కార్మిక నేతలతో కలివిడిగా! | Labor leaders explain the conditions at the plant to YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

కార్మిక నేతలతో కలివిడిగా!

Jun 11 2026 4:57 AM | Updated on Jun 11 2026 4:57 AM

Labor leaders explain the conditions at the plant to YS Jagan Mohan Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం ఇస్తున్న విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నాయకులు

అరగంటకు పైగా సావధానంగా విన్న వైఎస్‌ జగన్‌

ప్లాంట్‌లో పరిస్థితులను వివరించిన కార్మిక నేతలు

అన్నా..! విజయవాడలో ప్రత్యేకంగా కలుద్దామంటూ వైఎస్‌ జగన్‌ ఆహ్వానం

విశాఖ విద్య: స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో అరగంటకుపైగా సమావేశమైన వైఎస్‌ జగన్‌.. కార్మిక నేతలను ఒక్కొక్కరినీ ‘‘అన్నా..!’’ అని ఆ­ప్యాయంగా సంబోధిస్తూ పరిచయం చేసుకున్నారు. ప్లాంట్‌లో నెలకొన్న పరిస్థితులను ప్రధానంగా కార్మిక సంఘాల నేతలు వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. 

ముడి సరుకు నాణ్యత లోపం, భద్రతపై నిర్లక్ష్యం, నిర్వహణ గాలికి వదిలేయడం ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ను పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు జగన్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులపై వర్క్‌ లోడ్‌ పడుతోందని, కార్మికుల సంఖ్య 16 వేలకు తగ్గిపోవడంతో తీవ్ర పని ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. అన్‌ స్కిల్డ్‌ సిబ్బందిని నియమించడం ద్వారా ప్రమాదా­లకు ఆస్కారమిచ్చి స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల్లో ప్రాణ భయం పెంచాలన్నది యాజమాన్యం పథకమని పేర్కొన్నారు. ప్లాంట్‌ పునరుద్ధరణ పేరుతో కేటా­యించిన రూ.11,440 కోట్లు కేవలం జీఎస్టీ, బ్యాంకు రుణాల వడ్డీలు, ఫస్ట్‌ ఫేజ్‌ వీఆర్‌ఎస్‌ అమలుకు వినియోగించారు గానీ విశాఖ ఉక్కు అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగ పడలేదని పేర్కొన్నారు. 

ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వం వైఫల్యం ఉందని.. ఏదో రకంగా ప్లాంట్‌ని ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించకుండా ప్లాంట్‌ లాభాల బాటలో పయనిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని జగన్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదనను సావధానంగా విన్న వైఎస్‌ జగన్‌.. కార్మికుల పక్షాన ఉంటామని భరోసా ఇచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని కార్మిక సంఘాల నేతలకు గుర్తు చేశారు. 

నష్టపరిహారం విషయంలో తాము ఎంత మానవత్వంగా ఉంటామో మీకు తెలుసు కదా.. ! అని పేర్కొన్నారు. మీరంతా విజయవాడ రావాలని.. మరోసారి కూలంకషంగా చర్చిద్దామని కార్మిక సంఘాల నేతలను వైఎస్‌ జగన్‌ కోరారు. సమావేశంలో శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, పార్టీ సీనియర్‌ నేతలు బూడి ముత్యాల నాయుడు, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, గాజువాక సమన్వయ కర్త తిప్పల దేవన్‌రెడ్డి, స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అదనపు కార్యదర్శి జె.రామకృష్ణ, ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, వైఎస్సార్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, స్టీల్‌ వైఎస్సార్‌ టీయూసీ నేత ఎంవీ రెడ్డి, జేఎంఎస్‌ నేత వరసాల శ్రీనివాస్, సీఎఫ్‌టీయూఐ నేత డీ శ్రీనివాస్, డీఐటీయూ నేత బి.డేవిడ్, ఏఐటీయూసీ నేత పడాల రమణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement