ఖమ్మం జిల్లా: సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన యువకుడికి ఆయన తల్లి పుట్టిన తేదీ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆమె పుట్టిన తేదీ కలిసొచ్చేలా నంబర్‌తో కూడిన లాటరీ టికెట్ కొనుగోలు చేయగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన సామాన్య రైతు బోళ్ల మాధవరావు, భూలక్ష్మి దంపతుల కుమారుడు అనిల్‌కుమార్ స్థానికంగా చదువుకుని ఉన్నత విద్య హైదరాబాద్‌లో పూర్తి చేశాడు.
ఆతర్వాత హైదరాబాద్, చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసిన అనిల్ యూఏఈలో ఉద్యోగ అవకాశం రావడంతో ఏడాదిన్నర కిందట వెళ్లాడు. కొంత కాలంగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఆయన, తల్లి భూలక్ష్మి పుట్టిన రోజైన 11వ తేదీ కలిసొచ్చేలా అబుదాబీలో టికెట్ కొనుగోలు చేశాడు. ఈ టికెట్‌పై అనిల్‌కుమార్‌కు రూ.240 కోట్ల లాటరీ తగిలింది. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనిల్ కోటీశ్వరుడైనట్లయింది. కాగా, ఈ లాటరీ విషయం కొన్నాళ్ల కిందట బయటకు వచి్చనా భీమవరం అనే పట్టణం ఏపీలోనూ ఉండటంతో విజేత అక్కడి వ్యక్తేనని భావించారు. కానీ ఖమ్మం జిల్లా భీమవరం వాసి అని తాజాగా వెలుగులోకి వచ్చింది.


