‘విశాఖలో లోకేష్, పవన్ కళ్యాణ్ తీరు అమానుషం’ | Perni Nani Takes On Ministers Lokesh And Pawan Over Visakha Incident | Sakshi
Sakshi News home page

‘విశాఖలో లోకేష్, పవన్ కళ్యాణ్ తీరు అమానుషం’

Jun 9 2026 9:39 PM | Updated on Jun 9 2026 9:58 PM

Perni Nani Takes On Ministers Lokesh And Pawan Over Visakha Incident
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు
  • మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
  • 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగింది
  • ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం ప్రమాదాలకు కారణమైంది
  • గత రెండేళ్లుగా వీఆర్‌ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను బలవంతంగా ఇంటికి పంపించారు
  • అనుభవం లేని వారితో, తక్కువ జీతాలకు పని చేయించడమే ఈ విషాదానికి కారణం
  • స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బాధ్యతారాహిత్యం, కక్కుర్తి వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారు
  • బాధిత కుటుంబాలను ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించారు
  • లోకేష్ బాధలో ఉన్న కార్మికులతో మాట్లాడిన తీరు  అనుచితంగా ఉంది
  • మీ ఇంట్లో వాళ్లు చనిపోయారా అని దబాయించడం మానవత్వానికి విరుద్ధం.
  • మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం

మచిలీపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో, బాధితులను ఓదార్చాల్సిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మానవత్వం మరచి రాజకీయ వ్యాఖ్యలకు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా ఆక్షేపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది కోతలు, కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర‌ ప్రభుత్వం బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రచారంలో నిమగ్నమైందని విమర్శించారు. మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడంతో పాటు, గత రెండేళ్లుగా వీఆర్‌ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను ఇంటికి పంపివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే వారిని ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరం. ప్రమాద స్థలానికి వెళ్లిన నారా లోకేష్ కార్మికుల బాధను వినాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ఇచ్చింది కాదు. గతంలోనే స్టీల్ ప్లాంట్‌లో అమలులో ఉన్న విధానం ప్రకారమే ఆ మొత్తం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. అధికారంలో ఉన్నవారు మరింత బాధ్యత, సంయమనంతో వ్యవహరించాలి.

రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో?
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని కూట‌మి ప్రభుత్వం చెబుతోంది. కానీ అవి శాశ్వత ఉద్యోగాలు కావు, తాత్కాలిక నియామకాలే. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తే అనిశ్చితిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల భద్రతపై కూడా సందేహాలున్నాయి. మృతుల కుటుంబాలకు ఇస్తున్న రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ప్రకటించింది కాదు. స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటికే అమలులో ఉన్న సంప్రదాయం, వేజ్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ మొత్తం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. 

ప్రమాదం తర్వాత మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లడం మంచిదే. అయితే బాధితులను పరామర్శించే సమయంలో హుందాగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్లి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఘటనాస్థలానికి వెళ్లకుండా, విజయవాడలోనే సమీక్షలు నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి మాత్రం వెంటనే విశాఖకు చేరుకున్నారు. ఇలాంటి విషాద సమయంలో రాజకీయ వ్యాఖ్యలకు బదులుగా బాధిత కుటుంబాలకు అండగా నిలవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

పవన్‌వి ప‌చ్చ ద‌గాకోరు మాట‌లు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించారని చెప్పడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రచారం. ప‌చ్చి ద‌గాకోరు మాట‌లే. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కార్మికుల ఉద్యమం, ప్రజా వ్యతిరేకత కారణంగానే ఆ నిర్ణయం అమలుకాలేదు. 2025 జనవరిలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖకు వచ్చి, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఇప్పటి వరకు కేంద్రం ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నప్పుడు గత రెండేళ్లలో ఒక్కసారైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? క్యాప్టివ్ మైన్స్ కోసం గానీ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గానీ ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వాస్తవాలను దాచిపెట్టి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే.

బాధిత కుటుంబాల‌కు అండ‌గా నిల‌వాలి
నాడైనా, నేడైనా వైఎస్సార్‌సీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వంద శాతం వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే ఉద్యమం చేస్తాం, అధికారంలో ఉంటే కేంద్రం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఈ విషాద ఘటనను రాజకీయాలకు వేదికగా మార్చకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పూర్తి సహాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుని, ప్లాంట్ భవిష్యత్తును కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విధంగానే, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి వారికి తగిన పరిహారం, భరోసా కల్పించాలి. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అంటూ మాజీ మంత్రి పేర్ని నాని స్ప‌ష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement