
టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
అలాంటి మాటలతో మహిళలను అణగదొక్కలేరు
రోజాకు మద్దతుగా నిలిచిన సినీ తారలు
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్‌కే రోజాకు సినీతారలు బాసటగా నిలిచారు. అసహ్యకరమైన పదాలతో విమర్శించిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ తారలు రాధిక, కుష్బూ, రమ్యకృష్ణ, మీనా, నవనీత్‌కౌర్, కవిత డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయంపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికైనా సిద్ధమంటున్నారు.
ఎట్టి పరిస్థితిలోనూ ఇది సహించరానిది
ఈ వీడియో చూడగానే ఒక స్నేహితురాలిగా, ఒక మహిళగా చాలా బాధ పడ్డాను. ఓ వైపు దేశం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా, ఇంకా మహిళలను కించ పరచడం, అక్రమ రవాణా, గృహ హింస, బహిరంగంగా తిట్టడం రోజూ జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ మాజీ మంత్రి తనయుడు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ఈ విధంగా తిట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానిది. ఈ సమయంలో కుల, మతాలకు అతీతంగా మగ, ఆడ అని తేడా లేకుండా అందరూ ఒక్కటై రోజాకు అండగా నిలబడాలి. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో తక్షణం కలుగ చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. భారతమాతాకు జై అనే దేశంలో ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – రమ్యకృష్ణ
నీకు పెళ్లాం, సోదరి లేరా?
రోజా సినిమా హీరోయిన్‌గా నటించింది. రాజకీయాల్లోకి వెళ్లి మంత్రిగా పని చేసింది. అలాంటి రోజాపై ఇష్టానుసారం మాట్లాడటానికి ఎంత ధైర్యం కావాలి? నీకు పెళ్లాం, సోదరి లేరా? ఒక లీడర్‌గా ఆడవారి గురించి ఇంత దిగజారి మాట్లాడతారా? రుజువులు ఉంటే చూపించి మాట్లాడాలి కానీ, ఇలా నీచంగా దిగజారి మాట్లాడకూ డదు. మీకు రాజకీయాలు ప్రధానం కావచ్చు.. అయితే మహిళల ఆత్మగౌరవంతో పని లేదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారు సిగ్గుపడేలా చర్యలు తీసుకోవాలి. – నవనీత్ కౌర్
పిరికిపంద చర్య ఇది
గౌరవం అంటే ఏమిటి.. ఎదుటి వారితో ఎటువంటి భాష మాట్లాడాలి.. అని నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తో కలిసి పని చేసినప్పుడు నేర్చుకున్నాం. అటువంటి ఆయన స్థాపించిన పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే ఇంత నీచంగా మాట్లాడటం శోచనీయం. రోజా ఏ పార్టీలో ఉన్నా.. ఆమె ఒక మహిళ అన్న విషయం మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలను ఇంత దిగజారుస్తారనుకోలేదు. మహిళలను రాజకీయాల్లోకి రాకుండా చేసే పిరికిపంద చర్య ఇది. ఆ ఎమ్మెల్యే మాటలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. – కవిత
నీచంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి
రోజాకు మా అందరి మద్దతు ఉంది. ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడిన వారిపై చర్య తీసుకోవాలి.
– కుష్బూ
రోజాను చూసి అసూయ పడుతున్నాడు
రోజా గురించి మాట్లాడిన వీడియో చూశాను. చాలా చాలా కోపం తెప్పించింది. ఒక మహిళ పైకి ఎదుగుతోంది అంటే బహిరంగంగా ఇంత నీచంగా మాట్లాడతారా? ఇలాంటి మాటలకు మహిళలు భయపడి లోపల కూర్చుంటారు అనుకుంటున్నారేమో.. కాలం మారింది. మహిళలు మరింత ధృడంగా తయారయ్యారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడంటే ఆయన రోజాను చూసి ఎంత అసూయ పడుతున్నాడో తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్, ఆలోచనలు ఎంత నీచంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రోజా చాలా ధైర్యం కలిగిన మహిళ. రోజా.. నేను నీకు అండగా ఉంటాను. సుప్రీంకోర్టు తక్షణం కలుగ చేసుకొని రోజాకు న్యాయం జరిగేట్టు చూడాలి. – మీనా
ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు?
రోజాపై అంత దారుణంగా మాట్లాడటం బాధ కలిగించింది. రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు దారుణం. రాజకీయాల్లోకి మహిళలు మరింత ముందుకు రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మహిళల గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు? – రాధిక
– సాక్షి, అమరావతి