బంద్‌తో నిర్మానుష్యంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కొద్దిగా కొనుగోళ్లు
పెట్టుబడికి డబ్బుల్లేక దుఃఖంలో దూది రైతు
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్: ఎక్కడా కాంటా వేయలేదు.. దూది పింజ కూడా ఖరీదు జరగలేదు. ఖమ్మం మార్కెట్ మినహా రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు, ట్రేడర్లు సోమవారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిన్నింగ్ మిల్లులున్న 28 జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే 1,095 మంది రైతులు 10,750 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు.
సోమవారం 52 జిన్నింగ్ మిల్లుల్లో 478 మంది రైతులు పత్తి విక్రయాలకు సంబంధించి స్లాట్స్ బుక్ చేసుకున్నా.. కొనేవారు కరువయ్యారు. సమాచారం లేకుండా పత్తిని మిల్లులకు తీసుకొచ్చిన రైతులు.. అక్కడి బంద్ బ్యానర్లు, ఫ్లెక్సీలు చూసి వెనుదిరిగారు. కొందరు రైతులు పత్తి కొనాలంటూ రోడ్డెక్కారు. ఎకరాకు ఏడు క్వింటాళ్లు, ఎల్–1, ఎల్–2 అంటూ కేటగిరీల వారీగా జిన్నింగ్ మిల్లుల విభజనను రద్దు చేయాలని రాష్ట్ర కాటన్, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ట్రేడర్లు డిమాండ్ చేస్తున్నారు.
సీసీఐ నిబంధనలను సడలించి నోటిఫై చేసిన అన్ని మిల్లుల్లో కొనేలా నిర్ణయం తీసుకునే వరకు బంద్ చేపడతామని జిన్నర్లు సోమవారం కూడా పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు ఎప్పుడు గాడిన పడతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్ సాగు కోసం సన్నద్ధమవుతున్న రైతులు పత్తి అమ్ముకుని అప్పులు కట్టుకోవడమో.. పెట్టుబడులకు ఉపయోగించుకోవడమో చేద్దామనుకుంటే నిలిచిపోయిన కొనుగోళ్లు ప్రతికూలంగా మారాయి.
అసలే అంతంత దిగుబడి.. ఆపై బంద్ పిడుగు
ఏటా ఎకరానికి సుమారు 10–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేది. ఈసారి సాగు లెక్కల్ని బట్టి 4.90 కోట్ల నుంచి 7.34 కోట్ల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని భావించారు. అయితే అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. తెగుళ్లు సోకి దిగుబడి సగానికి తగ్గిపోయింది. ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదని రైతులు అంటున్నారు. ఇదైనా అమ్ముకుందామంటే కొద్దిరోజులు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110లుగా నిర్ణయించి.. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 ఇచ్చారని రైతులు వాపోతున్నారు. పోనీ.. పెట్టుబడులకన్న అయితయి అమ్ముదామని చూస్తే ఇప్పుడు కొనుగోళ్లు బంద్ కావడంతో రైతుల వెన్ను విరిగినట్టయింది.
సీసీఐ కొన్నది 5.69 లక్షల క్వింటాళ్లే...
వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 1,60,644 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఇందులో సీసీఐ 39,182 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. మిగిలిందంతా ప్రైవేటు వ్యాపారులు కొన్నారు. వరంగల్ రీజియన్ పరిధి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని 214 జిన్నింగ్ మిల్లులు నోటిఫై కాగా, 155 మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 5,68,960 క్వింటాళ్ల పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. ఇక అమ్ముకోవడానికి పత్తిని తీసుకొచ్చిన రైతులు.. బంద్‌తో ఇబ్బంది పడ్డారు. నారాయణపేట జిల్లా వడ్వాట్‌తో పాటు పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు.
మంత్రులు మాట్లాడినా మిల్లర్లు ససేమిరా
బంద్ పిలుపు నేపథ్యంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిన్నింగ్ మిల్లుల యజమానులతో మాట్లాడారు. పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని జిన్నింగ్ మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే, తమ డిమాండ్‌ను పరిష్కరించే వరకు పత్తి కొనుగోళ్లు జరిపేది లేదని మిల్లర్లు తేల్చిచెప్పారు. వీరి డిమాండ్లకు సంబంధించి సోమవారం రాత్రి వరకు ఎలాంటి పురోగతి లేదు.
ఈ నేపథ్యంలో సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్‌గుప్తా మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. సీసీఐ.. మిల్లర్లను నయానో, భయానో ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని జౌళిశాఖ వర్గాలు తెలిపాయి. పత్తితో పాటు మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోళ్లకు సంబంధించి నెలకొన్న సమస్యలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సీసీఐ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
నిబంధనలు సడలించాలి
⇒ బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో సీసీఐ నోటిఫై చేసిన 322 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టాలి. నిబంధనల పేరుతో మొండి వైఖరిని విడనాడి రైతుల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని మిల్లుల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.


