
చేనేత అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చీరల ఉత్పత్తి ద్వారా 6,900 మంది నేత కారి్మకులకు ఉపాధి కల్పన
6,780 మంది చేనేత కార్మికులకు
రూ.లక్ష వరకు వ్యక్తిగత రుణమాఫీ : మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇందిరా మహిళాశక్తి(Indira Mahila Shakti) చీరలను వచ్చే నెల 15 నాటికి పంపిణీ చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) ఆధ్వర్యంలో 33.35 లక్షల చీరలు జిల్లా స్థాయి గోదాములకు సరఫరా చేసినట్టు వెల్లడించారు.
సచివాలయంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌తోపాటు ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల శుక్రవారం సమీక్షించారు. చీరల కోసం అవసరమైన వస్త్రోత్పత్తిలో 6,900 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఉపాధి దక్కిందన్నారు. చీరల ఉత్పత్తిని పూర్తి చేసి నవంబర్ 15లోగా జిల్లా స్థాయి గోదాముల నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రుణమాఫీ ప్రక్రియ వేగవంతం: చేనేత కార్మికుల రుణమాఫీని వేగవంతం చేసి, త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని తద్వారా 6,780 మందికి రూ.లక్ష వరకు రుణ విముక్తి లభిస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. తెలంగాణ చేనేత లేబుల్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన వ్రస్తోత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు.
తెలంగాణ నేతన్న భరోసా పథకం కింద చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 13,371 మంది నమోదు చేసుకోగా మరో 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాత్కాలికంగా నడుస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐటీహెచ్)ను పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌లోకి మార్చేందుకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.