మా ప్రాణాలు తీసి... భూములు తీసుకోండి | Kuppam Airport residents express anger at revenue officials | Sakshi
Sakshi News home page

మా ప్రాణాలు తీసి... భూములు తీసుకోండి

May 29 2025 2:20 AM | Updated on May 29 2025 2:22 AM

Kuppam Airport residents express anger at revenue officials

రెవెన్యూ అధికారుల ఎదుట కుప్పం విమానాశ్రయ నిర్వాసితుల ఆగ్రహం  

పురుగుమందు డబ్బాలతో వచ్చి రైతుల కన్నీటిపర్యంతం 

బలవంతపు భూసేకరణకు ప్రయత్నిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిక 

ఇది నియంత ప్రభుత్వమని టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం ఆగ్రహం

‘మేం బతికుంటే భూములను వదులుకోలేం. ముందుగా మా ప్రాణాలు తీసేయండి. ఆనక మా భూములు తీసుకోండి..’ అంటూ ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయ నిర్వాసిత రైతులు స్పష్టంచేశారు. కుప్పంలో విమానాశ్రయం కోసం భూముల సేకరణపై చర్చలకు కుప్పం ప్రాంతీయ అభివృద్ధి మండలి(కడ) ప్రాజెక్ట్‌ ఆఫీసర్, ఆర్డీవో వస్తారని తెలిసి రైతులు శాంతిపురం మండలంలోని దండికుప్పం–అమ్మవారిపేట మధ్య ఉన్న పొలాల వద్దకు చేరారు. అక్కడికి వచ్చిన తహసీల్దారు శివయ్య ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. 

నలుగురు రైతులు పురుగులమందు డబ్బాలతో వచ్చి.. ‘భూమి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే తలా కొంత తాగి చస్తాం’ అని హెచ్చరించారు. బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే దానికి ముందుగానే తమకు సమాధులు కట్టాల్సివస్తుందని రైతులు తేల్చి చెప్పారు. మర్యాదగా భూములు ఇస్తే ఎకరాకు రూ.16 లక్షలు, అడ్డం చెబితే రూ.10 లక్షలు ఇస్తామని, కోర్టుకు పోతే రూపాయి కూడా రాదని అధికారులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ భూములు విమానాశ్రయానికి ఇవ్వడానికి సిద్ధంగా లేమని దండికుప్పానికి చెందిన మహిళా రైతు మురుగమ్మ చెప్పారు. 

ప్రభుత్వం బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా తమ ప్రాణాలు తీసేయాలని తహసీల్దారును కోరారు. ఉన్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ, మిగతా సమయంలో తాను కూలీగా, తన భర్త డ్రైవర్‌గా పనిచేస్తూ వచ్చిన సొమ్ముతో ముగ్గురు బిడ్డలను చదివిస్తున్నామని తెలిపారు. తమకు ఆధారంగా ఉన్న భూమిని కోల్పోతే కుటుంబం బతకడం కష్టమని కన్నీటిపర్యంతమయ్యారు. 

కూలీల సాయంతో తమకు ఉన్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భర్త, డిగ్రీ చదువుతున్న కొడుకును పోషిస్తున్నానని దండికుప్పానికి చెందిన లక్ష్మి చెప్పారు. ఊపిరి ఉన్నంతవరకూ భూమిని వదులుకోబోమని ఆమె స్పష్టంచేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.        – శాంతిపురం

గ్రామాలను తుడిచేస్తున్నారు 
శాంతిపురం–రామకుప్పం మండలాల సరిహద్దులో టైడిల్‌ సిల్క్‌ పరిశ్రమ కోసం 1995లో 175 ఎకరాలు తీసుకున్నారు. మళ్లీ ఇదే ప్రాంతంలో ఎయిర్‌పోర్టు కోసమని 2005లో 1,040 ఎకరాలు తీసుకున్నారు. ఆ భూముల్లో ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. మళ్లీ ఎయిర్‌పోర్ట్‌ పేరుతోనే ఇంకో 1,400 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దండికుప్పం, సిద్దారెడ్లపల్లి, పాలెంగట్టు, వెంకటేష్ పురం, అమ్మవారిపేట, కృషే్ణపల్లి గ్రామాలను పూర్తిగా తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. – జంగం చక్రపాణిరెడ్డి, దండికుప్పం 

ఓట్లేయించినందుకు భూములు లాక్కొంటున్నారు 
నేను టీడీపీ నాయకుడిని. అందరికీ చెప్పి చంద్రబాబుకు ఓట్లు వేయించాను. దానికి ప్రతిఫలంగా నా భూమి, మా గ్రామస్తుల భూము­లు లాక్కొంటున్నారు. ఇది నియంతృత్వ పాలన. ప్రజాపాలన కాదు. తరతరాలుగా జీవనాధారమైన భూములపై రైతులకు ఎలాంటి హక్కు, అధికారం లేవా ? నాకున్న 75 సెంట్లలో వ్యవసా­యం చేసుకుంటూ, ఆవులను పెంచుకుంటూ సంతోషంగా బతుకు­తున్నాం. ఆ భూమి కోల్పోతే మా కుటుంబం నాశనమవుతుంది. రైతు­ల అభిప్రాయంతో సంబంధం లేకుండా బలవంతంగా భూము­లు లాక్కుంటామంటే ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?.  – సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకుడు, సిద్దారెడ్లపల్లి 

Advertisement
 
Advertisement
Advertisement