
శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానం భూమి పరిరక్షణకు కీలక ఆదేశాలు
ఈ భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్న లేఖ అమలు నిలిపివేత
ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని స్పష్టీకరణ
ఆలయ భూములను తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉందో తేలుస్తామన్న హైకోర్టు
దీనిపై థర్డ్ పార్టీ హక్కులను సృష్టించవద్దని సర్కారుకు స్పష్టీకరణ
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు అధికారులకు ఆదేశం
దీంతో భూమిని కొట్టేయాలన్న ప్రభుత్వ పెద్దల కుట్రలు భగ్నం
సాక్షి, అమరావతి: వేల కోట్ల రూపాయల విలువైన 1,036.37 ఎకరాల దేవదాయ భూమిని అక్రమంగా కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రను హైకోర్టు భగ్నం చేసింది. ఎన్‌టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానానికి ఇదే మండలం నారికంపాడు గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న ఈ భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌ను కోరుతూ దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ ఏడాది ఆగస్టు 13న రాసిన లేఖ అమలును హైకోర్టు నిలిపేసింది.
ఈ భూమి విషయంలో ఎలాంటి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు దేవస్థానాలకు చెందిన భూములను తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఏం అధికారం ఉందో తేలుస్తామంది. దీనిపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబర్ 27న తదుపరి విచారణ
ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా దేవదాయ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా కలెక్టర్, శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానం ఈవోలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.
హైకోర్టు ఉత్తర్వులు 28.35 ఎకరాలకే, కానీ..
వ్యాజ్యానికి సంబంధించి 1,036.37 ఎకరాల భూమిలో 28.35 ఎకరాల భూమి తమదేనంటూ మేకా తనుజ్ రంగయ్య అప్పారావు మరికొందరు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ 28.35 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ 28.35 ఎకరాలను మాత్రమే నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 18న తీర్పునిచ్చారు.
ఈ తీర్పును అమలు చేయాలంటూ అప్పారావు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పును జిల్లా రిజిస్ట్రార్ ద్వారా దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఏకంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే 1,036.37 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు.
అప్పీల్‌కూ వెళ్లని వైనం
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యాంశం ఏమిటంటే.. 28.35 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని, అది తమ భూమేనంటూ వాదించిన దేవదాయ శాఖ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ సైతం దాఖలు చేయలేదు. ఈ భూమిని కాజేయాలని కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుట్రపన్నడంతో దేవదాయ శాఖ అప్పీల్ జోలికి వెళ్లకపోవడం గమనార్హం.
28.35 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు ఎలా రిజిస్టర్ చేశారు? :పిటిషనర్ వాదనలు
ఈ మొత్తం వ్యవహారంపై గంపలగూడెంకి చెందిన అన్నవరపు క్రాంతికుమార్, విజయవాడకు చెందిన న్యాయవాది అనంతలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపించారు. వాస్తవానికి 28.35 ఎకరాల భూమి దేవదాయ భూమి అయినప్పుడు, దానిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం ఎలా సాధ్యమని ఈ సందర్భంగా వాదించారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ప్రైవేటు వ్యక్తుల పేరు మీద ఎలా రిజిస్టర్ చేశారో అర్థం కావడం లేదన్నారు.
ఎకరాకు రూపాయి చొప్పున భత్యం: ప్రభుత్వ వాదనలు
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, జిల్లా కలెక్టర్ ఈ భూమిని ఎకరాకు రూ.1.04 చొప్పున ఏడాదికి రూ. 1,080 భత్యం చెల్లించే ఒప్పందంతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 1991 నుంచి 2006 వరకు భత్యం చెల్లించడం జరిగిందన్నారు. ఆ తరువాత ఈ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగిందని తెలిపారు.
వెలుగులోకి తెచ్చిన సాక్షి
1, 036.37 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ రాసిన లేఖ వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘గుడి వెనుక గూడు పుఠాణీ’ పేరుతో ఈ సెప్టెంబర్ 12న ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ పెద్దల్లో కలవరం సృష్టించింది.