతిలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ గురుమూర్తి
ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్యాంపస్ అభివృద్ధి
విద్యార్థుల నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఇది కేంద్ర బిందువుగా మారుతుందన్న ఎంపీ
ఏర్పేడు: తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో రూ.1,243 కోట్లతో చేపట్టిన ఫేజ్–బి అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తం రూ.60 వేల కోట్లతో ఎనిమిది ఐఐటీలతోపాటు, వివిధ రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడ నుంచి ఆయన వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. తిరుపతిలో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి హాజరై ఐఐటీ యాజమాన్యం, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఐఐటీల్లో తిరుపతి ఐఐటీ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సెమీకండక్టర్లు, శక్తి నిల్వ వంటి రంగాలలో జరుగుతున్న ముఖ్యమైన పరిశోధన కార్యకలాపాల గురించి వివరించారు. ఇక్కడ భవన నిర్మాణాలు మాత్రమే జరగటంలేదని, యువత ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం జరుగుతోందన్నారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఐఐటీ కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. రెండో దశలో 2,500 మందికి పైగా విద్యార్థులకు ఇక్కడ ఉన్నతస్థాయి వసతులు సమకూరుతాయన్నారు.
ఈ ప్రాంత రైతుల పంట ఉత్పత్తులకు ప్రోత్సాహకంగా తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పడం సంతోషకరమన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ దార్శనికతతో తిరుపతి ఐఐటీ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.
ఫేజ్–బిలో కలి్పంచే సదుపాయాలివే..
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. రూ.1,243 కోట్ల ఫేజ్–బి నిధులతో ఈ ఐఐటీలో మూడు అకడమిక్ బ్లాక్స్, ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ సదుపాయాలు రాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో 1,800 మందికి వసతి సదుపాయం ఉందని, ఈ ఫేజ్–బి పనులు 2029కల్లా పూర్తిచేయగలిగితే మరో 2,650 మంది విద్యార్థులకు వసతి కలగనుందని తెలిపారు. ఐఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డీన్ ఎ. మురళీకృష్ణ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్మాణ ప్లానింగ్‌ను వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీడబ్ల్యూసీ ఈడీ, ప్రాజెక్టు ఇన్‌చార్జి బీఎస్ రెడ్డి, బ్రిగేడియర్ డాక్టర్ కృష్ణకుమార్, ఐఐటీ రిజి్రస్టార్‌లు తదితరులు పాల్గొన్నారు.