జనవరిలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం | Agricultural mechanization scheme in January | Sakshi
Sakshi News home page

జనవరిలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం

Dec 25 2025 4:21 AM | Updated on Dec 25 2025 4:21 AM

Agricultural mechanization scheme in January

రైతుభరోసా కోసం శాటిలైట్‌ ఇమేజ్‌ మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయాలి

వ్యవసాయశాఖ అధికారుల సమావేశంలో మంత్రి తుమ్మల

సాక్షి, హైదరాబాద్‌: గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అందులో భాగంగానే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కూడా వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. 

యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడం ద్వారా 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు, యంత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు యాంత్రీకరణ పథకం కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. 

గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతు యాంత్రీకరణ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు జనవరి మొదటి వారంలో మండలాల వారీగా పర్యటించి, రైతులకు అందుతున్న సబ్సిడీలు, యాంత్రీకరణ పథకం దరఖాస్తులు, యూరియా యాప్‌ అమలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌ సేకరించాలని మంత్రి సూచించారు. 

రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క పైసాను కూడా వృథా చేయకూడదనే ఆలోచనతో సీఎం ఉన్నారని, అందుకోసం స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ను ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 

యూరియా యాప్‌ విజయవంతం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తుమ్మల విమర్శించారు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ సమర్థవంతంగా అమలవుతోందని, రైతులు కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాటలతో యాప్‌ అమలులో లేని జిల్లాలలోని రైతులు ఎక్కువగా యూరియా కొంటున్నట్టు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. 

యాప్‌ ద్వారా కూడా రైతులు తమకు అవసరమైన యూరియాను కొనుగోలు చేయొచ్చని, అనవసర భయాందోళనకు గురి కావొద్దని కోరారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యూరియా యాప్‌ను అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రబీ సీజన్‌లోని పంటలకు సంబంధించి శాటిలైట్‌ ఇమేజ్‌ మ్యాపింగ్‌ను త్వరితగతిన పూర్తి చేసి, రైతుభరోసా నిధులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement