అందరినీ నిండా ముంచారు | People questioned the alliance candidates during the election campaign | Sakshi
Sakshi News home page

అందరినీ నిండా ముంచారు

Oct 31 2026 5:10 AM | Updated on Oct 31 2026 5:10 AM

People questioned the alliance candidates during the election campaign

టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డిని నిలదీస్తున్న మహిళలు (ఫైల్‌)

ఎక్కడికక్కడ టీడీపీ కూటమి అభ్యర్థులను నిలదీసిన జనం.. ముగిసిన మున్సిపల్‌ ప్రచార పర్వం 

హామీల అమలు ఏమైందని ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళల నిలదీత 

రూ.40 వేల కోట్ల బకాయిల సంగతేంటన్న ఉద్యోగులు 

పీఆర్సీ, ఐఆర్‌ లేదు.. ఐదు డీఏలు పెండింగ్‌.. పైగా వేధింపులంటూ ఆగ్రహం 

50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్‌ మాటేమైందని మహిళల మండిపాటు 

18 ఏళ్లు దాటిన అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18 వేలు ఎందుకివ్వడం లేదని నిలదీత 

ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఎవరికిచ్చారని యువత మండిపాటు 

సున్నా వడ్డీ లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అసలే లేదు.. వసతి దీవెనా లేదు 

కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామన్న మాటా మాయం 

అవినీతి, అక్రమాలపై పెల్లుబికిన ప్రజాగ్రహంతో వెన్నుపోటు పార్టీలో వణుకు 

అధికార పార్టీ ఆగడాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించిన వైఎస్సార్‌సీపీ నేతలు 

‘బాబు పాలనలో కిలో బియ్యం రూ.100.. ఎకరం భూమి 99 పైసలు’ నినాదం ప్రాచుర్యం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నమ్మించి నిండా ముంచిందని ప్రజలు మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవన్‌ సహా 143 హామీలు అమలు చేయకుండానే.. అన్నీ చేసేసినట్లు నిస్సిగ్గుగా ఎలా చెబుతున్నారని నిలదీశారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆరు రోజులపాటు సాగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఎక్కడికక్కడ టీడీపీ కూటమి నేతలను, అభ్యర్థులను హామీలు, వివిధ సమస్యలపై నిలదీశారు.  

వెన్నుపోటు పార్టీ అభ్యర్థులకు ప్రజలు చెమటలు పట్టించారు. తల్లికి వందనం సరిగ్గా అమలు చేయకపోవడం, రెండున్నరేళ్లయినా కొత్తగా ఒక్కరికి కూడా వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వకపోవడాన్ని ఎత్తి చూపారు. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళలు.. ఇలా ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రూ.40 వేల కోట్ల బకాయిల సంగతేంటన్న ఉద్యోగుల ప్రశ్నకు కూటమి అభ్యర్థుల నుంచి సమాధానం కరువైంది. ఐఆర్‌ లేదు.. ఐదు డీఏలు పెండింగ్‌.. పైగా వేధింపులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్‌ మాటే­మైందని మహిళలు మండిపడ్డారు.

18 ఏళ్లు దాటిన అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. ఉద్యో­గం లేదా ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇప్ప­టి వరకు ఎంత మందికి ఇచ్చారని యువత నిలదీసింది. డ్వాక్రా మహిళలకు, రైతులకు సున్నా వడ్డీ లేదని ఊరూరా ఎత్తి చూపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అసలే లేదు.. వసతి దీవెనా లేదని.. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల చదువులు మానేయాల్సి వస్తుందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామన్న మాటా నిలుపుకోలేదని రైతులు మండిపడ్డారు. ఆర్బీకే వ్యవస్థను నీరు గార్చారని, రైతులను ఏ విధంగానూ ఆదుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నీకు రూ.పది వేలు, నీకు రూ.పదిహేను వేలంటూ గతంలో టీడీపీ నాయకులు చేసిన ప్రచార వీడియోలను ఫోన్లలో చూపిస్తూ ప్రజలు నిలదీస్తుండేసరికి కూటమి అభ్యర్థులు ప్రచారం నుంచి జారుకున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగబాకుతుంటే.. వాటిని కట్టడి చేయడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమవ్వడాన్ని ప్రజ­లు ప్రశ్నించారు. ఇదే సమయంలో మరోవైపు రూ.కోట్లాది విలువైన భూములను చంద్రబాబు ప్రభు­త్వం కారు చౌకగా కట్టబెడుతున్న వైనాన్ని గుర్తుచేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు పాలనలో ‘కిలో బియ్యం రూ.100.. ఎకరం భూమి 99 పైసలే’ అన్న నినాదం బాగా ప్రాచుర్యం పొందడం అధికారపార్టీ నేతలను కలవరపెడుతోంది. రెండున్నరేళ్ల పాలనలో టీడీపీ కూటమి పాల్పడిన అవినీతి, అక్రమాలు, అరాచకాలను వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement