మామ వెంటనే నా భార్యను మా ఇంటికి పంపు..! | married woman ends life in Kurnool | Sakshi
Sakshi News home page

మామ వెంటనే నా భార్యను మా ఇంటికి పంపు..!

May 14 2025 10:31 AM | Updated on May 14 2025 10:31 AM

married woman ends life in Kurnool

పుట్టింటి నుంచి త్వరగా రావాలని కోరినందుకు మనస్తాపం  

క్షణికావేశంలో ఉరి వేసుకుని ఆత్మహత్య 

మృతురాలు మూడు నెలల బాలింత  

అనంతపురం/నందవరం: అప్పటికే ఆమెకు ఒక కుమారుడు. తర్వాత రెండో కాన్పులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను దూరం చేస్తూ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పుట్టింటికి వెళ్లి వెంటనే రావాలని భర్త సూచించడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... మంత్రాలయం మండలం మాధవవరం గ్రామానికి చెందిన బోయ ఈరన్న చిన్న కుమార్తె ఉరుకుందమ్మ (24)కు 2020లో అదే జిల్లా నందవరం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు పొపయ్యతో వివాహమైంది. 

వీరికి మూడేళ్ల వయస్సు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగరాజు వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఉరుకుందమ్మ పుట్టింటికి వెళ్లింది. నిశ్చితార్థ వేడుక ముగిసిన తర్వాత స్వగ్రామానికి చేరుకోగానే సాయంత్రం పొపయ్య ఫోన్‌ చేసి తన భార్యను వెంటనే మా ఊరికి పంపాలని మామను కోరాడు. బుధవారం పిలుచకొస్తామని తెలిపినా అల్లుడు వినలేదు. దీంతో ఆదివారమే కుమార్తెను తండ్రి పిలుచుకెళ్లి భర్త వద్ద వదిలాడు. సోమవారం ఉదయం 11 గంటలకు పాపయ్య మరోసారి ఫోన్‌ చేసి ఉరుకుందమ్మ కనిపించడం లేదని తెలిపాడు. దీంతో కుమారుడు నాగరాజు, అల్లుళ్లు తాయన్న, రమేష్‌ తో కలసి నందవరం గ్రామానికి ఈరన్న చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టాడు. 

అయినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అనంతపురం త్రీ టౌన్‌ పోలీసులు ఫోన్‌ చేసి ఉరుకుందమ్మ రైల్వే స్టేషన్‌ క్వార్టర్స్‌ పక్కన చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు అనంతపురానికి చేరుకుని ఉరుకుందమ్మ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అల్లుడి ఒత్తిళ్లు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతి లాల్‌ తెలిపారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement