ఎమ్మెల్యే బాలకృష్ణతో పీఏ శ్రీనివాసరావు (ఫైల్)
హిందూపురం నియోజకవర్గంలో అక్రమాలకు కేరాఫ్
ఆర్థి క లావాదేవీలన్నీ శ్రీనివాసరావు చేతుల్లోనే..
చిలకలూరిపేట నుంచి వచ్చి ‘పురం’ సొమ్ము స్వాహా
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. పురంలో టీడీపీ శ్రేణులన్నీ అతని చెప్పుచేతల్లోనే ఉంటున్నాయి. మద్యం దుకాణాల్లో ఇతని భాగస్వామ్యం సింహభాగం. హిందూపురం మండలంలోని తూముకుంట పారిశ్రామికవాడలో ప్రతి పరిశ్రమ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి.
ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవికి ఇతను ప్రధాన అనుచరుడు. అందుకే ఇతనికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే షాడో ఎమ్మెల్యే! నియోజకవర్గంలో ఎవరికి ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా, ఎవ్వరికి ఏ అనుమతి కావాలన్నా శ్రీనివాసరావు అనుమతి తప్పనిసరి. పోలీసు వ్యవస్థ మొదలు అన్ని వ్యవస్థలూ ఇతని చెప్పుచేతల్లోనే ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. కప్పం కట్టే వాడిదే పెత్తనం అన్న చందంగా బ్రిటీష్ తరహా పరిపాలన సాగిస్తున్నాడు.
» చిలమత్తూరు మండలం టేకులోడు ప్రాంతంతో భూసేకరణ అంశంలో గ్రామ సభల్లో సైతం అన్నీ తానై వ్యవహరించి తక్కువ ధర నిర్ణయించి రైతులను ముంచాడు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్ణయించిన ఎకరాకు రూ.25 లక్షలను ఇప్పుడు రూ.12.66 లక్షలకే తగ్గించి భూములను ఏపీఐఐసీ ద్వారా అప్పనంగా తన అనుయాయ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యారు.
» హిందూపురం మున్సిపాలిటీలో పనులకు రూ.92 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు కాగా, వాటిలోనూ తనకు అనుకూలురైన ప్రభాకర్, బాలాజీ అనే కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పి మెజారిటీ నిధులు నొక్కేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు.
» చేయని పనులకు బిల్లులు పెట్టుకుని ఎంపీడీవోల సాయంతో ఒక్కో మండలం నుంచి మండల పరిషత్ నిధులు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ మింగేశారన్న ఆరోపణలున్నాయి. వీటిపై విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ కూడా చేసింది.
» భూముల రిజి్రస్టేషన్లలో అవకతవకలకు పాల్పడుతున్నారు. వేరేవారి పేర్లతో ఉన్న భూములకు సంబంధించి బినామీల పేరిట 1బీలు చేసి కోట్లాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడన్న ఆరోపణలున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన ఆర్డీవో ఆనంద్‌కుమార్ పదోన్నతిలో సహాయం చేసి భూములు అప్పనంగా కాజేసినట్టు జోరుగా చర్చ సాగుతోంది. అందుకు బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన 1బీలు కూడా వైరల్ అయ్యాయి.
» ఎమ్మెల్యే బాలకృష్ణ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసరావు కనీస విద్యార్హత లేకపోయినప్పటికీ పీఏగా పనిచేస్తూ షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నాడు.
» వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా నిలబడతాడన్న ప్రచారం ఉంది. అందుకోసం కావాల్సిన నిధులను హిందూపురం నుంచి పోగు చేసుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. ఇతను హిందూపురంలో అడుగు పెట్టి రెండేళ్లు కావొస్తుండగా.. సుమారు రూ.100 కోట్లు పోగేసుకున్నట్టు నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది.


