జగన్‌ విజన్‌ బాబు తలకెక్కిందా? | KSR Comments Over YS Jagan Vision And CBN | Sakshi
Sakshi News home page

జగన్‌ విజన్‌ బాబు తలకెక్కిందా?

Apr 14 2025 12:11 PM | Updated on Apr 14 2025 12:39 PM

KSR Comments Over YS Jagan Vision And CBN

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు అసలు విజనరీ ఎవరో అర్థమై ఉండాలి. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ఒకే ఒక్క మంచి పనితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దూరదృష్టి, దార్శనికత ఏమిటో తెలిసి వచ్చి ఉంటుంది. బాబు ఇటీవల వెళ్లిన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అభివృద్ధి.. పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేయడం, చూసిన తరువాత కూడా బాబుకు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటన్న ఆత్మవిమర్శ చేసుకోకపోతే దానికి ఆయనే బాధ్యుడు అవుతాడు. 

వైఎస్‌ జగన్‌ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణలపై ఇప్పటివరకూ చంద్రబాబు ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక లేదా టీవీ ఛానల్‌లో రాసిన పచ్చి అబద్దాల వార్తలు మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకుని ఉంటారు. ఇంతకాలం తాను చేసిందేమిటన్న స్పృహ ఆయనకు వచ్చి ఉంటే మంచిదే. జగన్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేశారు. స్కూ​ల్స్‌లో బల్లల మొదలు, టాయిలెట్ల వరకు, పిల్లల డ్రెస్ మొదలు, వారు తినే ఆహార పదార్ధాల వరకు జగన్ పర్యవేక్షించేవారు. పిల్లలకు పోషకాహారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

అంతకుముందు చంద్రబాబు 2014 హయాం వరకు పాడైపోయి ఉన్న స్కూళ్లను ఒక విప్లవం మాదిరి జగన్ దశల వారీగా బాగు చేయించారు. ప్రభుత్వ స్కూళ్లు అంటే నరకప్రాయం అన్న అభిప్రాయాన్ని తొలగించి, వాటిని ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చి దిద్దారంటే అతిశయోక్తి కాదు. తాగునీటి సదుపాయంతోపాటు, స్కూల్  ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. టాయిలెట్స్‌ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పాఠ్య పుస్తకాలు రెండు భాషల్లో (ఇంగ్లీషు, తెలుగు)నూ చదువుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్జాతీయ స్థాయి ఐబీ కోర్సు,  టోఫెల్ వంటి పరీక్షలకు మూడో తరగతి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్దులంతా జగన్ మామ అని పిలుచుకునేవారు.

అన్నింటినీ మించి పిల్లలు స్కూళ్లు మానివేయకుండా అమ్మ ఒడి అనే స్కీమ్ ను తెచ్చి విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చేశారు. ఇంత చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తుండేది. కానీ, ఎన్నికల నాటికి వాస్తవం తెలుసుకుని విద్యార్ధి ప్రతీ ఒక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు వంటివారు ఎక్కాలు చదివినట్లు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీని మరిచారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. జగన్ సంస్కరణలు తీసుకు వస్తే వాటికి వ్యతిరేకంగా టీచర్లను  టీడీసీ నేతలు  రెచ్చగొట్టారు. మెగా డీఎస్సీ నిర్వహించి స్కూళ్లలో టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రచారం చేశారు.

ఇన్ని హామీలు ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా ఉన్న ఐబీ సిలబస్ ఎత్తివేసింది. పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ఉందో, లేదో తెలియదు. టోఫెల్ కోచింగ్‌ రద్దు చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశే మంత్రి అయినా విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా మారే పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ జిల్లాలోని ముప్పాళ్లలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడి  సదుపాయాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. వారు ఆంగ్లంలో మాట్లాడుతుంటే బహుశా ఆయన ఆశ్చర్యపోయి ఉండాలి. గతంలో ఆంగ్ల మీడియంను ఆయనతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ  నేతలు వ్యతిరేకించే వారు. చంద్రబాబుకు ఆ పిల్లలలో ఉన్న బలమైన ఆకాంక్ష ఏమిటో అర్థమై ఉండాలి.

విద్యార్ధులు వారు చేస్తున్న ప్రయోగాల గురించి ఇంగ్లీష్‌లో వివరిస్తుంటే, బాబు గారు మధ్య, మధ్యలో ఎక్కువ భాగం తెలుగులోనే మాట్లాడారు. ఒక బాలిక ‘‘కలర్‌పుల్ గుడ్ మార్నింగ్’’ అని అన్నప్పుడు అలా ఎందుకు అన్నావు అని ప్రశ్నించి, ఇన్నోవేటివ్‌గా మాట్లాడావు కాబట్టి ఆకర్షించావు అని సీఎం వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన కేవలం ఆ బాలిక మాటలకే కాదు. మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు కూడా ఆకర్షితులై మరో బాలుడిని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అన్నప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని జవాబు  ఇచ్చాడు. దానికి ఏమి చదవాలని అడిగితే ఇంగ్లీష్ అని చెప్పేసరికి చంద్రబాబు అవాక్కై ఉండాలి. కొంతకాలం క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో ఒక స్కూల్‌ ను సందర్శించి ప్రైవేటు స్కూళ్ల మాదిరి సదుపాయాలు  ఉన్నాయని ప్రశంసించారు. మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న వాస్తవ పరిస్థితి గమనించి ఒకింత ఆశ్చర్యపడిన వీడియోలు గతంలో వచ్చాయి.

ఇప్పుడు చంద్రబాబు స్వయంగా చూశారు. అయినా వారిలో అహం దెబ్బతింటుంది కనుక, జగన్ పాలనలో జరిగిన ఈ మార్పులను అంగీకరించడానికి మనసు అంగీకరించదు. అంతేకాక చంద్రబాబుకు ప్రభుత్వ స్కూళ్లపై అంత నమ్మకం ఉన్న మనిషి కాదని అంటారు. కొందరు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఆయన ఆప్త మిత్రుడు. అలాంటి వారిలో ఒకరైన నారాయణ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి. అయినా ఫర్వాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ  కూటమి కూడా ఈ స్కూళ్లను పాడు చేయకుండా వాటిని జగన్ టైమ్ నాటి ప్రమాణాలతో కొనసాగిస్తే మంచిదే. కాని పలు స్కూళ్లలో పారిశుద్ధ్యం కొరవడిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం గతంలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రత్యేక సిబ్బంది లేకపోవడమే. విద్యా రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు యథావిధిగా కొనసాగించితే  ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలకు న్యాయం చేసినట్లవుతుంది. జగన్ ఫోబియాతో బాధపడుతున్న వారికి  అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. చంద్రబాబు స్కూల్‌కు రావడం సంతోషంగా ఉందని ఒక బాలిక అంది. ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆ బాలిక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందట.

అంటే  ఏదో మర్యాద కోసం అలా మాట్లాడిందే తప్ప ఇంకొకటి కాదేమో అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అదే జగన్ సీఎం హోదాలో వచ్చి ఉంటే తాము సంతోషానికి ఆ బాలికలు వంద కారణాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు స్కూల్‌కు వచ్చినా, రాకపోయినా పెద్దగా తేడా లేదన్న భావన ఉండవచ్చు. ఎందుకంటే  వారేమీ తమ హయాంలో స్కూళ్లను ఇలా మెరుగు పరచలేదు కనుక. జగన్ మంచి చదువే పేద పిల్లలకు ఇచ్చే సంపద అని పలుమార్లు చెప్పేవారు. అదే చంద్రబాబు మాత్రం విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్నారు. తన మనుమడు దేవాన్శ్‌ను మంచి ప్రైవేటు స్కూల్‌లో చదివిస్తుండవచ్చు. అలాగే  ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలను కూడా అదే తరహాలో భావించి మంచి విద్య ఇవ్వడానికి యత్నిస్తే పేరు వస్తుంది. ఏది ఏమైనా విద్యకు సంబంధించి జగన్ విజన్ ను చంద్రబాబు అంగీకరించక తప్పదు కదా!.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement