
మంత్రి ఆనం ఆదేశాలు.. పోలీసుల మీనమేషాలు
ఏడుగురిని పొట్టనపెట్టుకున్న టిప్పర్ ఘటనలో చర్యలు నిల్
డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని అదే రోజు చెప్పిన ఎస్పీ
ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు లైసెన్స్ లేదు.. పైగా తప్పతాగాడు..
ఒత్తిడి వల్లే వారం వరకు అరెస్ట్ చేయని పోలీసులు
అసలు డ్రైవర్‌ను వదిలేసి ప్రతాప్‌రెడ్డి అనే డ్రైవర్‌ను నిందితుడిగా చూపే యత్నం
తప్పుడు కేసులో ఇరికిస్తే బండారం బట్టబయలు చేస్తామన్న కుటుంబ సభ్యులు
దీంతో బెంబేలెత్తి మరో డ్రైవర్ సుదీర్‌ను నిందితుడిగా చూపిన పోలీసులు
ఏ–2, ఏ–3 నిందితులను అరెస్ట్ చేయక పోవడంపై విమర్శలు
అక్రమ మైనింగ్‌పై ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖలు మౌనం
సాక్షిప్రతినిధి నెల్లూరు: ఇసుక టిప్పర్ రాంగ్ రూట్‌లో కారును ఢీకొనడంతో ఏడుగురు దళితులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగి వారమైనా కనీసం డ్రైవర్‌ను కూడా అరెస్ట్ చేయలేక పోయారంటే ఏ మేరకు ఒత్తిడి ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడని అదే రోజు రాత్రి ఎస్పీ డాక్టర్ అజిత ప్రకటించారు. సరిగ్గా అప్పటి నుంచే అసలు నాటకం మొదలైంది.
ప్రమాదానికి కారణమైన టిప్పర్ యజమాని ఏఎస్‌పేట మండలం చిరమనకు చెందిన కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, ఇసుక అక్రమ రవాణాదారుడు బుజ్జయ్యనాయుడులు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ముఖ్య అనుచరులు. దీంతో వారిని రక్షించేందుకు మంత్రే స్వయంగా రంగంలోకి దిగి పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచి్చనట్లు తెలుస్తోంది. తాను చెప్పినట్లే కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు లైసెన్స్ లేదు.. పైగా తప్పతాగాడు.. దీంతో కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇన్సూ్యరెన్స్ కూడా రాదని అతన్ని తప్పించేలా వ్యూహం పన్నారు.
ఈ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్‌ను అరెస్ట్ చూపలేదు. అతన్ని వదిలేసి.. తెల్లారేసరికే డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రమాద ఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో వివరాలను సైతం తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ–1గా టిప్పర్ డ్రైవర్‌ను చూపించారు. ఇసుక టిప్పర్ నంబర్‌కు బదులుగా ప్రమాదానికి గురైన కారు నంబర్‌ను నమోదు చేశారు. ఏ–2గా టిప్పర్ యజమాని అని రాసి అక్కడ సైతం టిప్పర్ నంబర్‌కు బదులుగా బాధితుల కారు నంబర్‌ను నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ నంబర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా చూపలేదు. ఈ విషయం బాధితులు నిలదీయడంతో తప్పులు సరిదిద్దారని తెలిసింది.
డ్రైవర్ మార్పులో హైడ్రామా
ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను వదిలేసి తొలుత ఏఎస్‌పేట మండలం కావలియడవల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డిని డ్రైవర్‌గా చూపించేందుకు నాలుగు రోజులుగా యత్నించారు. అయితే ఈ విషయమై అతని భార్య, పిల్లలు తీవ్రంగా అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. ప్రతాప్‌రెడ్డిని కేసులో ఇరికిస్తే వాస్తవ విషయాలను మీడియా ముందు వెల్లడిస్తామని వారు హెచ్చరించడంతో మంగళవారం రాత్రి హడావుడిగా మదరాబాద్‌కు చెందిన సు«దీర్ అనే వ్యక్తిని డ్రైవర్‌గా చూపించి అరెస్ట్ చేశారు.
టిప్పర్ యజమాని, ఇసుక అక్రమ రవాణాదారుపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎక్కడా ఇసుక రీచ్‌లకు అనుమతులు లేవు. అయితే చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో అనధికార ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న విషయం మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖలకు తెలిసినా మౌనంగా ఉన్నారు.
అసలు ఇక్కడ ఇసుక రీచ్‌కు అనుమతి ఎవరిచ్చారు? రీచ్‌లోకి వెళ్లడానికి గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి అనుమతులిచ్చిన అధికారులు ఎవరు? వీటిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు కనీస విచారణ కూడా చేయలేదు. ఈ ఘటనకు పూర్తిగా మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులే బాధ్యులని స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమాలకు పచ్చ జెండా ఊపి..మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంది.