ప్రైవేటీకరణపై మున్సిపల్‌ కార్మికుల శంఖారావం | Municipal workers staged a demonstration at Dharna Chowk in Vijayawada | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణపై మున్సిపల్‌ కార్మికుల శంఖారావం

Jun 23 2026 4:36 AM | Updated on Jun 23 2026 4:36 AM

Municipal workers staged a demonstration at Dharna Chowk in Vijayawada

ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడలో ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

మున్సిపల్‌ కార్మికుల నిరసనలతో అట్టుడికిన విజయవాడ ధర్నా చౌక్‌

60 వేల మంది మున్సిపల్‌ కార్మికుల జీవితాల్ని బుగ్గిపాలు చేస్తారా అని నిలదీత 

చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొట్టేందుకు సిద్ధమైందని ఆందోళన 

మున్సిపాలిటీల్లో 14 సేవలను ప్రైవేటుపరం చేయాలని చూడటంపై ఆగ్రహం 

రోడ్లను కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని మండిపాటు 

చీకటి జీవోలు 673, 975 వెనక్కి తీసుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిక

సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పార్కులు, రోడ్లు, వాహనాలు వంటి 14 రకాల సేవలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై కార్మికులు కన్నెర్రజేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల నుంచి తరలివచ్చిన కార్మికులంతా సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌కు చేరుకుని ప్రభుత్వ తీరుకు నిరసనగా శంఖారావం పూరించారు. మున్సిపల్‌ సేవలు ప్రైవేటుపరమైతే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొట్టేందుకు సిద్ధమైందని మండిపడ్డారు.

చీకటి జీవోలు 673, 975 వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో చెత్త పన్నుపై నానా యాగీ చేసిన ఇదే చంద్రబాబు.. ఇప్పుడు అదే చెత్త పన్ను తీసుకొస్తున్నారని.. ఉమ్మేస్తే కూడా పన్ను వసూలు చేసేలా ఉన్నారని మండిపడ్డారు. కరోనా సమయం, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మున్సిపల్‌ కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించుకుని దేవుళ్లు అని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు వారందర్నీ బలిపశువులుగా మార్చేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు 

చీకటి జీవోలతో పొట్టగొడతారా! 
కార్మికులను ఉద్దేశించి ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం కోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కుతూ చీకటి జీఓలతో మున్సిపల్‌ కార్మికుల పొట్టకొట్టేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో 14  సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేందుకు సిద్ధం కావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రైవేటుపరమైతే అన్ని మున్సిపాలిటీల్లో పని చేస్తున్న 60 వేల మంది మున్సిపల్‌ కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయన్నారు.

ఇదే చంద్రబాబు 2014–19 కాలంలో జీవో నం.279 తెచ్చి మున్సిపల్‌ కార్మికుల బయటకు గెంటేసి, ప్రైవేటుపరం చేయాలని చూశారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు జీవోలు 975, 673 తీసుకొచ్చి మున్సిపల్‌ కార్మికులకు నష్టం కలిగిస్తున్నారన్నారు. ఈ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కె.నాగభూషణం మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సేవలను ప్రైవేటుపరం చేయొద్దని, సేవలందించే వారిని పర్మినెంట్‌ చేయాలని కోరుతూ వేలాదిమంది కార్మికులు సంతకాలు చేశారని, ఆ ప్రతులను మున్సిపల్‌ మంత్రి నారాయణ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, కార్మిక నేతలు కాశీనాథ్, వెంకటరెడ్డి, వెంకటరావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement