అఫ్గానిస్థాన్‌లో మంచుతుపాన్, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గత మూడు రోజులలో దాదాపు 61 మంది మృతిచెందినట్లు అక్కడి విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా పలు ప్రాంతాలలో తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొంది.
తుఫాన్ బీభత్సంతో మధ్య, తూర్పు అఫ్గానిస్థాన్‌లో భారీ మరణాలు సంభవించినట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దాదాపుగా 61మంది ప్రాణాలు కోల్పోగా 110 మందికి పైగా గాయపడ్డట్లు పేర్కొంది. భారీ వానల దాటికి కాందహర్ ప్రావిన్సులోని ఒక ఇంటి పైకప్పు కూలడంతో ఆరుగురు చిన్నారులు మృతిచెందినట్లు తెలిపింది. అంతేకాకుండా మంచు కురవడంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో మృతులు మరింతగా పెరిగినట్లు పేర్కొంది.
అఫ్గాన్ ప్రధాన రోడ్డు మార్గాలలో ఒకటైన సలాంగ్ జాతీయ రహదారి వానల దాటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉజ్బెనిస్థాన్ నుంచి అఫ్గాన్‌కు విద్యుత్‌ను సరఫరా అయ్యే విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్ దెబ్బతినడంతో 12 ప్రావన్సులలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపింది. తుఫాన్ దాటికి రహదారులు దెబ్బతినడంతో టెక్నికల్ సిబ్బంది సమాయానికి అక్కడికి చేరుకోలేక పోయారన్నారు.
అకాల వర్షాలకు పెద్దమెుత్తంలో పంటనష్టం ఏర్పడిందని అక్కడి వార్త కథనాలు పేర్కొన్నాయి. అఫ్గాన్‌లో నాలుగు కోట్లకు పైగా మానవతా సహాయం కోరుతున్నారని యునేటైడ్ స్టేట్స్ నివేదిక ఇదివరకే ప్రకటించింది. కాగా ఇప్పుడు ఈ అకాల వరదలు ఆదేశాన్ని మరింత పేదరికంలో నెట్టాయి.


