విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాదం మాటలకందనిది. మామూలుగా వేడి నీళ్లు పడితేనే తట్టుకోలేం. అలాంటిది 1600 డిగ్రీల వేడి ఉన్న ఇనుప ద్రవం మీద పడితే అది ఎంత దారుణ పరిస్థితి అవుతుందో చెప్పనవసరం లేదు. అలాంటి వాతావరణంలో పనిచేయడమే కష్టం. ఇక ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎంత కష్టం. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మరణించడం అత్యంత విచారకరం. వారి కుటుంబ సభ్యులు పడే మనోవేదన ఇంతింత కాదు. వారు అంత కష్టంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు వెళ్లి ఓదార్చే యత్నం చేస్తారు. ఆ సమయంలో కార్మిక సంఘాల నేతలు వచ్చి తమ సమస్యలను వివరిస్తారు. వాటిని వినే ఓపిక పరామర్శకు వెళ్లిన నేతలకు ఉండాలి. అధికారం ఉంది కదా అని ఏమైనా మాట్లాడవచ్చనుకుంటే అది పొరపాటు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్‌లు కార్మికులను ఎంతవరకు ఓదార్చారో కాని, వారి మాటలు పుండుమీద కారం చల్లినట్లయిందని కార్మికులు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విశాఖలో కార్మికుల కుటుంబాలను పరామర్శించిన తీరుకు, లోకేష్, పవన్‌ల వ్యవహార సరళికి మధ్య ఉన్న అంతరాన్ని అంతా చర్చించుకుంటున్నారు. కూటమి నేతలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే, జగన్ మాత్రం బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తం అయింది.
ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధితుల వద్దకు వెళ్లాలి. వారికి అవసరమైన భరోసా ఇచ్చి రావాలి. చంద్రబాబుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా మసులుకోవాలో తెలుసు. అయినా ఆయన ఎందుకు విశాఖ వెళ్లలేదో, కార్మికులను పరామర్శించలేదో తెలియదు. బహుశా తన తరపున కీలక మంత్రిగా ఉన్న లోకేష్ వెళితే సరిపోతుందని అనుకున్నారేమో తెలియదు. లేదా గతంలో కార్మికులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు నిలదీసే అవకాశం ఉందని అనుకున్నారేమో చెప్పలేం.
మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లారు. సహజంగానే పవన్ కళ్యాణ్ కన్నా, లోకేష్‌కే ఎల్లో మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విషయాన్ని జనసేన నేతలు గమనించకపోలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఒక పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. తాను వెనుకబడిపోకూడదని అప్పటికప్పుడు వెళ్లారేమో తెలియదు. ఇంత పెద్ద ఘటనలు జరిగినప్పుడు కార్మిక వర్గాలలో ఆవేదన, ఆక్రోశం ఉంటుంది. తమ బాధను నేతలకు చెప్పుకునే యత్నం చేస్తారు. కొన్నిసార్లు నేతలను విమర్శిస్తుంటారు. అయినా అధికారంలో ఉన్నవారు సంయమనంతో ఉండి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలి. కాని దురదృష్టావశాత్తు లోకేష్, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన విషయాలు చూడండి. కార్మిక నేతలు ప్రశ్నలు వేస్తుంటే, లోకేష్ అసహనానికి గురై ఎందుకు గొడవపడుతున్నారు. రాజకీయం చేయడానికి వచ్చారా? మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదుగా!' అని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.
స్టీల్ ప్లాంట్‌ను తామే కాపాడామని, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వైపు చూస్తూ వీరు పోరాడారు అని లోకేష్ అన్నారు. ఆ మంత్రి ఎప్పుడు పోరాడారో ఎవరికి తెలియదు. పైగా స్టీల్ ప్లాంట్‌ను కాపాడామని లోకేష్ అనగానే అందుకే ఇంతమంది చనిపోయారా?అని కార్మిక నేత ఒకరు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మరో సందర్భంలో టీమ్ లెవెన్ కెప్టెన్ వచ్చారా అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించడంపై అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు రాలేదన్న విషయాన్ని విస్మరించి జగన్ పై వ్యాఖ్య చేయడమేమిటా అన్న ప్రశ్న వచ్చింది.
స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ కేవలం బ్యాంకు రుణాలు చెల్లించడానికి, కార్మికులకు వీఆర్ఎస్ చెల్లించడానికే ఖర్చు చేశారు తప్ప, ప్లాంట్ అభివృద్దికి పెట్టలేదని, ఇదే ప్రైవేటైజేషన్‌కు జరిగే కుట్ర అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక కర్మాగార యాజమాన్యం 25 లక్షల ఆర్థికసాయం ప్రకటించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం అయింది. దీనికి లోకేష్ తగు సమాధానం ఇవ్వకపోగా, కార్మిక సంఘాలు అడుగుతాయని, వారిదేం పోయిందని వ్యాఖ్యానించడం అభ్యంతరకరంగా కనిపిస్తుంది.
గతంలో విశాఖలో ఎల్.జి.ఫాలిమార్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి పదమూడు మంది మరణించగా, జగన్ అప్పటికప్పుడు కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రభుత్వ పక్షాన ప్రకటించారు. అప్పుడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కాని ఇప్పుడేమో ప్రభుత్వపరంగా సాయం ప్రకటించలేదు. ఒకవైపు రకరకాల పబ్లిసిటీ కార్యక్రమాలకు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, విశాఖ ఉక్కులో ఇంత ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలవారికి సాయం చేయలేరా అన్న ప్రశ్న వచ్చింది. పవన్ కళ్యాణ్ యధా ప్రకారం తనకు ఈ ప్లాంట్ విషయంలో అంత అనుభవం లేదని వ్యాఖ్యానించడం కార్మిక సంఘాలకు ఆశ్చర్యం కలిగించింది.
గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీనిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణ చేసి మళ్లీ దొరికిపోయారు. మరుసటి రోజు జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత లోకేష్, పవన్ లకు గట్టి జవాబు ఇచ్చారు. తమ హయాంలో ప్రధానికి ఎన్నిసార్లు లేఖలు రాసింది.. ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆధార సహితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గతంలో ఈ అంశం ప్రస్తావించి జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని, అందువల్లే ఆ కార్యక్రమం జరగలేదని చెప్పిన వీడియో కూడా ప్రముఖంగా సోషల్ మీడియాలో కనిపించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ప్లాంట్‌ను జగన్ ప్రభుత్వం ఎలా ప్రైవేటైజ్ చేస్తుందని సోషల్ మీడియాలో పవన్‌కు ప్రశ్నలు సందించి ఎద్దేవా చేశారు. ఇక లోకేష్ వ్యవహార శైలిపై జగన్ మండిపడుతూ లోకేష్ వంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో కార్మిక సంఘాలు అడిగిన సూటి ప్రశ్నలకు జవాబివ్వకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ, ఎదురు సంఘాలపైనే లోకేష్, పవన్ లు విమర్శలు చేయడం కూడా బాగోలేదు. అలా కాకుండా ప్యాకేజీని ఎందుకు ప్లాంట్ అభివృద్దికి వ్యయం చేయలేదు?సుమారు పదివేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? పలు ముఖ్యమైన విభాగాలను ప్రైవేటు రంగానికి ఎందుకు అప్పగిస్తున్నారు? ప్రైవేటు రంగంలో స్థాపిస్తున్న మిట్టల్ స్టీల్ కు కాప్టివ్ మైన్ ఇంత త్వరగా ఎలా కేటాయించారు. అరవై ఏళ్లకు పైగా నడుస్తున్న విశాఖ స్టీల్‌కు ఎందుకు కాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు? అన్న ప్రశ్నలకు ఓపికగా వీరిద్దరూ జవాబు ఇచ్చి ఉంటే బాగుండేది. కాని వారికి ఆ విషయాలపై అంత పరిజ్ఞానం ఉందో, లేదో గాని, వాటికి సమాధానం ఇవ్వలేదు. జగన్ మాత్రం అందుకు భిన్నంగా కార్మిక సంఘాలతో ఓపికగా మాట్లాడి స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించడానికి తన ప్రయత్నాలను సావధానంగా వివరించారు. అలాగే బాధిత కుటుంబాలవారిని తనదైన శైలిలో ఓదార్చారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ పరిహారం ఇవ్వకపోతే, తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతామని స్పష్టం చేయడంతో బాధితులకు కొంత సాంత్వన చేకూర్చినట్లయింది.
గతంలో తన ప్రభుత్వం చేసిన మాదిరే అసెంబ్లీలో ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చంద్రబాబు సర్కార్‌కు ఆయన సవాల్ చేశారు. దీనిపై కూటమి నేతలు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. జగన్ విశాఖకు వచ్చినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది. ఏవేవో పిచ్చి ఆరోపణలు చేసి జగన్ టూర్ పై విషం చిమ్మే యత్నం చేసింది. ఏది ఏమైనా ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలో పవన్ కళ్యాణ్, లోకేష్ లు ముందుగా తెలుసుకుని రావాలని కార్మిక సంఘాలు చేస్తున్న సూచన అర్థవంతమైనదే అనుకోవాలి.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


