వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు 

Less rainfall in 130 mandals of six districts - Sakshi

ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్‌ ఆదేశం 

ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం 

ఆగస్టులో లోటు భర్తీ కాకపోతే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు 

అధిక వర్షంతో వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలిక రకం విత్తనాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు  కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డా. కేఎస్‌ జవహర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్‌ ఆదేశించారు.

అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. 

కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్‌ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్‌ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు.

అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్‌.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top