నిరసన తెలుపుతున్న ముస్లిం ఐక్యవేదిక ప్రతినిధులు
చంద్రబాబు ప్రభుత్వం వక్ఫ్ భూములు కొట్టేయడానికి దొంగ జీఓలు ఇస్తోంది
గుంటూరులో 72 ఎకరాలను ఐటీ కంపెనీకి కేటాయిస్తూ ఇచ్చిన జీఓను వెనక్కి తీసుకోవాలి
ధర్నా చౌక్‌లో ముస్లిం ఐక్యవేదిక నిరసన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంజుమన్ ఇస్లామియా సంస్థకు చెందిన భూములను ఐటీ కంపెనీలకు కేటాయిస్తూ చంద్రబాబు సర్కార్ జారీ చేసిన జీఓను రద్దు చేయాలని ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేసింది. గుంటూరులోని అంజుమన్ ఇస్లామియా సంస్థకు చెందిన 72 ఎకరాల భూమిని ఐటీ కంపెనీకి కేటాయించడాన్ని నిరసిస్తూ సోమవారం విజయవాడ ధర్నాచౌక్‌లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం ప్రతినిధులు పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ అలీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దొంగ జీఓలతో వక్ఫ్ భూములను కొట్టేయడానికి పన్నాగం పన్నుతోందన్నారు. అంజుమన్ ఇస్లామియా భూములను బడా వ్యాపార వేత్తలకు ధారాదత్తం చేస్తోందన్నారు. ముస్లిం సంస్థలకు చెందిన స్థిరాస్తులను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి తగినగుణ పాఠం చెబుతామని హెచ్చరించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వక్ఫ్ భూములు అమ్మకానికి, దానం చేయడానికి ఏ ప్రభుత్వానికీ అధికారం లేదన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ భూములు అమ్ముకోవడానికి చట్ట సవరణ చేసి కమిటీలో ఇతర కులస్తులకు, కలెక్టర్లకు అవకాశం కల్పించిందన్నారు. మంత్రి లోకేశ్ గుంటూరులో ఉన్న 72 ఎకరాల భూమి ఐటీ కోసం అంటున్నాడని, రాజధానిలో అభివృద్ధి కోసం 1640 ఎకరాలు ప్రభుత్వం తీసుకుందని, అందులో కొన్ని ఎకరాల్లో ఐటీ కంపెనీలు పెట్టొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి బాజీ బాబా, ఎనీ్టఆర్ జిల్లా అ«ధ్యక్షుడు మస్తాన్, రాష్ట్ర కార్యదర్శి గౌస్ మొహిద్దీన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బడే మియా, ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సలావుద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, రాష్ట్ర అధికార ప్రతినిధులు సయ్యద్ ఖలీల్, మైనార్టీలు పాల్గొన్నారు.


