breaking news
endowment land
-
1,036 ఎకరాల ఆలయ భూమికి హైకోర్టు 'రక్ష'!
సాక్షి, అమరావతి: వేల కోట్ల రూపాయల విలువైన 1,036.37 ఎకరాల దేవదాయ భూమిని అక్రమంగా కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రను హైకోర్టు భగ్నం చేసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానానికి ఇదే మండలం నారికంపాడు గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న ఈ భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌ను కోరుతూ దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ ఏడాది ఆగస్టు 13న రాసిన లేఖ అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ భూమి విషయంలో ఎలాంటి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు దేవస్థానాలకు చెందిన భూములను తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఏం అధికారం ఉందో తేలుస్తామంది. దీనిపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.అక్టోబర్ 27న తదుపరి విచారణఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా దేవదాయ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా కలెక్టర్, శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానం ఈవోలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. హైకోర్టు ఉత్తర్వులు 28.35 ఎకరాలకే, కానీ..వ్యాజ్యానికి సంబంధించి 1,036.37 ఎకరాల భూమిలో 28.35 ఎకరాల భూమి తమదేనంటూ మేకా తనుజ్ రంగయ్య అప్పారావు మరికొందరు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ 28.35 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ 28.35 ఎకరాలను మాత్రమే నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 18న తీర్పునిచ్చారు. ఈ తీర్పును అమలు చేయాలంటూ అప్పారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పును జిల్లా రిజిస్ట్రార్ ద్వారా దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఏకంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే 1,036.37 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు.అప్పీల్‌కూ వెళ్లని వైనంఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యాంశం ఏమిటంటే.. 28.35 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని, అది తమ భూమేనంటూ వాదించిన దేవదాయ శాఖ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ సైతం దాఖలు చేయలేదు. ఈ భూమిని కాజేయాలని కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుట్రపన్నడంతో దేవదాయ శాఖ అప్పీల్ జోలికి వెళ్లకపోవడం గమనార్హం. 28.35 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు ఎలా రిజిస్టర్ చేశారు? :పిటిషనర్ వాదనలుఈ మొత్తం వ్యవహారంపై గంపలగూడెంకి చెందిన అన్నవరపు క్రాంతికుమార్, విజయవాడకు చెందిన న్యాయవాది అనంతలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపించారు. వాస్తవానికి 28.35 ఎకరాల భూమి దేవదాయ భూమి అయినప్పుడు, దానిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం ఎలా సాధ్యమని ఈ సందర్భంగా వాదించారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ప్రైవేటు వ్యక్తుల పేరు మీద ఎలా రిజిస్టర్ చేశారో అర్థం కావడం లేదన్నారు. ఎకరాకు రూపాయి చొప్పున భత్యం: ప్రభుత్వ వాదనలుప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, జిల్లా కలెక్టర్ ఈ భూమిని ఎకరాకు రూ.1.04 చొప్పున ఏడాదికి రూ. 1,080 భత్యం చెల్లించే ఒప్పందంతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 1991 నుంచి 2006 వరకు భత్యం చెల్లించడం జరిగిందన్నారు. ఆ తరువాత ఈ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగిందని తెలిపారు.వెలుగులోకి తెచ్చిన సాక్షి1, 036.37 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ రాసిన లేఖ వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘గుడి వెనుక గూడు పుఠాణీ’ పేరుతో ఈ సెప్టెంబర్ 12న ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ పెద్దల్లో కలవరం సృష్టించింది. -
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
దేవాదాయశాఖ స్థలంలో పేదల ఇళ్లు కోర్టు ఆదేశాలతో తొలగించే యత్నం అడ్డుకున్న స్థానికులు.. ఆత్మహత్యాయత్నం.. ఏప్రిల్ వరకు గడువిప్పించిన ఎమ్మెల్యే గోరంట్ల ఆవలోని వాంబే గృహాల్లో ఇళ్లు ఇస్తామని హామీ సాక్షి, రాజమహేంద్రవరం : దేవాదాయశాఖ స్థలంలో నిర్మించుకున్న ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు వైపు 37వ డివిజన్ పరిధిలోని వీరభద్రపురంలో టౌన్ సర్వే నంబర్ 919లో దువ్వూరి వెంకాయమ్మ సత్రం భూమి 526 చదరపు గజాలు ఉంది. ఈ భూమి పందిరి మహదేవుడు సత్రం ఆధీనంలో ఉంది. ఆ భూములను ఆక్రమించుకున్న 19 మంది 50 ఏళ్లుగా పెంకుటిళ్లు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఈ భూములు ఖాళీ చేయించేందుకు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌లో పందరి మహదేవుడు సత్రం అధికారులు కేసు వేశారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఆ భూమిని ఖాళీ చేయాలని ఆక్రమణల తొలగింపు అధికారి ఇన్చార్జ్ డీసీ డీఎల్వీ రమేష్‌బాబు వారికి మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. ప్రతిసారీ రాజకీయ పార్టీల నేతలు జోక్యం చేసుకుంటుండడంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సోమవారం వారిని ఖాళీ చేయించేందుకు ఇన్చార్జ్ డీసీ రమేష్‌బాబు, పందిరి మహదేవుడు సత్రం ఈవో సుబ్రమణ్యం నేతృత్వంలో 50 మంది దేవాదాయ శాఖ సిబ్బంది వచ్చారు. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి సీఐ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుళ్లు వచ్చారు. తాము ఇళ్లు ఖాళీ చేయబోమని అక్కడి వారు భీష్మించారురు. బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నించడంతో స్థానికుల్లో ఒకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయారు. అతడి ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. కేబుల్ వైర్లు, విద్యుత్ సౌకర్యం తొలగించారు. మహిళలు ఇంట్లో వస్తువులు ఓ వైపు తీసుకొస్తుండగానే దేవాదాయ శాఖ అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారులకు, స్థానికులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. స్థానిక కార్పొరేటర్ పెనుగొండ విజయభారతి, ఇతర కార్పొరేటర్లు తంగెళ్ల బాబి, పాలవలస వీరభద్రం, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని బాధితులకు అండగా నిలిచారు. అయినా సిబ్బంది ఆక్రమణల తొలగింపు చేపట్టడంతో సమాచారం అందుకున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ఇతర అనుచరులతో ఘటనా స్థలానికి వచ్చారు. ఆదివారం ఈ విషయం ఈవో సుబ్రమణ్యంతో చర్చించినా తన మాట ఖాతరు చేయకుండా తొలగింపు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరికీ ఆవ రోడ్డులోని వాంబే గృహాలు కేటాయించనున్నామని, ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రకియ నిలిచిపోయిందన్నారు. మార్చి 25 తర్వాత వీరికి ఇళ్లు కేటాయించిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో ఆక్రమణలు తొలగింపజేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు కూడా ఆగకుండా పేదలపై దేవాదాయ శాఖ సిబ్బంది ప్రతాపం చూపడం భావ్యం కాదన్నారు. ఎమెల్యే విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ వరకు గడువు ఇచ్చిన దేవాదాయ శాఖ ఇన్చార్జ్ డీసీ రమేష్‌బాబు సిబ్బందితో తిరిగి వెళ్లిపోయారు. ఏప్రిల్ మొదటి వారం వరకు గడువిచ్చామని, ఆ తర్వాత ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని రమేష్‌బాబు స్పష్టం చేశారు. -
ఆక్రమణకు తెగబడ్డ ‘తమ్ముళ్లు’
తూరంగి (కాకినాడ రూరల్) :దేవాదాయ భూముల ఆక్రమణకు తెలుగుతమ్ముళ్లు తెగబడ్డారు. ప్రజాప్రతినిధుల అండ చూసుకుని దేవాదాయ భూములను ఆక్రమించి లీజుకు బేరం పెట్టేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ మండలం తూరంగిలో తురంగేశ్వరస్వామి ఆలయానికి పగడాలపేట సమీపంలో సర్వేనంబరు 207/3లో 27.15 ఎకరాల భూమి ఉంది. ఇందులో పది ఎకరాల భూమిని ఏడాదికి రూ.60 వేలు ఇచ్చేందుకు చిర్ల సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తికి దేవాదాయ శాఖాధికారులు కౌలుకు ఇచ్చారు. ఈ భూములకు అనుకుని ఉన్న మరో ఐదెకరాల భూమిని మరో వ్యక్తి ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసుకున్నాడు. ఇది తెలిసినా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. ఇదే అలుసుగా తీసుకున్న గ్రామస్తులు మరో మూడెకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం ఆక్రమించి, పట్టాలివ్వాలని గత నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇదే అదనుగా భావించిన అధికార పార్టీకి చెందిన కొందరు ఖాళీగా ఉన్న ఆలయ భూములపై కన్నేశారు. దీంతో పగడాలపేటను ఆనుకుని ఉన్న ఐదెకరాల భూమిని ఆక్రమించి, ఓ వ్యక్తికి రొయ్యల చెరువులు తవ్వుకునేందుకు లక్ష రూపాయలకు లీజుకు ఇచ్చేశారు. దీనిలో గ్రామ పెద్దలకు రూ.30 వేలు ఇచ్చేందుకు, మిగిలిన రూ.70 వేలు స్థలాక్రమణలో భాగస్వామ్యం ఉన్న 20 మంది పెద్దలు పంచుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తురంగేశ్వరస్వామి ఆలయ భూమి ఐదెకరాలను లీజుకు ఇచ్చేశారు. లీజుకు తీసుకున్న వ్యక్తులు భూమిని రొయ్యల చెరువులుగా మార్చేందుకు ప్రయత్నించడంతో ఆదివారం తురంగేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి గుత్తుల త్రిమూర్తులు.. ఉత్సవ కమిటీ సభ్యులతో వెళ్లి అడ్డుకున్నారు. దీంతో దేవాదాయ భూమిని ఆక్ర మణదారులుగా ఉన్న గరికిన వేమన, గరికిన అప్పన్న, ఇజ్రాయిల్, చోడిపల్లి కొత్తబాల, మోసా భయ్యన్నతో పాటు 20 మంది వ్యక్తులు అక్కడికి చేరుకుని అధికారులపై తిరగబడ్డారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఈఓ త్రిమూర్తులు ఆక్ర మణదారులపై ఇంద్రపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎ.మురళీకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దేవాదాయ భూమిలో చెరువు తవ్వకానికి ఉపయోగిస్తున్న పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ భూమిని ఆక్రమించి లీజుకు ఇచ్చినట్లు ఈఓ త్రిమూర్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వేమన, అప్పన్న, ఇజ్రాయిల్, కొత్తబాల, భయ్యన్నను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. తాము దేవాదాయ భూమిని వదిలేస్తామని, ఆ భూమిలోకి రామని ఆక్రమణదారులు రాతపూర్వకంగా ఇచ్చారని ఈఓ చెప్పారు. ఆక్రమణను అడ్డుకున్న వారిలో ఉత్సవ కమిటీ సభ్యులు డి.భానుమతిభగవాన్, నున్న దుర్గాప్రసాద్, మేడిశెట్టి శేషగిరి, కర్రి గణపతిరెడ్డి, తాతారావు తదితరులు ఉన్నారు.