గ్రామాల్లో బాబు సర్కారు ‘పెట్రోలు మంట’ | Massive irregularities in gram panchayats in the name of petrol | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో బాబు సర్కారు ‘పెట్రోలు మంట’

Jun 25 2026 5:40 AM | Updated on Jun 25 2026 5:40 AM

Massive irregularities in gram panchayats in the name of petrol

పెట్రోలు పేరిట గ్రామ పంచాయతీల్లో భారీ అక్రమాలు జరిగాయన్న పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌  

అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో ఆ వివరాలు వెల్లడి 

గత రెండు నెలల్లో పెట్రోల్‌ కొనుగోళ్లకు రూ. లక్షలు డ్రా చేశారని వ్యాఖ్య  

ఏప్రిల్‌ 4నే ముగిసిన సర్పంచుల పదవీ కాలం.. ఆ తర్వాత ఇదంతా.. 

ఇది చంద్రబాబు సర్కారు ఆంక్షల ఫలితమేనంటున్న పంచాయతీల సిబ్బంది 

పంచాయతీల నిధుల వినియోగంపై కఠిన ఆంక్షలు పెట్టారని వెల్లడి 

తప్పనిసరి అవసరాలకూ నిధుల వెసులుబాటు లేదని వెల్లడి 

సిబ్బంది జీతాలకూ బిల్లులు పెట్టలేని స్థితి కల్పించారని మండిపాటు 

ఆ బిల్లులను వేరొక పద్దులో పెట్టడం వల్ల బిల్లులు ఇలా వచ్చాయని వివరణ 

ప్రభుత్వం తమపై అభాండాలు వేస్తోందని ఆగ్రహం 

సాక్షి, అమరావతి : లీటరు పెట్రోల్‌ ధర ఎంత..? అందరికీ తెలిసిన ధర రూ. 117. డీజిల్‌ ధర ఇంకా తక్కువే. కానీ గ్రామ పంచాయతీల్లో వాహనాలకు పెట్రోలు లీటరు రూ. 3.50 లక్షల చొప్పున కొన్నట్లు పలు గ్రామ పంచాయతీల నుంచి నిధులు డ్రా చేశారట. స్వయంగా పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కృష్ణ తేజే ఈ విషయం చెప్పారు. గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ నెలతో ముగియగా, ఆ తర్వాత మే, జూన్‌ నెలల్లోనే ఈ మేరకు బిల్లులు డ్రా చేసినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీల్లో ఇంత పెద్ద స్కామా..! అంటూ అవాక్కయ్యారా..! కాదు.. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులపై ఉక్కుపాదం మోపడం వల్ల జరిగిన తతంగం. 

కేంద్ర ప్రభుత్వ గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తూ, పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినప్పుడు కొంత కొంతగా జమ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇచ్చిన నిధులను కూడా గ్రామా అవసరాలకు ఖర్చు పెట్టకుండా పలు ఆంక్షలు విధించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో పంచాయతీలకు అవసరమైన పనుల ఖర్చుల బిల్లులను ఆంక్షలు లేని పద్దుల్లో కలిపి డ్రా చేసినట్లు ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన పితలాటకమేనని, కనీసం సిబ్బంది జీతాలకు కూడా వేరే పద్దులో వేయాల్సి వచ్చిందని అంటున్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో ఇప్పుడిది పెద్ద చర్చనీయాంశంగా మారింది.  ప్రభుత్వం తమ మీద అభాండాలు వేయడానికి ఇదంతా చేస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. 

కమిషనర్‌ చెప్పిందిదీ.. 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ మంగళవారం అన్ని జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో), డిప్యూటీ ఎంపీడీవోలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఏ ఊరులో ఎన్ని లీటర్ల పెట్రోల్, డీజిల్‌ కోనుగోలుకు సంబంధిత పంచాయతీల నిధుల నుంచి ఎన్ని లక్షలు డ్రా చేశారో వివరాలు చెప్పి, ఆ జిల్లాల డీపీవోలు తక్షణమే ఆ పంచాయతీల రికార్డులు పరిశీలించి, ఆయా పంచాయతీ కార్యదర్శులు, మండల డిప్యూటీ ఎంపీడీవోలపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

‘తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం నామవరం గ్రామ పంచాయతీలో రెండు లీటర్ల పెట్రోలుకు రూ.7 లక్షలు, కృష్ణా జిల్లా పామర్రు మండలం జుజ్జవరం గ్రామ పంచాయతీలో డీజీల్, పెట్రోల్‌ కొనుగోలు పేరిట రూ. 37 లక్షలు డ్రా చేశారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం అడవిపల్లె పాలెంలోనూ 2 లీటర్ల పెట్రోల్‌ కోసం రూ. 15 లక్షలు,  ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మహాదేవపురం పంచాయతీలో 7 లీటర్ల పెట్రోల్‌కు రూ. 12 లక్షలు, సత్యసాయి జిల్లా హిందూపూర్‌ మండలం తూముకుంట గ్రామంలో పెట్రోలు, డీజిల్‌ కొనుగోళ్లకు రూ. 11 లక్షలు ఖర్చు చేశారు. 

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామ పంచాయతీలో  రూ. 10 లక్షలు.., ఈపూరు గ్రామ పంచాయతీలో రూ. 7.69 లక్షలు, ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం మైలవరం ఐతవరంలో 5 లీటర్లకు 9.50 లక్షలు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో రూ. 7.93 లక్షలు, సత్యసాయి జిల్లా హిందూపుర్‌ మండలం గొల్లపురంలో రూ. 7 లక్షలు.. గత రెండు నెలల్లో డ్రా చేశారు’ అని కమిషనర్‌ చెప్పినట్లు సమాచారం. 

ప్రభుత్వమే ఆంక్షలు పెట్టి.. అభాండాలు వేస్తోందంటున్న ఉద్యోగులు 
ఇది చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షల ఫలితమేనని క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు గ్రామ పంచాయతీల నిధులను ప్రభుత్వం సూచించే పనులకు మాత్రమే వినియోగించాలంటూ గత ఏడాది డిసెంబరులోనే పరిమితులు విధించింది. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు పెట్టుకోకుండా ఈ ఏడాది జనవరి నుంచీ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రామ పంచాయతీల్లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది జీతాల చెల్లింపులపైనా ఆంక్షలు పెట్టినట్టు ఉద్యోగ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య వాహనాల డీజిల్, పెట్రోలుకు సైతం నిధులు డ్రా చేసే పరిస్థితి లేదని మండల అధికారులు పంచాయతీరాజ్‌ శాఖ దృష్టికి తీసుకు రావడంతో మే నెలలో వీటికి మాత్రమే బిల్లులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 

ఈ కఠిన ఆంక్షల వల్ల వాస్తవంగా జరిగిన ఖర్చుల బిల్లులనే ఆంక్షలు లేని ఇతర పద్దుల కింద పెట్టడం జరిగిందే తప్ప, ఇందులో అక్రమాలు లేవని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది జీతాలు, అభివృద్ధి పనుల బిల్లులను కూడా డీజిల్, పెట్రోల్‌ కొనుగోలు పద్దులో కలిపి నిధులు డ్రా చేసినట్టు చెబుతున్నారు. గ్రామాల్లో అవసరాలకు పంచాయతీల వద్ద ఉన్న నిధులను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఖర్చు చేసుకోవడానికి అవకాశమిచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, తిరిగి ప్రభుత్వం తమపైనే అభాండాలు వేస్తోందని మండిపడుతున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement