కాయలు పారబోశారని.. అక్రమ కేసులు | Party ready to file habeas corpus petition against Chittoor police | Sakshi
Sakshi News home page

కాయలు పారబోశారని.. అక్రమ కేసులు

Jul 12 2025 5:41 AM | Updated on Jul 12 2025 7:59 AM

Party ready to file habeas corpus petition against Chittoor police

బంగారుపాళ్యంలో తిరుగుబాటుతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు

అన్నదాతలు, యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు

పోలీసుల అదుపులో 20 మందికి పైగా పార్టీ కార్యకర్తలు

రెండు రోజులుగా అరెస్టు చూపరు.. కోర్టులోనూ హాజరు పరచరు

చిత్తూరు పోలీసులపై హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలుకు పార్టీ సిద్ధం  

సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ఎప్పటి­కప్పుడు నిలదీస్తూ కూటమి సర్కారు మోసాలను ఎండగడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జనంలోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంతటితో ఆగడం లేదు! వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో పాల్గొన్న వారిని, పార్టీ కార్యక్రమాలకు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోంది. ప్రధానంగా రైతులు, యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. 

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ అక్కడకు వెళ్లగా తాజాగా కూటమి ప్రభుత్వం పలువురు రైతులపై అక్రమ కేసులు మోపింది. మామిడికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై కాయలు పారబోసినందుకు బంగారుపాళ్యంలో రైతులపై పోలీసులు శుక్రవారం అక్రమ కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా  తుంబపాళ్యానికి చెందిన రైతు దేవేంద్ర, తిమ్మోజుపల్లెకు చెందిన రైతులు ప్రకాష్‌రెడ్డి, భగత్‌రెడ్డి, తుంబపాళ్యానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్లు అక్బర్, ఉదయ్‌పై కేసులు బనాయించారు. 

మామిడికి గిట్టుబాటు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌ బంగారుపాళెం మార్కెట్‌యార్డును సందర్శించిన విషయం తెలిసిందే. గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న మామిడి రైతన్నలు తమ గోడు చెప్పుకునేందుకు పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్‌ జగన్‌ పర్యటనకు లభించిన స్పందన చూసి ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు పోలీసులను ప్రయోగించి సరికొత్త నాటకానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది.

పిలవని పేరంటానికి హాజరై...!
ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు. అక్కడకు వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరాగా, ఆహ్వానం లేకున్నా ఎల్లో మీడియా కూడా దూరిపోయింది! అసలు ఈ కార్యక్రమానికి తాము ఎల్లో మీడియాను పిలవలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారుపాళ్యం చేరుకున్న పచ్చ మీడియాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడు. 

మామిడికి గిట్టుబాటు ధర దక్కడం లేదని కాయలను కింద పోసి నిరసన వ్యక్తంచేస్తున్న రైతులను ఉద్దేశించి.. ‘మీకు బుద్ధుందా..? ఏం చేస్తున్నారు..? అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా...?’ అంటూ దుర్భాషలాడి రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో మాటామాట పెరిగి తోపులాట చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ ఫోటోగ్రాఫర్‌ బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. 

తమ అనుకూల మీడియాకు చెందిన ప్రతినిధి కావడంతో సీఎం చంద్రబాబు నుంచి ఆయన తనయుడు, మంత్రులు వరుస ట్వీట్లు పెడుతూ ఆగమేఘాలపై స్పందించారు. నిందితులను వదిలేది లేదని, చట్టరీత్యా చర్యలు తప్పవంటూ మామిడి రైతుల సమస్యను డైవర్ట్‌ చేశారు. చిత్తూరుకు చెందిన చక్రి తనపై దాడి చేయలేదని, తన కెమెరాను అతడే కాపాడాడని ఫోటోగ్రాఫర్‌ చెబుతున్నా ఖాకీలు పరిగణలోకి తీసుకోలేదు. ‘కేసు ఇప్పుడు మా పరిధిలో లేదు...! సీఎం వరకు వెళ్లిపోయింది.. నువ్వు ఏదిపడితే అది మాట్లాడొద్దు.. మేమేం చెబితే అది చెయ్‌.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టు.. ఏం జరిగిందో కూడా మేమే చెబుతాం.. అందరికీ అలాగే చెప్పు..’’ అంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా..
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోటోగ్రాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకుండా ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు అనుమానితుల పేరిట వైఎస్సార్‌సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచే పలువురు కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. గంగాధర నెల్లూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ మండల ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు కె.మోహన్, మండల సోషల్‌ మీడియా కో–కన్వీనర్‌ వినోద్, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి అనుచరుడు చక్రవర్తి (చక్రి), పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరుడు ఆచార్య, పూతలపట్టుకు చెందిన మరికొంత మందిని అక్రమంగా నిర్భందించి అదుపులోకి తీసుకున్నారు. 

రెండు రోజులుగా బంగారుపాళ్యం పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించి శుక్రవారం చిత్తూరులోని పోలీసు శిక్షణా కేంద్రానికి (డీటీసీ) తరలించారు. అక్కడకు వెళ్లిన న్యాయవాదులను లోపలకు అనుమతించలేదు. ఫొటోగ్రాఫర్‌ను కులం పేరు చెప్పాలంటూ బెదిరించి ఆయుధాలతో దాడి చేశారంటూ అట్రాసిటీ, హత్యాయత్నం కింద నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు బనాయించి కేసు నమోదు చేశారు. దాదాపు 20 మందికి పైగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అక్రమంగా నిర్భందించగా మరి కొందరి కోసం ఓ బృందం బెంగళూరుకు వెళ్లినట్లు చెబుతున్నారు..

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌.హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌.!
తమ శ్రేణుల అక్రమ నిర్భందంపై వైఎస్సార్‌సీపీ నాయకులు హైకోర్టు తలుపు తట్టడానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వారి పేర్లను సేకరించి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.

ఎల్లో మీడియాపై రైతన్న కన్నెర్ర..
బంగారుపాళ్యంలో మామిడి రైతుల ఆవేదనను ‘సాక్షి’ ప్రచురించిన నేపథ్యంలో ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. ‘సాక్షి’ మీడియాకు మీరు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ నిజమేనా..? మీతో బలవంతంగా చెప్పించారా..? అంటూ రైతులను ఆరా తీస్తోంది.  అయితే మామిడి రైతులను రౌడీలు, గొంతులు కోసే ఉన్మాదులతో ఎల్లో మీడియా పోల్చడం, దండుపాళ్యం బ్యాచ్‌గా అభివర్ణించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న అన్నదాతలు వారిపై మండిపడుతున్నారు.

తప్పుడు ఫిర్యాదుతో అక్రమ నిర్భందం..
సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు బంగారుపాళ్యం ఘటన మరో నిదర్శనం. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు తరలి వచ్చిన జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేని కూటమి నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. కుప్పంలో ఓ వార్త రాసినందుకు అక్కడి సాక్షి విలేకరిపై తప్పుడు కేసు పెట్టారు. 

వాట్సాప్‌ గ్రూపులో ఎవరో ఏదో పెడితే మరో టీవీ ఛానల్‌ రిపోర్టర్‌పై కేసు పెట్టారు. వారిని సీఎం స్థాయిలో చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు? మీడియాలో మీకు అనుకూలంగా ఉన్నవారికి ఒక న్యాయం, నిజాలు నిర్భయంగా ఎలుగెత్తే వారికి మరో న్యాయమా..?  పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తున్న పోలీసులను చట్టం ముందు నిలబెడతాం. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు

అక్రమ కేసులు బనాయించారు..
మా కార్యక్రమానికి రావాలని మేమేమైనా పచ్చ మీడియాను ఆహ్వానించామా..? గొడవ చేసి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులకు శ్రీకారం చుట్టారు. ఆ ఫోటోగ్రాఫర్‌ను ఎవరు కొట్టారు..? నాపేరు ఎలా చెబుతారు..? కుప్పంలో పని చేస్తున్న సాక్షి రిపోర్టర్, మరి కొంతమందిపై టీడీపీ నేతలు తప్పుడు ఫిర్యాదు ఇస్తే.. ఎస్పీ అక్రమ కేసులు బనాయించారు.  

జిల్లావ్యాప్తంగా మావారిని 25 మందికిపైగా రెండు రోజులుగా అదుపులోకి తీసుకుని వేధిస్తున్నా ఎస్పీ నోరు మెదపడంలేదు. హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టాలని కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీసులకు చెబుతున్నారు. మా నియోజకవర్గానికి చెందిన ఎస్సీ యువకులను అక్రమంగా నిర్బంధించారు. దీనికంతటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.  – కె.నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి. 

కాపాడినందుకు కేసా..? 
ఆ ఫోటోగ్రాఫర్‌ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయనే కాపాడారని చెప్పారు. కెమెరా ఎక్కడ విరిగిపోతుందోనని కెమెరాను పట్టుకున్నారు. కాపాడిన పాపానికి మా ఆయన్ను ఇరికించాలని చూస్తున్నారు. చక్రి నన్ను కాపాడాడు అని ఆసుపత్రిలో ఆ ఫోటోగ్రాఫరే చెప్పారు. ఇప్పుడు ఓ డీఎస్పీ స్ట్రిప్టు రాసిచ్చి, దీని ప్రకారం ఇవ్వాలని ఫోటోగ్రాఫర్‌తో అబద్ధపు ఫిర్యాదు తీసుకున్నారు. 

రెండు రోజుల క్రితం యూనిఫామ్‌ వేసుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఇంట్లో అన్నం తింటా ఉన్న నా భర్తను ఇప్పుడే పంపిస్తామని తీసుకెళ్లారు. ఇప్పటివరకు నా భర్త ఆచూకీ చెప్పలేదు. చిత్తూరు డీటీసీ వద్ద ఉన్నారని తెలిసి అక్కడకు వెళితే లోపలకు కూడా పంపలేదు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా..? – కవిత, చక్రవర్తి (చక్రి) భార్య, చిత్తూరు.

నా భర్తకు ఏదైనా జరిగితే ఎస్పీదే బాధ్యత
జగన్‌పై అభిమానంతో చూడడానికి మా ఇంటాయన అక్కడికి పోయినాడు. ఫోటోగ్రాఫర్‌ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయన పక్కన నిలబడి ఉన్నాడు. అంతే.. ఇంట్లో ఉన్నోడిని ఇప్పుడే పంపిస్తామని పోలీసులు తీసుకుపోయినారు. ఇంతవరకు పంపలేదు. నా భర్తకు ఒక కన్ను కనిపించదు. షుగర్‌ కూడా ఉంది. రోజూ మూడుసార్లు మాత్రలు వేసుకోవాలి.

చిత్తూరు డీటీసీలో ఉండానని చెబితే అక్కడి పోయినాము. ఆ అడవిలో నా భర్తను చూపీకుండా పోలీసులు తరిమేసినారు. ఇపుడు కేసులు పెడతామంటా ఉండారు. మేమే ఎస్సీలైతే మాపైనే ఎట్లా అట్రాసిటీ కేసు పెడతారు..? నా భర్తకు జరగరానికి ఏదైనా జరిగితే ఎస్పీనే బాధ్యత వహించాలి. – రాసాత్తి, మోహన్‌ భార్య, గంగాధరనెల్లూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement