ఏలూరు టౌన్ : శారీరక లోపాన్ని దాచిపెట్టి వివాహం చేసుకోవడంతో పాటు సంతానం కోసం తన స్నేహితుడితో సంబంధం పెట్టుకోవాలని కట్టుకున్న భార్యనే వేధించిన దారుణ ఘటన ఏలూరులో వెలుగుచూసింది. ఇందుకు నిరాకరించిన ఆమెను హతమార్చేందుకు యత్నించిన భర్త, అత్తమామలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం..
ఏలూరు పవర్‌పేట వాసుదేవాలయం సమీపంలో నివాసం ఉండే యువతి (21)కు తెనాలికి చెందిన దిలీప్‌తో ఏలూరులో వివాహం జరిగింది.పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు 15 కాసుల బంగారం, కిలోన్నర వెండి వస్తువులు, పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షల నగదు ఇవ్వడంతో పాటు సుమారు రూ.13 లక్షలు ఖర్చు చేసి ఘనంగా వివాహం జరిపించారు. అయితే వివాహమైన నాటి నుంచి దిలీప్ భార్యతో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటున్నాడు. చికిత్స చేయించుకుని మందులు వాడి ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం లేకపోయింది.
ఈ క్రమంలో బెంగళూరులోని ఓ హోటల్లో బస చేసిన సమయంలో తన స్నేహితుడితో శారీరకంగా కలిస్తే సంతానం కలుగుతుందని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన దిలీప్ దిండుతో ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపబోయాడు. అలాగే భర్త చెప్పినట్టు వినాలని అత్త , మామ కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. భర్త నుంచి విడిపోవాలనుకుంటే అదనంగా డబ్బులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
వారి మానసిక వేధింపులు తాళలేక బాధితురాలు తిరిగి ఏలూరు చేరుకుని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే కౌన్సెలింగ్ సమయంలో అత్తింటి వారు ఇచ్చిన హామీలను నమ్మి ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో మాట్లాడుకునేందుకు బంధువులతో కలిసి తెనాలిలోని అత్తింటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్ చేసినా భర్త, అత్తమామలు స్పందించలేదు. దీంతో ఆమె మరలా పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


