KSR Special Article On CBI Investigation On YS Viveka Case - Sakshi
Sakshi News home page

YS Viveka Case: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా?

Published Mon, Jul 24 2023 9:31 AM

KSR Article On CBI Investigation Of Viveka Case - Sakshi

ఆంద్రప్రదేశ్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆధారంగా రాజకీయాలు చేయాలని ఆశించిన తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ పారలేదు.  ఈ కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబాన్ని ఎలాగొలా ఇరికించడానికి జరిగిన ప్రయ్నత్నాలన్నీ కుట్రపూరితమేనన్న సంగతి అర్దం అవుతుంది. సీబీఐ ఈ కేసును చేపట్టిన ఇన్నాళ్ల తర్వాత నిర్దిష్టంగా ఏమీ తేల్చలేకపోవడం గమనించదగ్గ అంశం.

అయినప్పటికీ కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డి పేరును చార్జీషీట్ లో నిందితుడుగా చేర్చడం, ఆయన తండ్రిని అరెస్టు చేయడం వంటివి వివాదాస్పదంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లితే టీడీపీకి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ కేసులో అవినాశ్‌ను కాపాడడానికి వెళ్లారని ప్రచారం చేసింది. అది తప్పుడు ప్రచారమని ఈ సీబీఐ చార్జీషీట్ స్పష్టం చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనను కూడా నిందితుల జాబితాలో చేర్చడమే ఇందుకు ఉదాహరణ. చిత్రమేమంటే ఆయనపై  హత్యానేరం మోపినట్లు ఈనాడు పత్రిక బానర్ హెడింగ్ పెట్టి ఆత్మ సంతృప్తి చెందింది. నిజానికి ఇలాంటి కేసులలో సీబీఐ చాలా జాగ్రత్తగా అన్ని కోణాలలో దర్యాప్తు చేయవలసి ఉంటుంది.

కాని ఇందులో అవసరంలేని వ్యక్తులను కూడా సాక్ష్యాలకు పిలవడం, అవసరం ఉన్నవారిని వదలివేయడం సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. సీబీఐ వెనుక ఎవరో అదృశ్య హస్తం ఉండి నడిపిస్తున్నారన్న సందేహం వచ్చింది. దానికి తగ్గట్లుగానే సీబీఐ కోర్టుకు తన వద్ద ఉన్న సమాచారాన్ని  తెలియచేయడానికి ముందే ఎల్లో మీడియా లో ప్రత్యక్షం అవడం కూడా ఈ డౌట్‌లను ధృవీకరించింది. ఇంతచేసినా సీబీఐ ఫలానా మోటోతో ఈ హత్య జరిగిందని చార్జీషీట్ లో ప్రస్తావించలేదు.   మొదట ఇందులో ఆర్దిక కోణం గురించి సీబీఐ కాన్సన్ ట్రేట్ చేయకపోవడంలోని ఆంతర్యం ఏమిటో తెలియదు. వైఎస్ వివేకా ఆర్దిక స్థితిగతులు, అతనిని సొంత కుటుంబం దూరంగా ఉంచిన వైనం, ఆయన చెక్ పవర్‌ను రద్దు చేసిన తీరు. డ్రైవర్ దస్తగిరి, గంగిరెడ్డి తదితరులతో వచ్చిన విబేధాలు , రియల్ ఎస్టే ట్ లావాదేవీలు, మరో మహిళను పెళ్లి చేసుకోవడం, మగ పిల్లాడిని కనడం వంటి అంశాలకు ఎందుకు సీబీఐ విచారణలో సీరియస్‌గా తీసుకోలేదో అంతుపట్టదు.

రాజకీయ కోణం అంటూ చేసిన ఆరోపణలలో హేతుబద్దత కనిపించడం లేదు. ఉదాహరణకు అవినాశ్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వరాదన్నది ఆయన ఉద్దేశం అయితే మాత్రం ఇచ్చేది ఆయన కాదు కదా! పార్టీ అధినేత జగన్ కదా? ఇందులో వివేకా అడ్డుపడేదేముంది? అవినాశ్‌కు కుండాపోయేదేమంది? వివేకా ఎన్నికల ప్రచారానికి ఎవరికి మద్దతుగా వెళ్లారు? వైఎస్ షర్మిల కూడా రాజకీయ అంశాలపై దృష్టి పెట్టడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ హత్య కేసులో రాజకీయం కోణం గురించి ప్రస్తావించి అవినాశ్ ప్రమేయం ఉండవచ్చని తమ ఆలోచన అంటూ .. అది నిజం కావచ్చు..కాకపోవచ్చు అని, మరో సందర్భంలో తన వద్ద ఆధారాలు లేవు కానీ..  అని అనడం సాక్ష్యం ఎలా  అవుతుంది. ఆమె, వివేకాలు ఎంపీ టిక్కెట్ గురించి మాట్లాడుకుంటే ఫైనలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? వారిలో ఎవరో ఒకరు జగన్‌తో మాట్లాడితే కదా?అలాంటిది ఏమీ లేదే?

షర్మిల రాజకీయంగా తెలంగాణలో దృష్టి పెట్టడం ఆరంభించాక ఆమె స్వరంలో ఎందుకు మార్పు వచ్చిందో తెలియదు. ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో అవినాశ్ రెడ్డే ఎంపీ అభ్యర్ధి అని, అతను మంచివాడని చెప్పిన సంగతి విస్మరించలేం కదా? ఆమె మాత్రమే కాదు. వివేకా కుమార్తె సునీత కూడా రాజకీయంగా ఎలాంటి అనుమానాన్ని తొలుత వ్యక్తం చేయలేదు కదా? ఎవరో ఉదయకుమార్ రెడ్డి తల్లి పక్కింటావిడతో తన కొడుక్కి ముందే హత్య గురించి తెలుసని అన్నదన్న  సమాచారంతో ఈమెకు అనుమానం మొదలైందట. ఇది నమ్మశక్యంగా  ఉందా? వివేకా ఎప్పుడో సునీతకు ఆస్తి రాసిచ్చేశారని షర్మిల చెప్పిన విషయం కూడా కరెక్టు కాదని , తండ్రి హత్య తర్వాత సునీతకు బదలాయింపు అయిన ఆస్తుల వివరాలన్నీ మీడియాలో వచ్చాయే! ఈ కేసులో ఎవరివద్ద అయినా క్లూ ఉంటే సీబీఐ సాక్ష్యానికి పిలవవచ్చు.అలాకాకుండా తోచినవారందరిని పిలిచి , ఉబుసుపోక కబుర్లను పరిగణనలోకి తీసుకుని  అభియోగాలు మోపవచ్చా? సునీత తన మొదటి వాంగ్మూలలో ఎక్కడా అవినాశ్ పైన అనుమానం వ్యక్తం చేయలేదు కదా?

తదుపరి కాలంలో ఎందుకు మాట మార్చారు?అన్నిటికి మించి తన తండ్రిని గొడ్డలితో హత్య చేశానని చెబుతున్న నిందితుడికి ఆమె మద్దతు ఇవ్వడం నైతికంగా సమర్ధనీయమేనా?అతనికి ముందస్తు బెయిల్ కు సహకరించడం సరైనదేనా?  2009 తర్వాత జరిగిన పరిణామాలలో వివేకానందరెడ్డి కాంగ్రెస్ లో ఉండి మంత్రి పదవి తీసుకునేలా వత్తిడి చేసింది ఆయన కుటుంబ సభ్యులా?కాదా? ఆ తర్వాత విజయమ్మపై పోటీ చేసినప్పుడు అల్లుడు మరికొందరి పాత్ర ఏమిటి? అయినా ఆ తర్వాత కాలంలో జగన్ ఆయనను గౌరవించి పార్టీలోకి మళ్లీ చేర్చుకుని ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారా? లేదా? జగన్ మద్దతు ఇచ్చిన వ్యక్తికి వైఎస్ భాస్కరరెడ్డి ,అవినాశ్ రెడ్డి తదితరులు వ్యతిరేకించేంత సీన్ ఉంటుందా? టీడీపీ అభ్యర్ది వైసిపి ఓటర్లను కొనుగోలు చేసి కర్నాటక క్యాంప్ లో పెట్టారన్న ఆరోపణలు అబద్దమా? ఈ కేసులో కేవలం ఎంపీ టిక్కెట్ విషయంలోనే విబేధాలు వచ్చి హత్య జరిగిందని ఆరోపిస్తున్న సీబీఐ ఈ కోణాలలో ఎందుకు సమాచారం సేకరించలేదు? వివేకా మరణం గురించి జగన్ కు ఎప్పుడు తెలిసిందన్నదానికి అంత ప్రాధాన్యం ఏమిటో అర్దం కాదు.

ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశంలో ఉన్న అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి తదితరులు ఫలానా టైమ్ కు జగన్కు పోన్ వచ్చిందని చెప్పకపోయినా, సీబీఐ తనకు తోచిన రీతిలో టైమ్ మెన్షన్ చేయవచ్చా? ఇవన్ని ఒక ఎత్తు అయితే, గూగుల్ టేకవుట్ డ్రామా సంగతి ఏమిటి? సీబీఐ గూగుల్ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తోందని ఎల్లో మీడియా చేసిన హడావుడి అంతా ,ఇంతా కాదు కదా? మరి ఇప్పుడు ఆ గూగుల్ టేకవుట్ టైమింగ్ మనకు వర్తించదని తేలింది కదా? దాని పేరుతోనే వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ  జవాబివ్వక్లర్లేదా? ఎల్లో మీడియా ఆ విషయాన్ని దాచిపెట్టడానికి ఇప్పుడు తంటాలు పడుతోంది.  ఏది ఏమైనా అనేక మిస్సింగ్ లింక్లతో సీబీఐ దాఖలు చేసిన చార్జీసీట్ పై వైర్ మీడియా చేసిన విశ్లేషణ చూస్తే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుంది.

ఇవన్ని ఎందుకు! అవినాశ్ రెడ్డి ముందస్త బెయిల్ కేసులో విచారణ చేసిన న్యాయమూర్తి లేవనెత్తిన ప్రశ్నలకైనా సీబీఐ ఈ చార్జిషీట్ లో సమాధానం ఇవ్వగలిగిందా? అంతేకాదు. కేసు విచారణకు ముందే  న్యామూర్తిపైనే తెలుగుదేశం కు చెందిన మీడియా బహిరంగంగా ఆరోపణ చేయవలసిన అవసరం ఏమి వచ్చింది. వారికి ఈ కేసులో ఉన్న ప్రత్యేక శ్రద్ద ఏమిటి? అది రాజకీయమా? లేక ఆర్థికమా? ఆ విషయాలపై కూడా దర్యాప్తు సంస్థ ఆలోచించాలి కదా? ఏపీలో ముఖ్యమంత్రి జగన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి కాని, మీడియాకు కాని ఉపయోగపడేలా సీబీఐ లీకులు ఇచ్చిందన్న ఆరోపణలకు బదులు దొరుకుతుందా?

ఈ కేసులో  వైఎస్ అవినాశ్ రెడ్డి మొదటి నుంచి ఒకే మాట మీద ఉంటే, సునీత, ఆమె భర్త పలుమార్లు మాటలు మార్చారు. ఈ కోణాన్ని కూడా కేసులో పరిశీలించవలసిన అవసరం ఉంది కదా! ఏతావాతా ఇన్ని లోపాలతో సీబీఐ చార్జీషీట్ వేసిందన్న విమర్శలు వస్తుంటే తెలుగుదేశం పార్టీకాని, ఎల్లో మీడియా కాని ఈ కేసులో చార్జిషీట్ అప్పుడే పడిపోయిందే అన్న బాదలో ఉన్నాయట. ఎన్నికల వరకు ఈ కథ నడిపి, రాజకీయంగా వాడుకోవాలన్న వారి కోరిక నెరవేరకుండా పోతోందన్నది వారి భావన అట. ఎందుకంటే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ,అబివృద్ది కార్యక్రమాల ఆధారంగా ఎన్నికలలోకి వెళితే గెలుపు అసాధ్యమని నిర్ణయానికి వచ్చిన వీరు ఈ కేసు ఆధారంగా రాజకీయం నడపాలని అనుకున్నారట. మొత్తం మీద సీబీఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఇటీవలి కాలంలో పబ్లిక్ స్క్రూట్నీలో  ఫెయిల్ అవుతున్న తీరు అందరికి అర్ధం అవుతూనే ఉంది.


- కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
 
Advertisement
 
Advertisement