టీడీపీకి పరీక్షలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana Comments On TDP - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా  ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరీక్షలపై ప్రభుత్వం, అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ, కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ పేపర్ల లీకేజి, కాపీయింగ్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: ఎస్సై నిర్వాకం: ప్రేమించి, పెళ్లి చేసుకుని.. నా జీవితాన్ని నాశనం చేశాడు 

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించి అరెస్టు చేశామన్నారు. చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల సిబ్బందితో సహా మాల్ ప్రాక్టీసుకు ప్రయత్నించిన 7 మందితో పాటు, నంద్యాలలో కూడా  పలువురు ఉపాధ్యాయులను  పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

పరీక్షా పత్రాలు బయట మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రశ్న ప్రత్రాలు లీకవుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తూ దొరికిపోయిన తమ సొంత పార్టీకే చెందిన నారాయణ, తదితర విద్యా సంస్థల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తమ పార్టీకి (టీడీపీకి) చెందిన వారే అక్రమాలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తూ, ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. ఒకట్రెండు చోట్ల తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరీక్షలు ప్రారంభమైన తరువాత కుట్రపూరితంగా విద్యార్ధులకు సమాధానాలు చేరేలా పథకం ప్రకారం యత్నిస్తూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అరెస్టైన వారి ద్వారా  ఈ విషయం ఇప్పటికే వెల్లడైందని మంత్రి పేర్కొన్నారు.

ఆరు లక్షలకు పైగా విద్యార్థులకు సంబంధించిన అంశంలో రాజకీయాలను చొప్పించవద్దని, పరీక్షలను పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని, ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పూర్తిగా పరీక్షలపైనే దృష్టి సారించాలని ఆయన సూచించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top