‘బ్లాక్‌’ కోబ్రా 

Margadarsi Chit Funds Illegal deposits collected in the name of receipt deposits - Sakshi

 బ్లాక్‌ మనీ డెన్‌  

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ రశీదు డిపాజిట్ల పేరుతో సేకరిస్తున్న అక్రమ డిపాజిట్ల వెనుక నల్లధనం గూడుపుఠాణి దాగుంది. రాష్ట్రంలోని 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో సేకరించిన రశీదు డిపాజిట్ల వివరాలను సీఐడీ పరిశీలించడంతో ఈ బాగోతం బయట పడింది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సంబంధిత వ్యక్తుల పాన్, ఆధార్‌ నంబర్లు నమోదు చేయాలని బ్యాంకింగ్, నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థలు కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. కానీ మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సేకరించిన అక్రమ డిపాజిట్లకు ఇస్తున్న రశీదుల్లో ఎక్కడా కూడా డిపాజిట్‌దారుల పాన్‌ నంబరు, ఆధార్‌ నంబర్లను నమోదు చేయడం లేదు.

అంటే ఆ డిపాజిట్ల వివరాలేవీ ఆదాయ పన్ను శాఖ పరిశీలించే అవకాశం లేదు. ఎంత భారీ మొత్తాన్ని డిపాజిట్‌ చేసినా గుట్టు బయటపడదు. ఆ పేరుతో నల్ల కుబేరుల నుంచి భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా సేకరిస్తోంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు వారికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఓ మార్గంగా కనిపిస్తోంది. జాతీయ బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కేవలం 5 శాతం వడ్డీ చెల్లిస్తామన్నా సరే డిపాజిట్లు చేస్తుండటం గమనార్హం. ఎందుకంటే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందన్నది చెప్పాల్సి ఉంది.

పాన్‌ నంబర్, ఆధార్‌ నంబర్‌ ఇతర వివరాలను సమర్పించాలి. అవి ఆర్‌బీఐ, ఆదాయ పన్ను, సీబీడీటీ మొదలైన అధికారుల దృష్టిలో ఉంటాయి. ఆ వివరాలేవీ వెల్లడించడానికి సుముఖంగా లేని వారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్‌ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఈ విధంగా వేల సంఖ్యలో అక్రమ డిపాజిట్ల రూపంలో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చినట్టు సీఐడీ గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేసింది. మొదటి దశలో రూ.కోటికిపైగా డిపాజిట్‌ చేసిన దాదాపు వెయ్యి మందిని గుర్తించింది.

అంటే మొదటి దశలో రూ.వెయ్యి కోట్ల అక్రమ డిపాజిట్లపై దృష్టి సారించింది. ఆ విధంగా డిపాజిట్‌ చేసిన రూ.కోటి నిధులు ఏ ఆదాయ మార్గంలో వచ్చాయో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఎవరూ సీఐడీ నోటీసులకు సమాధానం ఇవ్వనే లేదు. దీనిపై మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఉద్యోగులను ప్రశ్నిస్తే విస్మయకర సమాధానమిచ్చారు. పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు వివరాలను ఆన్‌లైన్‌ ఖాతాల్లో ఎందుకు లింక్‌ చేయలేదని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి మేనేజర్లను ప్రశి్నస్తే అది తమ విధానమని కూడా చెప్పడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే నల్లధనం దాచుకునేందుకు మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ను ఆడ్డాగా చేశారన్నది స్పష్టమవుతోంది. 

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అయినా.. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్‌ చందాలు, ఘోస్ట్‌ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌ ముఖం చాటేశారు.

రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్‌ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది.  – సాక్షి, అమరావతి

ఘోస్ట్‌ చందాదారులతో నల్ల దందా 
బహుశా దేశంలో ఏ ఆర్తిక సంస్థ కూడా చేయని రీతిలో రామోజీరావు సరికొత్త నల్లధనం దందాకు తెరతీశారు. అందుకోసం ఆయన తెరపైకి తెచ్చిన విధానమే ‘ఘోస్ట్‌ చందాదారులు’. తమ ఏజంట్ల ద్వారా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఇలా పలు వర్గాలకు చెందిన వారి ఆధార్‌ కార్డులు సేకరించారు. ఓ పట్టణంలోని వారి ఆధార్‌ నంబర్ల ఆధారంగా దూరంగా ఉన్న పట్టణంలో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయంలో చిట్టీ వేస్తారు. తన పేరుతో చిట్టీ ఉందనే విషయం సంబంధిత వ్యక్తులకు తెలియదు. వారినే ఘోస్ట్‌ చందాదారులుగా వ్యవహరిస్తారు.

వారు చిట్టీలకు చందాలు చెల్లించరు. కానీ వారి పేరున చిట్టీ గ్రూపులు నిర్వహిస్తుంటారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కూడా ఆ చిట్టీ చందాలు చెల్లించదు. కేవలం పుస్తకాల్లో సర్దుబాట్ల ద్వారా చందా చెల్లించినట్టు చూపిస్తారు. కానీ ప్రతి నెల డివిడెండ్లు, ఓసారి చిట్టీ పాట మొత్తాన్ని తీసుకుంటారు. ఆ చిట్టీ పాట మొత్తాన్ని మళ్లీ మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌లోనే డిపాజిట్లు చేస్తారు. ఇలా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఘోస్ట్‌ చందాదారుల పేరిట చిట్టీలు తెరచి.. భారీగా నల్ల ధనాన్ని అక్రమ డిపాజిట్లుగా చలామణిలోకి తీసుకువస్తున్నారు. ఆ విధంగా వేల కోట్ల రూపాయాల నల్లధనాన్ని చెలామణిలోకి తీసుకురావడం రామోజీరావుకే చెల్లింది. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు చేయగా అటువంటి ఘోస్ట్‌ చందాదారుల చిట్టీలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి.  

ఉత్తుత్తి చెక్కులతో ‘బ్లాక్‌’ మ్యాజిక్‌ 
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల నుంచి అక్రమంగా తమ సొంత కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలిస్తున్న నల్లధనానికి మసి పూసి మారేడు కాయ చేసేందుకు రామోజీరావు జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు. ఏటా మార్చి 31న మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయాల్లో బ్యాలన్స్‌ షీట్లు చూపించాలి. కానీ అప్పటికే ఆ నిధులను అక్రమంగా తమ సొంత కంపెనీలు ఉషా కిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ ప్రైజస్‌లతోపాటు మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీల్లోకి తరలించేస్తున్నారు. కానీ మార్చి 31న బ్యాలన్స్‌ షీట్‌తో సరిపోవాలి.

అందుకోసం మార్చి 31న పెద్ద సంఖ్యలో చందాదారులు చెక్కుల రూపంలో చిట్టీల మొత్తం చెల్లించినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ చెక్కులను 90 రోజుల్లో నగదుగా మార్చాలి. కానీ మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ మాత్రం ఆ చెక్కులను నగదుగా మార్చి, బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు చూపించడం లేదు. అంటే మార్చి 31న బ్యాలన్స్‌ షీట్‌ పూర్తి కాగానే.. ఆ చెక్కులను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తోంది. ఎందుకంటే అవన్నీ ఉత్తుత్తి చెక్కులే. ఆ ఖాతాల్లో నగదు ఉండదు. ఆ చెక్కులు బ్యాంకులో వేసినా ఎన్‌క్యాష్‌ కావు. కేవలం చిట్స్‌ రిజి్రస్టార్, రిజర్వ్‌ బ్యాంకును బురిడీ కొట్టించేందుకే ఈ ఉత్తుత్తి చెక్కులతో కనికట్టు చేస్తోంది. ఆ విధంగా ఏటా మార్చి 31న దాదాపు రూ.550 కోట్ల విలువైన చెక్కులను మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ చూపిస్తోంది. అంటే ఏటా దాదాపు రూ.550 కోట్ల నల్లధనాన్ని గుట్టుగా దాటిస్తోందన్నది సుస్పష్టం. ఇలా దశాబ్దాల నుంచి ఏటా రూ.550 కోట్ల చొప్పున నల్లధనం దందా సాగిస్తుండటం రామోజీ బరితెగింపునకు నిదర్శనం.  

‘మార్గదర్శి’ బాధితుల సంఘం ఏర్పాటు 
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘం’ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్‌ చేయించినట్టు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బాధితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. రామోజీరావు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. బాధితులు తమ సమస్యలను తెలిపేందుకు 9849055267 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top