బాసులు సేఫ్‌.. చార్జిషీటే ప్రూఫ్‌! | Many doubts over the 86 page chargesheet along with 263 documents in the Sai Krishna case | Sakshi
Sakshi News home page

బాసులు సేఫ్‌.. చార్జిషీటే ప్రూఫ్‌!

Oct 11 2026 5:09 AM | Updated on Oct 11 2026 5:09 AM

Many doubts over the 86 page chargesheet along with 263 documents in the Sai Krishna case

సాయికృష్ణను లాకప్‌లో కొట్టి చంపిన ఘటనలో ఆద్యంతం పోలీస్‌ బాస్‌లకు తెలియదని నమ్మించే యత్నం 

సాయికృష్ణను పట్టుకొచ్చింది కమిషనర్‌ కనుసన్నల్లోని టాస్క్‌ఫోర్స్‌  

ఆపై ఆరు వారాలపాటు జరిగిన తతంగం అంతా కమిషనరేట్‌ మొత్తానికి తెలిసినా మౌనం  

తల్లి ఫిర్యాదును 22 రోజులపాటు తొక్కిపెట్టిన సీపీ 

సాయికృష్ణను పోలీసులే కొట్టిచంపేసినా డీజీపీ, సీపీ, ఏసీపీలకు తెలియదని బుకాయింపు 

సీఐ నాగరాజుతోపాటు మరో ఆరుగురిని ఫిక్స్‌ చేస్తూ సిట్‌ చార్జిషీట్‌.. 120 మంది సాక్షుల్లో సీపీ, డీజీపీల పేర్లే లేవు 

హైకోర్టుకు సైతం అబద్ధాలు.. పోలీసు పెద్దలను కాపాడేందుకు చంద్రబాబు సర్కారు స్కెచ్‌ 

263 డాక్యుమెంట్లతో పాటు 86 పేజీల చార్జిషీట్‌పై ఎన్నో అనుమానాలు

ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచి, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌లు పోలీస్‌ శాఖకు కళ్లు, చెవులు, ముక్కుగా పని చేస్తాయి. రాజకీయ నేతల కదలికల నుంచి శాంతిభద్రతల సమస్య వరకు.. తీవ్రవాద కార్యకలాపాల నుంచి తీవ్రమైన సమస్యల వరకు చీమ చిటుక్కుమంటే పోలీస్‌ బాస్‌లకు చేరవేస్తారు. మరి కాపు యువకుడు గాదె సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ పట్టుకొచ్చిన దగ్గర్నుంచి.. పోలీసులే కొట్టి చంపి కాల్చి బూడిద చేసే వరకు పోలీస్‌ బాస్‌లకు తెలియదంటే నమ్మాలా? సాయికృష్ణది ముమ్మాటీకి రాజ్య హత్య. ఇందుకు బాధ్యులైన బాసులను తప్పించేందుకు పౌర హక్కులను హననం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  

సాక్షి, అమరావతి :  చంద్రబాబు రెడ్‌బుక్‌ పాలనలో నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) ఉందనే కారణంతో పట్టుకొచ్చిన కాపు యువకుడు గాదె సాయికృష్ణను చట్ట ప్రకారం కోర్టుకు హాజరు పరచకుండా, రోజుల తరబడి లాకప్‌లోనే నిర్బంధించి పోలీసులే కొట్టి చంపేసిన దారుణ ఘటన వెనుక ఉన్న బాసులను రక్షించేందుకు సిట్‌ పడరానిపాట్లు పడుతోంది. సాయికృష్ణ లాకప్‌ డెత్‌ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో డైవర్షన్‌ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని వెనుక ఉన్న బాసులను కాపాడేలా స్కెచ్‌ వేసింది. ఈ కేసులో కోర్టుకు సిట్‌ సమర్పించిన 263 డాక్యుమెంట్లతో పాటు 86 పేజీల ఛార్జిషీట్‌ను నిశితంగా గమనిస్తే.. అనేక అనుమానాలు, ఆధారాలన్నీ బాసుల వైపే వేళ్లు చూపిస్తున్నాయి. 

సాయికృష్ణను పట్టుకొచ్చి కొట్టి చంపే వరకు జరిగిన పోలీస్‌ టార్చర్‌ గురించి సిట్‌ చార్జిషీట్‌లో వివరించిన తీరు క్రైమ్‌ థిల్లర్‌ను తలపిస్తోంది. విజయవాడకు చెందిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ సాయికృçష్ణను మే 6న తీసుకొచ్చింది. ఆపై సాయికృష్ణను పోలీస్‌ స్టేషన్‌లో వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. లాకప్‌లో పెట్టి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి దారుణంగా చిత్రవధకు గురిచేశారు. పోలీసులు దారుణంగా కొట్టడంతో కిడ్నీలు పగిలిపోయాయి. మర్మాంగం నుంచి రక్తస్రావం అయ్యింది. అతని పరిస్థితి విషమించడంతో ఒక పాత భవనంలోకి తీసుకెళ్లి నిర్బంధించారు. చివరకు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక మే 12న చనిపోయాడు. అప్పటికి కూడా పోలీసులు ఈ ప్రక్రియకు ముగింపు పలకలేదు. సాయికృష్ణ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి శ్మశానంలోకి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు.

ఈ కస్టోడియల్‌ టార్చర్‌పై పూసగుచ్చినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్న సిట్‌.. దీని వెనుక ఏం జరిగిందన్నది మాత్రం వివరించక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలీస్‌ బాస్‌ల ప్రమేయం లేకుండానే ఇంత జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ దారుణంలో అసలు దోషులను తప్పించేందుకు పక్కా స్కెచ్‌ వేసిన చంద్రబాబు ప్రభుత్వం.. సిట్‌ ద్వారా కథ నడిపించింది. నేరం మొత్తాన్ని సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుతోపాటు మరో ఆరుగురికి పరిమితం చేసి.. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు, డీజీపీ హరీష్‌ కుమార్‌గుప్తాలను మాత్రం సురక్షితంగా పక్కకు తప్పించే ప్రయత్నం చేసింది.  

అంతా తెలిసినా.. సీపీ మౌనం   
సాయికృష్ణ ఘటనపై సీపీ మౌనం వహించడం దేనికి సంకేతం అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి డీజీపీ, సీపీ, ఏసీపీలకు ఏమి తెలియదన్నట్టు కథ నడిపిస్తున్నప్పటికీ.. సిట్‌ చార్జిషీట్‌లో ప్రస్తావించిన కొన్ని విషయాలు సీపీ ప్రమేయం ఉందనేది చెప్పకనే చెబుతున్నాయి. సీపీ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ సాయికృష్ణను పట్టుకొచ్చింది. అతని అరెస్టు సైతం సీపీ రిజిస్టర్‌లో నమోదైందని చెబుతున్నారు. విజయవాడ నగరంలోని పోలీస్‌ స్టేషన్‌లలో ఉన్న సీసీ కెమెరాల నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంది. 

అయినా.. ఆరు వారాలపాటు కమిషనరేట్‌ మొత్తానికి తెలిసినా మౌనం వహించారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులు పట్టుకొచ్చారని, ఆ తర్వాత కన్పించకుండా పోయాడని అతని తల్లి నేరుగా సీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ కేసులో తమకేమీ తెలియదని న్యాయస్థానానికి పోలీసులు అబద్ధాలు చెప్పారు. సిట్‌ దర్యాప్తు చేపట్టిన నిందితుల జాబితాలో సీపీ పేరు లేదు. కనీసం 120 మంది సాక్షుల జాబితాలోనూ ఆయనను ఏం జరిగిందో అడగలేదు. ఇదీ చంద్రబాబు సర్కారు నిర్వాకం. 

సిట్‌ చార్జిషీట్‌లోని అంశాలపై అనుమానాలెన్నో 
» ఈ ఏడాది మే 6వ తేదీ తెల్లవారుజామున మార్కాపురంలోని అద్దె ఇంట్లో సాయికృష్ణను విజయవాడ సీపీ పర్యవేక్షణలోని టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకొచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించింది. టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ పంపిన ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని అదే రోజున ఉదయం ఏడు గంటలకు కృష్ణలంక స్టేషన్‌లో అప్పగించి రశీదు తీసుకుని, ఫొటో దిగారు.  
» ఆ అరెస్టు కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రిజిస్టర్‌–2026లో 194, 195 పేజీల్లో నమోదైనట్టు సిట్‌ చార్జిషీట్‌ స్పష్టం చేసింది. అంటే తొలిరోజే సాయికృష్ణ అరెస్టు సీపీ పేరిట ఉన్న రికార్డుల్లోకి ఎక్కింది. మరి అతను కోర్టుకు వెళ్లాడా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? 
» మే 11న ఏడీసీపీ అధికారిక టాస్క్‌ఫోర్స్‌ వాట్సాప్‌ గ్రూపులో సాయికృష్ణ గురించి ఆరా తీశారు. ‘ఇంకా స్టేషన్‌లోనే ఉన్నాడు’ అని సమాధానం వచ్చింది. ఇది సాక్షుల వాంగ్మూలంగా చార్జిషీట్‌లోనే నమోదైంది.  
» ఎన్‌బీడబ్ల్యూలో 24 గంటల్లో మేజిస్ట్రేట్‌ ముందు ఉండాల్సిన వ్యక్తి ఐదు రోజులుగా స్టేషన్‌లోనే మగ్గుతున్నాడని సీపీ కింది అధికారికి తెలిసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమాచారం సీపీ వరకు వెళ్లిందా? వెళ్తే ఆయన ఏం చేశారు? సిట్‌ ఈ ప్రశ్న అడగనే లేదు. సాయికృష్ణ స్టేషన్‌లో ఉన్న విషయం కమిషనరేట్‌కు సమాచారం చేరిందని చార్జిషీటే చెబుతోంది. 
» మే 8 తెల్లవారుజామున లాకప్‌ రిపోర్ట్‌ (డీఎస్‌ఆర్‌) కోసం ఏసీపీ సౌత్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. సెంట్రీ కానిస్టేబుల్‌ సాయికృష్ణ పేరు రాసి వాట్సాప్‌లో పంపాడు. ఏసీపీ ఆఫీసు దాన్ని డీఎస్‌ఆర్‌లో ఎక్కించింది. ఆ తర్వాత ఆ రిపోర్టులు ’నిల్‌’గా మారిపోయాయి. కమిషనరేట్‌ పరిధిలోని ఏసీపీ ఆఫీసు రికార్డులనే తారుమారు చేశారు. ఎవరు చేశారు.. ఎవరి అండతో చేశారు.. అనే ప్రశ్నలకు చార్జిషీట్‌లో జవాబు లేదు. 
» స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్‌ఆర్‌లోనూ సాయికృష్ణ లాకప్‌లో ఉన్నట్టు ఎంట్రీలు ఉన్నాయని సిట్‌ పేర్కొంది. స్పెషల్‌ బ్రాంచ్‌ నివేదికలు నేరుగా సీపీ టేబుల్‌కే వెళ్తాయి. టాస్క్‌ఫోర్స్, ఏసీపీ ఆఫీసు, స్పెషల్‌ బ్రాంచ్‌ అనే మూడు దారుల్లోనూ సమాచారం కమిషనరేట్‌కు చేరింది. అయినా సీపీకి తెలియదంటే నమ్మేదెవరు? 
» కృష్ణలంక స్టేషన్‌ ముందున్న రెండు సీసీ కెమెరాలను విజయవాడ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిరంతరం పర్యవేక్షిస్తుందని చార్జిషీటే రాసింది. ఆ కమాండ్‌ కంట్రోల్‌ సీపీ ఆధీనంలోనిదే. జూన్‌ 14 రాత్రి ఆ రెండు కెమెరాలనూ పీకేశారు. ఎన్‌వీఆర్‌లోని నాలుగు ఒరిజినల్‌ హార్డ్‌ డిస్క్‌లు తీసేసి కొత్తవి బిగించారు. మే 1 నుంచి జూన్‌ 1 వరకు నెల రోజుల ఫుటేజీ మాయమైంది. సీపీ కమాండ్‌ కంట్రోల్‌ కళ్ల ముందే కెమెరాలు ఆగిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేరం మాత్రం ఒక హోంగార్డు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ నెత్తిన పడింది. ఒరిజినల్‌ హార్డ్‌డిస్క్‌లు ఇప్పటికీ దొరకలేదని చార్జిషీటే ఒప్పుకుంది. 

