ఉద్యమానికి ఉద్యోగులు సన్నద్ధం కావాలి | Key meeting chaired by Bopparaju Venkateswarlu | Sakshi
Sakshi News home page

ఉద్యమానికి ఉద్యోగులు సన్నద్ధం కావాలి

Jun 24 2026 5:03 AM | Updated on Jun 24 2026 5:04 AM

Key meeting chaired by Bopparaju Venkateswarlu

జూలై 10లోపు అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలి 

జూలై 12న శ్రీకాకుళంలో, 21న అనంతపురంలో సన్నద్ధత సభలు 

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ  

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు 

గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. జూలై 12న శ్రీకాకుళంలో, 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధత సభలు నిర్వహించాలని జేఏసీ సమావేశం తీర్మానించింది. మంగళవారం విజయవాడలో జేఏసీ, అమరావతి ఆధ్వర్యంలో జేఏసీ అనుబంధ ఉద్యోగ సంఘాల రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. 

సమావేశంలో..జాప్యం లేకుండా మధ్యంతర భృతి ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని, పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని, 11వ పీఆర్సీ ఎరియర్స్‌ తదితర ఆర్థికపరమైన సమస్యలు, పెండింగ్‌ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. సమావేశంలో జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ..ఉద్యోగుల న్యాయమైన సమస్యలను దఫదఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. 

ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆకాంక్షల మేరకు భవిష్యత్‌లో ఉద్యమం చేపట్టాలని, అవసరమైతే ఐక్య ఉద్యమ కార్యాచరణకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే ఉద్యమాలకు ఉద్యోగ సంఘాలను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం, జిల్లా, డివిజన్‌ వారీగా సమావేశాలు నిర్వహించాలని, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలివ్వాలని అన్ని డివిజన్లలో డిమాండ్లతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌ సమస్యలు, ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించామన్నారు. 

తమతో కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమం చేపడతామని చెప్పారు. రాష్ట్రస్థాయి నుంచి డివిజన్‌ స్థాయి వరకు అన్ని డిపార్ట్‌మెంట్‌ సంఘాలతో ఈ నెల 25 నుంచి జూలై 10 వరకు కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించామన్నారు. అప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో జేఏసీ నేతలు ఫణిపేర్రాజు, తిమ్మసర్తి నాగేశ్వరరావు, మహిళా నేతలు పి.లక్ష్మి, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement