breaking news
shadow mla
-
షాడో ఎమ్మెల్యే.. బాలకృష్ణ పీఏ!
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. పురంలో టీడీపీ శ్రేణులన్నీ అతని చెప్పుచేతల్లోనే ఉంటున్నాయి. మద్యం దుకాణాల్లో ఇతని భాగస్వామ్యం సింహభాగం. హిందూపురం మండలంలోని తూముకుంట పారిశ్రామికవాడలో ప్రతి పరిశ్రమ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవికి ఇతను ప్రధాన అనుచరుడు. అందుకే ఇతనికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే షాడో ఎమ్మెల్యే! నియోజకవర్గంలో ఎవరికి ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా, ఎవ్వరికి ఏ అనుమతి కావాలన్నా శ్రీనివాసరావు అనుమతి తప్పనిసరి. పోలీసు వ్యవస్థ మొదలు అన్ని వ్యవస్థలూ ఇతని చెప్పుచేతల్లోనే ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. కప్పం కట్టే వాడిదే పెత్తనం అన్న చందంగా బ్రిటీష్ తరహా పరిపాలన సాగిస్తున్నాడు. » చిలమత్తూరు మండలం టేకులోడు ప్రాంతంతో భూసేకరణ అంశంలో గ్రామ సభల్లో సైతం అన్నీ తానై వ్యవహరించి తక్కువ ధర నిర్ణయించి రైతులను ముంచాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్ణయించిన ఎకరాకు రూ.25 లక్షలను ఇప్పుడు రూ.12.66 లక్షలకే తగ్గించి భూములను ఏపీఐఐసీ ద్వారా అప్పనంగా తన అనుయాయ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యారు. » హిందూపురం మున్సిపాలిటీలో పనులకు రూ.92 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు కాగా, వాటిలోనూ తనకు అనుకూలురైన ప్రభాకర్, బాలాజీ అనే కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పి మెజారిటీ నిధులు నొక్కేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. » చేయని పనులకు బిల్లులు పెట్టుకుని ఎంపీడీవోల సాయంతో ఒక్కో మండలం నుంచి మండల పరిషత్ నిధులు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ మింగేశారన్న ఆరోపణలున్నాయి. వీటిపై విచారణ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్ కూడా చేసింది. » భూముల రిజి్రస్టేషన్లలో అవకతవకలకు పాల్పడుతున్నారు. వేరేవారి పేర్లతో ఉన్న భూములకు సంబంధించి బినామీల పేరిట 1బీలు చేసి కోట్లాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడన్న ఆరోపణలున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన ఆర్డీవో ఆనంద్‌కుమార్ పదోన్నతిలో సహాయం చేసి భూములు అప్పనంగా కాజేసినట్టు జోరుగా చర్చ సాగుతోంది. అందుకు బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన 1బీలు కూడా వైరల్ అయ్యాయి. » ఎమ్మెల్యే బాలకృష్ణ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసరావు కనీస విద్యార్హత లేకపోయినప్పటికీ పీఏగా పనిచేస్తూ షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నాడు. » వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా నిలబడతాడన్న ప్రచారం ఉంది. అందుకోసం కావాల్సిన నిధులను హిందూపురం నుంచి పోగు చేసుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. ఇతను హిందూపురంలో అడుగు పెట్టి రెండేళ్లు కావొస్తుండగా.. సుమారు రూ.100 కోట్లు పోగేసుకున్నట్టు నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. -
తమ్ముళ్లు, అనుయాయులే ఎమ్మెల్యేలు
సాక్షి, నరసరావుపేట: వాళ్లు ఎంపీలో, ఎమ్మెల్యేలో కాదు.. కనీసం పంచాయతీ వార్డు మెంబర్లు కూడా కాదు. అయినా వారిదే ఆ నియోజకవర్గంలో పెత్తనం. మరి వారికున్న అర్హతలేమిటంటే.. సదరు ప్రజాప్రతినిధి వారసులు, సోదరులు, బంధువులు, ఆత్మీయులు కావడమే. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ ప్రభుత్వ పథకాలు మొదలు.. పదవులు, కాంట్రాక్టులు అన్నింటిలోనూ జోక్యం చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. అందినకాడికి దోచుకుని దాచుకుంటున్నారు. ఈ పరిస్థితి పల్నాడు జిల్లాలో మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగ్గురు షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కుమారులు కన్నా నాగరాజు, కన్నా ఫణీంద్రలు అంతా తామే అంటూ అధికారం చెలాయిస్తున్నారు. భూముల సెటిల్మెంట్లు, మద్యం దందా.. ఇలా అన్నింటికీ రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రతి పనికి కప్పం కట్టాల్సిందేనని లావాదేవీలు చేస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరితోపాటు ఎన్నికల సమయంలో ఆరి్థక వ్యవహారాలు చూసుకున్న కాంట్రాక్టర్ దరువూరి నాగేశ్వరరావు కూడా ఇప్పుడు అన్నీ తానై షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తమ్ముడు నవీన్ చిన్న ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ప్రవీణ్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుంటే నవీన్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడు. ఇసుక రీచ్‌ల వద్ద అనధికార టోల్గేట్లు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమరావతి మండలంలో ఎర్రమట్టి దందా ఇతని కనుసన్నల్లోనే సాగుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లను తొలగిస్తున్నారు. మద్యం సిండెకేట్, బెల్టు షాపుల వ్యవహారం అంతా ఈయన చెప్పినట్లే సాగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.మాజీ ఎమ్మెల్యేనా మజాకా! వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ‘మూడు రోజుల ఎమ్యెల్యే’ అని నియోజకవర్గ ప్రజలు పిలుస్తున్నారు. వారంలో ఆయన గరిష్టంగా నియోజకవర్గంలో మూడు రోజులే ఉంటారు. మిగిలిన నాలుగు రోజుల్లో సొంత వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఆ సమయంలో నియోజకవర్గంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా చేపల చెరువులన్నింటిని ఈయన తన గుప్పిట్లో పెట్టుకున్నారని.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు అక్రమంగా మట్టి తోలడం, భూకబ్జాలు, నచ్చని వారిపై అక్రమ కేసులు, వేధింపులు ఇతని కనుసన్నల్లోనే జరుగుతున్నాయని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు అల్లుడు వరసయ్యే విజయ్ అంతా తానై నడిపిస్తున్నాడు.గ్రావెల్‌కు అధిక ధర నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4 వేలు ఉన్న టిప్పర్ మట్టికి ప్రస్తుతం రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. కోటప్పకొండను అక్రమ గ్రావెల్‌కు అడ్డాగా మార్చారని, పోలీసులను అడ్డుపెట్టుకుని పంచాయితీలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ వారే విమర్శిస్తున్నారు. చిలుకలూరిపేటలో అయితే అంతా ‘అమ్మ’గారి దయేనని చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేరుకేనని, అంతా ఆయన భార్యదే పెత్తనమని చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ఒకే మాట చెబుతున్నారు. అధికారులంతా ఆమె సేవలోనే తరిస్తున్నారని విమర్శిస్తున్నారు. -
డోంట్ వర్రీ.. నేనున్నాగా..!
విజయవాడ : భూ వివాదంలో కూరుకుపోయిన పోలీసు అధికారిని రక్షించేందుకు నియోజకవర్గం ప్రజలు ముద్దుగా షాడో ఎమ్మెల్యేగా పిలుచుకునే వ్యక్తి రంగంలోకి దిగినట్టు తెలిసింది. తనను గండం నుంచి గట్టెక్కించాలంటూ వచ్చిన మధ్యవర్తులతో ‘ప్యాకేజీ’ కుదుర్చుకొని ఇబ్బందుల నుంచి బయటపడేస్తానంటూ భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గుంటూరుకు చెందిన ఓ వైద్యుని ప్లాట్ల విషయంలో చోటు చేసుకున్న మోసం, పోలీసు కమిషనర్ ఆదేశంలో కేసు నమోదు, నిందితులను అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాలపై ‘సెటిల్మెంట్..సో బెటర్ బాస్!’ శీర్షికన మంగళవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనం పెనమలూరు నియోజకవర్గంలో కలకలం రేపింది. స్టేషన్‌కి వచ్చిన బాధితుణ్ణి ప్రైవేటు వ్యక్తుల వద్ద సెటిల్ చేసుకోమంటూ సాక్షాత్తు పెనమలూరు ఇన్స్పెక్టర్ జగన్మోహనరావు పంపడంపై నియోజకవర్గం ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.కాగా, విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారడం, పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించడంతో పెనమలూరు పోలీసు స్టేషన్ అధికారి మధ్యవర్తుల ద్వారా షాడో ఎమ్మెల్యేని ఆశ్రయించినట్టు తెలిసింది. గతంలో వారికి తాను చేసిన ఉపకారం ఏకరువు పెట్టడంతో పాటు తనను బయటపడేస్తే రానున్న రోజుల్లో చేయబోయే సాయం గురించి కూడా భరోసా ఇచ్చినట్టు తెలిసింది. లిక్కర్ సిండికేట్ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా పోలీసు అధికారికి కలిసొచ్చింది. షాడో ఎమ్మెల్యేగా చెప్పుకునే వ్యక్తి లిక్కర్ సిండికేట్‌లో కీలక వ్యక్తి కావడంతో సాయం చేసే వ్యక్తిని వదులుకోవద్దంటూ పలువురు చెప్పినట్టు వినికిడి. పైగా సాయం చేసినందుకు ప్యాకేజీ ఆఫర్ కూడా ఇవ్వడంతో ఆయన రంగంలోకి దిగి నియోకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి ద్వారా పోలీసు పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం. ఇద్దరి పైనే కేసు పోలీసు కమిషనర్ సవాంగ్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఇద్దరిపైనే కేసు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఖర్లో రంగ ప్రవేశం చేసిన వ్యక్తి పై స్థాయిలో తన పలుకుబడి ఉపయోగించి బయటపడేందుకు చేసిన యత్నాలు ఫలించినట్లు చెపుతున్నారు. పైగా విచారణ అధికారి ఆ వ్యక్తి మంచోడంటూ ముందుగానే కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించేందుకు ఇక్కడి అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై పలువురు మండిపడుతున్నారు. ఏసీపీ ఆగ్రహం ఓ కేసు దర్యాప్తు కోసం పెనమలూరు పోలీసుస్టేషన్‌కి వెళ్లిన మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ టిఎస్ఆర్కె ప్రసాద్ అక్కడి పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన వెళ్లేసరికే అదుపులోకి తీసుకున్న వారిని బయట కూర్చొబెట్టి మహిళా కానిస్టేబుల్ ద్వారా టీ సర్వ్ చేయిస్తున్నారు. ఇదే విషయమై అక్కడి అధికారిని మందలించడంతో పాటు వెంటనే వారిని లోపల కూర్చోబెట్టాలంటూ ఆదేశించినట్లు స్టేషన్ సిబ్బంది చెపుతున్నారు.