కళ్లెదుటే సాక్ష్యాల తొలగింపు 
» కొడుకు కనిపించకపోవడంతో తల్లి గాదె విజయలక్ష్మి మే 28న సీపీకి ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. జూన్‌ 5న ఉన్నతాధికారులందరికీ రిజిస్టర్డ్‌ పోస్ట్‌లో వినతులు పంపారు. అయినా సీపీ పట్టించుకోలేదు. హైకోర్టు ఒత్తిడి పెరిగాక జూన్‌ 19న ఆమె నేరుగా కలిస్తేనే కేసు నమోదుకు ఆదేశించారు. ఆ 22 రోజుల్లోనే కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లోని క్రైమ్‌ రూమ్‌ గోడలపై ఉన్న రక్తపు మరకలను కత్తితో రుద్దేసి.. తొలగించి రంగులు వేశారు. మృతుడి ఫోన్‌ను గోవాకు పంపి ‘బతికే ఉన్నాడు’ అనే నాటకం ఆడారు. సీసీ కెమెరాలు పీకేశారు. ఈ సాక్ష్యాల ధ్వంసం అంతా ఆ 22 రోజుల్లోనే జరిగిందని చార్జిషీట్‌ చెబుతోంది. సీపీ సకాలంలో స్పందించి ఉంటే ఈ సాక్ష్యాలన్నీ మిగిలేవి కావా? 
»  సాయికృష్ణ తల్లి వేసిన హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో ప్రతివాదులు డీజీపీ, సీపీ. వారి తరఫున జూన్‌ 4న, మళ్లీ జూన్‌ 15న ‘సాయికృష్ణ మా కస్టడీలో లేడు’ అని హైకోర్టుకు సమాచారం వెళ్లింది. ‘మూడు ప్రత్యేక బృందాలు వేశాం. మార్కాపురం సహా పలుచోట్ల గాలించాం. 74 మందిని విచారించాం’ అంటూ న్యాయ స్థానానికే కట్టుకథ వినిపించారు. మూడు ప్రత్యేక బృందాలు వేసే అధికారం సీఐకి ఎక్కడిది? అది కమిషనరేట్‌ స్థాయి నిర్ణయం. అయినా ఈ అబద్ధానికి సీఐ ఒక్కడే బాధ్యుడని సిట్‌ తేల్చేసింది.  
»  జూన్‌ 15న సీఐని వీఆర్‌కు పంపారు. అంటే ఆ రోజుకే పెద్దలకు అనుమానం వచ్చింది. అదే రోజు ‘కస్టడీలో లేడు’ అనే అబద్ధం సీపీ ప్రతివాదిగా ఉన్న కేసులో హైకోర్టుకు చేరింది. దాన్ని ఆమోదించిన అధికారి ఎవరో సిట్‌ కనీసం ఆరా తీయలేదు. 
»  చార్జిషీట్‌లోని 120 మంది సాక్షుల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులు, పెయింటర్, పెయింట్‌ షాపు యజమాని, హోటల్‌ సిబ్బంది ఉన్నారు. కానీ ఈ వ్యవస్థకు అధిపతి అయిన సీపీ పేరు మాత్రం లేదు. సీసీ టీవీ రికార్డుల కోసం ఆయనకు ఒక నోటీసు పంపి, ఆయన కార్యాలయం ఇచ్చిన జవాబుతో సిట్‌ సరిపెట్టుకుంది. సీఐ వాడిన రెండు ఫోన్లు ఇప్పటికీ దొరకలేదు. ‘ఎక్కడ పెట్టానో గుర్తులేదు’ అని సీఐ చెబితే సిట్‌ అదే రాసుకుని వదిలేసింది. ఆ ఫోన్లు బయట పడితే మే 6 నుంచి జూన్‌ 15 వరకు సీఐకి పై నుంచి ఎవరెవరు ఫోన్లు చేశారో బయట పడుతుంది. అందుకే ఆ ఫోన్ల జోలికి వెళ్లలేదా?

కీలక పరిణామాలిలా..
1)    సాయికృష్ణపై రెండు కేసుల్లో     వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
2)    మే 6 తెల్లవారుజామున సీపీ టాస్క్‌ఫోర్స్‌ బృందం మార్కాపురంలో అతన్ని పట్టుకుంది. 
3)    అదే రోజు ఉదయం  7 గంటలకు కృష్ణలంక స్టేషన్‌లో అప్పగించారు. 
4)    మే 6 నుంచి 9 వరకు నాలుగు రోజులు లాకప్‌లోనే ఉంచారు. 
5)    గంజాయి సమాచారం కోసం స్టేషన్‌ పై అంతస్తులోని క్రైమ్‌ రూమ్‌లో చేతులు హుక్‌కు వేలాడదీసి కొట్టారు. 
6)    దెబ్బలకు మోకాళ్లు వాచిపోయాయి. నడవలేకపోయాడు. మూత్రంలో రక్తం వచ్చింది. 
7)    మే 8న ఆర్‌ఎంపీ డాక్టర్‌ను స్టేషన్‌కు పిలిపించి ఇంజెక్షన్లు ఇప్పించారు. 
8)    అదే రోజు ఆ స్థితిలోనే గుణదల ప్రాంతంతోపాటు, ఒక హోటల్‌కు తిప్పారు. 
9)    మే 9న పరిస్థితి విషమించడంతో రాణిగారితోటలోని పాడుబడిన భవనానికి తరలించారు. 
10) మే 12 మధ్యాహ్నం అక్కడే చనిపోయాడు. 
11) అదే రోజు రాత్రి బైక్‌పై శవాన్ని స్వర్గపురి శ్మశానానికి తీసుకెళ్లారు. అప్పటికే కాలుతున్న ఓ చితిపై సాయికృష్ణ శవాన్ని వేసి కాల్చేశారు.
12) మే 18న మళ్లీ వెళ్లి అవశేషాలు ఏమైనా మిగిలాయేమో చూసి వచ్చారు. 
13) తుదకు లాకప్‌ రిజిస్టర్లలో సాయికృష్ణ పేరే లేకుండా చేశారు. రిపోర్టుల్లో ‘నిల్‌’ అని రాశారు. 
14) సాయి కృష్ణ తల్లి మే 28న సీపీకి ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది జూన్‌ 19న.

సీఐ దగ్గరే ఆగిన చార్జిషీట్‌
» హైకోర్టు కేసులో డీజీపీ కూడా ప్రతివాది. తల్లి వినతులు డీజీపీకీ వెళ్లాయి. సిట్‌ ఏర్పాటైంది డీజీపీ ఉత్తర్వులతోనే. దర్యాప్తు చేసింది ఆయన కింద పనిచేసే ఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీలు. తమ బాసే ప్రతివాదిగా ఉన్న కేసులో సొంత సీపీ పాత్రను వారు ఎలా విచారిస్తారు? అందుకే చార్జిషీట్‌ సీఐ దగ్గరే ఆగిపోయింది.  

»   డీజీపీ, సీపీ, ఏసీపీల పాత్రపై విచారణ కోరుతూ విజయవాడ కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలైంది. ఆ విచారణ ముందుకు కదలకుండా ఏసీపీ మానస హైకోర్టుకు వెళ్లి ఆగస్టు 13న స్టే తెచ్చుకున్నారు. తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకు? 

»  చివరికి సెప్టెంబర్‌ 23న సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దర్యాప్తును తానే నేరుగా పర్యవేక్షిస్తానని ప్రకటించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్‌ ముందు ఎందుకు హాజరు పరచలేదు.. ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు ఆలస్యమైంది.. సీసీటీవీ ఫుటేజీ ఏమైంది.. మృతదేహం ఎందుకు దొరకలేదు.. అని ధర్మాసనమే నిలదీసింది. ఆ ప్రశ్నలన్నీ వేలెత్తి చూపిస్తున్నది పోలీస్‌ కమిషనరేట్‌ వైపే. 

»  సీఐకి డిఫాల్ట్‌ బెయిల్‌ గడువు ముంచుకొస్తుండటంతో రెండు రోజుల ముందు హడావుడిగా చార్జిషీట్‌ వేశారు. బూడిద, ఎముకల ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక, తల్లి రక్త నమూనాతో డీఎన్‌ఏ పోలిక, ఎన్‌వీఆర్‌ లాగ్స్, 15 మెమరీ కార్డులు, 6 హార్డ్‌డిస్క్‌ల డేటా అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని చార్జిషీటే ఒప్పుకుంది. పోస్టుమార్టం లేదు. శవ దహనం కథ అంతా ఒక నిందితుడి వాంగ్మూలంపైనే నిలబడింది. పెద్దల జోలికి వెళ్లకుండా, సగం ఆధారాలు కూడా లేకుండా వేసిన ఈ చార్జిషీట్‌ కోర్టులో ఎంత వరకు నిలుస్తుందన్నది ప్రశ్నార్థకమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement